ఫొటో స్మ ృతి

చిన్ని నారాయణరావు
94402 02942
ఇప్పుడు
ఫొటో ఒక పల్లవి లేని పాటయ్యింది
పందిరి లేని తీగయ్యింది
ఛత్రం లేని చిత్రమయింది
అసంతృప్త చరణాల తోటయ్యింది
ఒకప్పుడు
ఫొటో అంటేనే అపురూప కార్యక్రమంగా భాసిల్లేది
ఇల్లంతా సందళ్ళ పండుగయ్యేది
తాతా నానమ్మల బోసి నవ్వుల సెలయేరయ్యేది
పిల్లలు రంగు రంగుల సీతాకోక చిలకలై
అలరారే సమయం ఆసన్నమయ్యేది!

అదో కుటుంబ నేపధ్యానికి ఎక్స్‌రే సంకేతమయ్యేది
మెడలో కెమెరాతో సినీ దర్శక వేషధారి ప్రత్యక్షమయ్యేవాడు
ఆ వైభవానికేమి దిష్టి తగిలిందే ఏమోకాని
జోబుల్లోని సెల్‌ఫోన్లన్నీ
ఛాయా చిత్రాల దడులయ్యాయి
ఆధునికత దుశ్శాసనమై
ఫొటో విలువల వలువలు ఊడ్చేసింది!
స్టూడియో విఫణి మరణించింది
అదో గతం తాలూకు జ్ఞాపకంగా
వీడియో ఆగంతకుల నవ్వుల పువ్వుల్లో
ఓ స్మ ృతిలా మిగిలిపోయింది!