కడగండ్ల వాన

ధాత్రి
''యాలా పాలా లేదు, సలికాలం ఎండాకాలమని లేదు, హౌరున కురుస్తాంది పాడు వాన.'' ముత్యాలమ్మ తిట్టుకుంటూ నీళ్లు కారుతున్న చోటల్లా నొక్కులు పోయిన సత్తు గిన్నెలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.
వారం రోజుల నుంచీ ఎడతెరిపి లేదు. ఊరంతా జల్లుల్లో తడిసిపోతా ఉంది. ఊరితో పాటు ఊరి చివరనున్న ఆ 'ఇల్లు' కూడా. ఎన్నేండ్ల కిందటో కట్టిన మట్టి గోడలు నాని, నాని ఎప్పుడెప్పుడు పడిపోదామా అన్నట్లున్నాయి. వెదురు దిమ్మలు గాలికి ఊగుతూ ఉన్నాయి. పైన కప్పిన తాటాకులు సగం ఎగిరిపోగా మిగిలినవి పైనుంచి జాలిగా లోపలి మనుషులను చూస్తూ ఉన్నాయి. నేలలో తడవని భాగం కోసం వెతుకుతూ ఇంట్లో మనుషులు. వాళ్ళు కూడా తడిచిపోయారు. పైనా లోపలా కూడా. మనుషులంటే ముగ్గురు పెద్దవాళ్ళు. ముగ్గురు చిన్న పిల్లలు. బేల్దారి పనికి పోయే కుళ్లాయప్ప, అతని భార్య ముత్యాలమ్మ, వయసుతో పాటు అనారోగ్యమూ పెరిగిన కుళ్ళాయప్ప తల్లి ఇంకా ఇద్దరు కొడుకులూ, కూతురూ. దాదాపు ఆరు నెలల పాటు, కరోనా పుణ్యమా అని పనులన్నీ నిలబడిపోయి, కుళ్లాయప్పకు పని లేకుండా పోయింది. కరోనా కాస్త తగ్గు ముఖం పట్టి, మెల్లగా పనులన్నీ మొదలవుతున్న కాలంలో వాన వదలకుండా పట్టుకుంది. మళ్ళీ పనులు ఆగిపోయాయి. వచ్చిన ఆదాయంలో ఇంట్లో మనుషుల తిండి కంటే కుళ్లాయప్ప తాగుడుకే ఎక్కువ ఖర్చయి, మిగులంటూ ఏమీ లేకపోవడంతో ఇంట్లో ఉన్న నాలుగు గింజలూ అయిపోయాయి. కరోనా కాలంలో కాస్త మేలు, ఎవరో ఒక పుణ్యాత్ములు కాస్త పెడుతుంటే జరిగిపోయింది. ఇప్పుడేమీ లేదు. తినడానికి లేక పిల్లలు ఒకటే ఏడుపు. వాళ్ళను ఎలా సముదాయించాలో ముత్యాలమ్మకు పాలుపోలేదు. మరోవైపు అత్త ముసలిది, అందులోనూ జబ్బు మనిషి, ఆకలికాగలేదు. ఇంట్లో వండేందుకు ఏమీ లేవు. గంజి చేసి పోస్తామన్నా నూకలు కూడా మిగల్లేదు. ముత్యాలమ్మ పిల్లల బాధ చూడలేక, అభిమానం చంపుకొని అడుక్కొచ్చైనా పెడదామని వానలో తడుస్తూనే ఊర్లోకి పోయింది.
''అమ్మా, ఇంతన్నముంటే పెట్టండమ్మా'' గట్టిగా అరిచేందుకు సిగ్గనిపించి సన్నగా సణిగింది.
ఓ వైపు వాన శబ్దం. మరోవైపు ఈమె చిన్నగా అరవడంతో శబ్దం లోపలి దాకా చేరలేదు. ఎవరూ పలకలేదు. ఓ రెండు మూడు ఇళ్ళ నుంచి ఏ స్పందనా లేకపోవడంతో తరువాత కొంచెం గొంతు పెంచింది. కిటికీ లోనుంచే ఓ గొంతు రయ్యన దూసుకొచ్చింది.
''వానలో కూడా ఈ బిచ్చగాళ్ళ తాకిడి తప్పలేదు. ఏం లేదు పో!''
మారుమాట లేకుండా సిగ్గుతో చితికిపోతూనే మరో ఇంటి ముందు నిలబడి పిలిచింది, ''తినేకేమన్న పెట్టండమ్మ, సిన్నపిల్లోల్లు ఆకలితో ఉండారు.''
ఇంట్లో నుంచి అన్నం రాలేదు కానీ ఉచిత సలహా వచ్చింది, ''పనీ పాటా చేసుకొని బతికేకి చేత కాదా?'' ముఖం మీదనే తలుపు దబ్బని మూసుకుంది.
ఎన్ని ఇళ్ళు తిరిగినా ఇదే పరిస్థితి, అసలు మూసుకున్న తలుపులు తెరుచుకొనే లేదు, ఇంటివీ, మనసులవీ కూడా.
