అతడికిప్పుడేం కావాలి?

పాయల మురళీకృష్ణ
94410 26977

అతడికిప్పుడేం కావాలి
వాళ్ళు గెలిచారన్న కబురు వినాలి
అప్పటికి గాని అతడి ఊపిరి దూదిపింజై పైకి లేవదు

అతడున్న ముంజూరు
కాలానికి లంగని స్వరపేటికలా వుంది
అతడి వర్తమానం
మేకులు దించిన దారిలాంటి శయనంపై
లెక్కచేయని పయనంలా వుంది
చుట్టూ ఇనుప కంచెల్లాంటి గోడల్ని ఛేదించే చూపులు
మంచం కింద ఉమ్ముతొట్టి కక్కుతున్న
నెత్తుటిలో నిక్కబొడుస్తున్న ధిక్కారాన్ని సంధిస్తున్నాయి

అతడికిప్పుడేం కావాలి?
వాళ్లు గెలిచారన్న కబురు వినాలి!

కాడి పట్టిన నుంచి
మంచం పట్టిన వరకు నాగేటి చాలై నడచినవాడు
ఏడాదేడాది మానేద్దామనుకుంటూనే
మట్టి సింహాసనం పరిత్యజించనివాడు
రాజ్యం ముందు రైతు బతుకులాంటి
ఖాళీ గిన్నై గదిలో మిగిలాడు
గది విముక్తిని వేడుకుంటూ ప్రతి రోజూ
కొన్ని లేత మునివేళ్లు కిటికీకవతలవైపు
పువ్వుల్ని పేర్చి వెళ్ళిపోతున్నాయి

అతడికిప్పుడేం కావాలి?
వాళ్లు గెలిచారన్న కబురు వినాలి!

మూతపడని నయనంలో
రహదారి దిగ్బంధం ప్రతిబింబిస్తోంది
కదిలించలేని పాదాల మీద
లక్షలాది నడకలు ప్రతిఫలిస్తున్నాయి
ఎత్తలేని చేతులు
ఎగసే విజయకేతనాలను కలగంటున్నాయి
ఆ గొంతు
మూగగా నినదించే సంద్రమై ఉప్పొంగుతోంది
వెళ్లిపోవాల్సిన వాడే ఆగిపోయాడు..

ఈ దేశం ముందు
నాగలే విజయానికి సంకేతమై నిలిచిందని
ఆ హృదయానికి చేరేంతవరకూ
కొమ్మకు అతి కష్టం మీద అంటి పెట్టుకుని ఉన్న
పండుటాకు సంతృప్తిగా రాలిపడదు!