డాక్టర్ కె.జి.వేణు
98480 70084
సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే 1951లో రాయగా, 1952లో ప్రచురితమై, 1953లో పులిట్జర్‌బహుమతిని, 1954లో నోబుల్ బహుమతిని సొంతం చేసుకున్న 'ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ' నవల, ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై, కాలంతోపాటు నిలిచిన ఉత్తమ నవలల సరసన తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ నవలలో 'శాంటియాగో' పేరుగల ముసలోడు 84 రోజులు చేపల వేటకు వెళ్లినా రోజూ ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చేవాడు. 85వ రోజున మళ్లీ చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలోనే మూడు రోజులు రాత్రింబగళ్లు గడిపి, చివరకు 18 అడుగుల భారీకాయం కలిగిన చేపను పట్టి, దాన్ని ఒడ్డుకు తీసుకురావటానికి అతడు చేసిన పోరాటాన్ని టన్నుల కొద్ది కాగితాలనిండా విశ్లేషకులు, విమర్శకులు, సాహితీవేత్తలు తమ ప్రశంసలను అన్ని భాషల్లోనూ గ్రంథస్థం చేశారు. కాని అసలు పోరాటం జరిపిన నన్ను అనగా ముసలాడు పట్టిన భారీ చేపను మాత్రం అందరూ మరచిపోయారు. 'ఓ నా సాహితీవేత్త లారా! ప్రపంచంలో ఎందరో చేసిన పోరాటాల కంటే భయంకర మైన పోరాటాన్ని నేను చేశాను. మరి నా గురించి మీరెందుకు మాట్లాడుకోవటం లేదు. నా పోరాటాన్ని ఎందుకు ప్రశంసించటం లేదు. నా చావు పట్ల మీరెవరూ కన్నీళ్లు కార్చనక్కరలేదు, నా పోరాటాన్ని ఒక్కసారి గుర్తించండి చాలు. నవలలో కనిపించని, వినిపించని, రచయిత కలం నుంచి వెలువడని అంతర్లీన విశేషా లను తెలుసుకోవాలనుకొనే ఆసక్తి మీకుంటే ఒక్కసారి మీరంతా నాతో కలిసి సముద్రమనే మా సామ్రాజ్యంలోకి నాతో పాటు అడుగులు వేయండి.
ఆ మహాసముద్రమే మా సామ్రాజ్యం. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎన్నో పోరాటాల్లో విజయం సాధించి నా వీరత్వానికి మా సమూహం చేత సంబరాలు చేయించుకున్నాను. పసితనం నుంచే పోరాటాలంటే మక్కువ పెంచుకున్నాను. చిన్నప్పుడు పెద్దలు చెప్పినా వినకుండా సముద్రపు లోతుల్లోకి వెళ్లి వింత వింత ప్రాణుల్ని సరదాగా తాకి, వాటిని రెచ్చకొట్టి, నా వెంటబడితే దొరక్కుండా తప్పించుకున్న సరదాలు నాకు చాలా సంతోషానిచ్చేవి. వాటిని కథలుగా నా సమూహానికి వివరించినప్పుడు, మెచ్చుకుంటూ అందరూ నా చుట్టూ చేరి ఈతలోని అన్ని విద్యలు ప్రదర్శించేవారు. నా పెంపకం మా సమూహంలో చాలా ప్రత్యేకంగా జరిగింది. వయసు పెరుగు తున్న కొద్దీ నా శరీరం చాలా బలిష్టంగా, పొడవుగా తయారైంది. దాంతో పాటు నాకు ధైర్య సాహసాలు కూడా పెరిగాయి. నా బలం నా సమూహాన్ని రక్షించుకోవటానికి చాలా సందర్భాల్లో ఉపయోగపడింది. ఓ మారు షార్క్ చేపలు మా మీదికి దాడి చేశాయి. మాలో సగంమంది వాటికి ఆహారమై పోవటం ఖాయమనుకున్నారు. భయంతో వణికిపోయారు. ఆ క్షణంలో ఒంటరి గానే పోరాటానికి సిద్ధపడ్డాను. నేను బలంగా, వేగంగా రెప్ప పాటులో కదిలించి, విదిలించిన నాతోక ధాటికి వచ్చిన షార్క్ చేపలకు ఊపిరి ఆగిపోయింది. చాలా వాటికి ఎముకలు విరిగిపోయాయి. దొరికిన వాటినల్లా నా పళ్లతో కొరికి చంపేశాను. వెంటపడి, వెంట పడి వాటి భరతం పట్టాను. చివరికి వాటిని కనిపించనంత దూరం తరిమికొట్టాను. నా సమూహ మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. నా విజయానికి వేడుకలు చేశారు. ఆ రోజే నా సమూహ సామ్రాజ్యానికి నన్ను రక్షణ కవచంగా ప్రకటించుకున్నారు. ఆ రోజునుంచి వాళ్ల రక్షనే నా బాధ్యతగా మారిపోయింది. క్రమ క్రమంగా మా నివాస ప్రాంతం కొన్ని మైళ్ల దూరం విస్తరించుకోవటానికి కూడా సాయపడ్డాను.