అంత నిరాశలో కాస్త ఆశాజ్యోతిలా ఓ సందు చివర్లో అంత వాన లోనూ ఓ బిల్డింగ్‌ పై రంగురంగుల దీపాలు వెలుగుతూ కనిపించాయి. ఏదో పెండ్లో, పేరంటమో జరుగుతున్నట్టుంది, అక్కడేమైనా తినడానికి దొరకొచ్చు అని ఆశతో అటువైపు కదిలింది ముత్యాలమ్మ.
ఆ రంగుల భవంతికి యజమాని ఊళ్ళో పేరు మోసిన కాంట్రాక్టర్‌. వాళ్ళ ముద్దుల మనవడి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంత వాన లోనూ గొప్ప గొప్ప వాళ్ళందరూ హాజరై పెద్ద పెద్ద బహుమతులు పట్టుకొచ్చారు. ఘనంగా తయారుచేసిన అనేక రకాల వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటలు నోరూరిస్తున్నాయి. ఏడాది వయసున్న పుట్టిన రోజు పిల్లాడు మాత్రం ఉక్కిరిబిక్కిరై ఏడుపు మొదలుపెట్టాడు. వాడిని సముదాయిస్తూ తల్లి బయటకు తీసుకొచ్చి, వానకు తడవకుండా అటూ ఇటూ తిరుగుతూ సముదాయించే ప్రయత్నం చేస్తోంది. ఆమెను చూసిన ముత్యాలమ్మ జాలి గొలిపేలా నీరసంగా అడిగింది.
''చిన్న పిల్లలుండారు, తినడానికేమన్నుంటే ఇయ్యండమ్మ!''
అప్పుడే అక్కడి కొచ్చిన పిల్లాడి తాత ''ఈ బికార్లు అడుక్కుతినే సాకుతో పిల్లల్నెత్తుకు పోతారు. నువ్వు లోపలి కెళ్ళు.'' కోడల్ని కసురుకుని, ''గొప్పోళ్ళ ఇంటి కాడి కొచ్చి దొరికింది తీసుకుపోదామనా, పో ఇక్కడి నుంచి.'' ముత్యలమ్మను కరిచినంత పని చేశాడు. ముత్యాలమ్మ దెబ్బకు భయపడి పోయి కొంచెం దూరం పోయి, ఆ పెద్దమనిషి లోపలికి పోగానే మళ్ళీ గేటు దగ్గర నిలబడి ఏమన్నా దొరుకుతుందేమోనని చూడసాగింది.
గంట సేపు గడిచాక, అతిథులంతా భోజనాలు చేసిన తరువాత ఎంగిలి ప్లేట్లు బయట పడేశారు. గొప్పోళ్ళు కాస్త కొరుక్కొని వొదిలేసిన స్వీట్లు, తినలేక మిగలబెట్టిన అన్నం, కూరలు ... ఇవన్నీ చూడగానే ముత్యాలమ్మకు కడుపు నిండిపోయినంత పనయింది. పడేసిన పదార్థాలలో కాస్త బాగున్నవి ఏరుకొని మెల్లగా సత్తు గిన్నెలోకి వేసుకోసాగింది. ఎక్కడి నుంచో కుక్కల గుంపు భౌ భౌ మంటూ భీకరంగా అరచుకుంటూ వచ్చింది.
''హేరు, హేరు'' అంటూ తోలినా ఇంకాస్త గట్టిగా అరుచుకుంటూ ప్లాస్టిక్‌ ప్లేట్ల మీద పడి చెల్లా చెదురు చేశాయే తప్ప అవి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాటితో పోటీ పడి ఎలాగైతేనేం నాలుగైదు స్వీట్లు చీర చెంగులో మూట కట్టుకొని, ఇంత అన్నమూ, కూరలూ గిన్నెలోకేసుకొని, కొంగు నెత్తిన కప్పుకొని, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఇల్లు చేరింది. తల్లి చేతిలో పదార్థాలను పసిగట్టిన పిల్లలు శక్తి లేకపోయినా సంబరంగా లేచి కూర్చున్నారు. మీదపడి లాక్కోబోతున్న పిల్లలను గదిమి, తలా యింత పెట్టింది. నీరసంగా సొమ్మసిల్లిన అత్తకూ తినిపించింది. డబ్బుల్లేకపోయినా పావలా పరకా అప్పుచేసి తాగొచ్చి పడిపోయిన భర్తను లేపి, అతనికీ వడ్డించింది.
''హమ్మయ్య, ఈరోజు గడిచిపోయింది.'' అనుకుంటూ గోడకానుకొని గిన్నెలో అడుగున మిగిలిన కాస్త నోట్లో పెట్టుకోబోయింది. సరిగ్గా అదే సమయానికి ముసురు వానకు నానిన మట్టి గోడ కూలి, ముత్యాలమ్మ మీద పడింది. ఏమరుపాటులో ఉన్న ముత్యాలమ్మ దబ్బున కిందబడింది. చేతిలో ముద్ద మట్టి పాలయి పోయింది. భోరున వాన... ముత్యాలమ్మ కండ్లలో నుంచి.