ఇంతటి చరిత్ర ఉన్న నేను ముసలోడి గాలానికి ఎలా చిక్కానో అర్థం కావటంలేదు. గతంలో ఇలాంటి గాలాలు చాలా చూశాను. దేని మాయలోనూ పడలేదు. అప్రమత్తత ఎప్పుడూ నాతోనే వుండేది. తెల్లారటానికి రెండు గంటలముందు ఒక్కడిని నీటిలోపల విన్యాసాలు చేసుకుంటూ ఈత కసరత్తులు చేసు కోవటం నా దినచర్యల్లో ఒకభాగం. అంతా అయ్యాక చీకటుండగానే నీటి పైభాగాన వెల్లకిలా పడుకోవటం నాకిష్టం. మసక చీకట్లో వీస్తున్న చల్లటిగాలి, ఏదో మత్తును వొంటికందించి వెళ్తున్నట్లుగా వుంటుంది. అ అనుభవం కోసమే రోజూ నేను నీటి పైపొరలమీదికి నా శరీరాన్ని చేరవేసుకుంటూ వుంటాను. ఎంతో భారీగావున్న నా దేహం ఆ సుఖంలో గరికమాదిరి తేలిపోతూ వుంటుంది. ఆ రోజూ అన్నీ అలాగే జరిగాయి. ఆ తరువాతే నేను వూహించనిది జరిగింది. ఆ ముసలాడి గాలానికి దొరికిపోయాను. ఒక్కసారిగా నా తప్పిదం తెచ్చిన ప్రమాదాన్ని గుర్తించాను. అయినాసరే అధైర్యపడలేదు. ఎన్నో సాహసాలు నేర్పిన నా ధైర్యమే నా బలమయింది. చింతించటం మానేసి పోరాటానికి సిద్ధపడ్డాను.
నా నోట్లోకి బలంగా దూరిపోయిన గాలం కొక్కిని విడిపించు కోవటానికి విశ్వప్రయత్నం చేశాను. దానిని గట్టిగా ఒక్కలాగు లాగాను. అంతే పడవ మొత్తం కదిలిపోయింది. జాడించిన నా తోక ధాటికి చుట్టూవున్న నీరంతా అల్లకల్లోలమయింది. అలల మీద పడవ అదుపు తప్పేలా కనిపించింది. దాన్ని లాక్కుంటూ ముందుకెళ్లిపోతున్నాను. జారిపోతున్న తీగల్ని జాగ్రత్తపడి గట్టిగా కడుతున్నాడు ముసలోడు. ఇంతలో సూర్యోదయమయింది. రోజూ ఆ వెలుగుల్ని చూడటం నాకు చాలా ఇష్టం. చావు పోరాటంలో సైతం నా కోరికను చంపుకోలేకపోయాను. మెల్లగా తేలుతూ పైకొచ్చాను. లేతభానుడి కిరణాలతో సముద్రం ఒంటిమీద ముత్యాల రాసుల జాతర మొదలయింది. నీటిలోపల చీకట్లు సైతం మెల్లమెల్లగా పారిపోతున్నారు. ఉదయం ఆకాశాన్ని చూస్తూ మేఘాలతో కబుర్లు చెప్పటం రోజూ నేను తీర్చుకొనే కోరికల్లో ఒకటి. మొదటిసారి ఆ కోరిక తీరకుండానే కాలం దాటిపోయింది.
తీగను మరింత పైకిలాగి కట్టాడు ముసలోడు. నా బరువెంతో తెలిసిపోయినట్లుంది. మరింత జాగ్రత్త పడ్డాడు. ఇంతలో ఒక పక్షి వచ్చి పడవ మీద వాలింది. దానిముక్కు నాకు చాలా పరిచయం. చాలాసార్లు నా సమూహంలోని చేపల్ని తినటానికి వచ్చేది. నా తోకతో దాన్ని విసిరికొట్టేసరికి దానిముక్కు విరిగి పోయి బతుకు దేవుడా అనుకుంటూ ఎగిరి పోయింది. ఇప్పుడు అది నన్ను గమనించే వచ్చింది. ఎగతాళిగా అరిచింది. ఆనందం తో రెక్కలు ఆడించింది. సంతోషం పట్టలేక కాళ్లతో నాట్యం చేసింది. ఇదంతా ముసలోడికి అర్థంకాక దాన్ని తరిమికొట్టాడు. అది ఎగురుతూ అరచిన అరుపులకు అర్థమేమిటో నాకు తెలుసు. నిస్సహాయంగా దానివైపే చాలాసేపు చూశాను. నేను నిశ్శబ్దంగా వుండిపోవటం చూసి అలసిపోయాననుకున్నాడు ముసలోడు. అది అలసట కాదు. ఎలాగైనా ఈ ప్రమాదంనుంచి బయటపడాలన్న ఆలోచన. నా దవడలు గాయమై రక్తం ధారగా కారుతోంది. నా మెదడు మాత్రం చురుగ్గానే పనిచేస్తోంది. తప్పించుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను. అవకాశాన్ని బట్టి తోకను బలంగా జాడిస్తున్నాను. ఆ దెబ్బకు ముసలాడు చాలాసార్లు పడవలో పడిపోయాడు. నా తెలివికి తేరుకోలేక పోయాడు.
నేను మెల్లగా పైకి తేలడం చూసి ఆనందం పట్టలేక పోయా డు. నేను పైకి లేచినప్పుడల్లా నా మీదినుంచి రెండు పక్కలకు నీళ్లు జలపాతాల్లా జారుతున్నాయి. పొడవైన నా ముక్కును చూసి ఆశ్చర్యపోయాడు. కత్తిలా కదలాడే నా తోకను చూసి మాటరాక నిలబడిపోయాడు. ఉన్నట్టుండి మళ్లీ నీళ్లల్లోకి మునిగి తోకతో పడవను కసికొద్ది బలంగా కొట్టాను. అది గిర, గిరా తిరిగింది. దాంతోపాటు నేనూ తిరిగాను. విశ్వ ప్రయత్నాలు చేసినా గాలం కొక్కినుంచి వేరుపడలేక పోయాను. గాలానికి కట్టిన వైర్లను కొరికి తప్పించుకోవాలనుకున్నాను. అది సాధ్యం కాలేదు. ఆగని నా పోరాటాన్ని చూసి కోపం పట్టలేక నన్ను ఎలాగైనా చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు ఇద్దరి మధ్య దాదాపు ఒక భయం కర యుద్ధమే జరిగింది. కాని ఇది న్యాయమైన, ధర్మమైన యుద్ధం మాత్రం కాదు. ఈ యుద్ధంలో ఒక మోసం నన్ను బందీగా మార్చింది. నిరాయుధ స్థితిలో యుద్ధం చేయాల్సి వచ్చింది. నన్ను స్వేచ్ఛగా వదిలితే, నా విజయాన్ని ప్రతి నీటిబిందువు ఒక చరిత్రగా రాసేది. నేను గాలిలోకి ఎగిరి తిరగబడితే ఇలాంటి పడవలు వంద అయినా నామరూపాలు లేకుండా పోయేవి. రెక్కలు విరిచి ఎగరమంటే ఏ పక్షికి సాధ్యం. పాదాలకు మేకులు బిగించి పరిగెత్తమంటే చిరుతకైనా సరే అది సాధ్యం కాదు. చేతులు నరికేసి విలుకాడిని బాణం సంధించమంటే అది న్యాయం ఎలా అవుతుంది. నా పరిస్థితి ఇప్పుడు అలాగే వుంది. అయినాసరే పోరాటానికే సిద్ధపడ్డాను నేను. నాకు భయం లేదు, భీతి లేదు, చస్తానన్న దిగులు అంతకన్నా లేదు. నాకు తెలిసింది పోరాటం మాత్రమే. ధీరుడు ప్రాణం గురించి ఆలోచించడు, పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కొనవూపిరిలో సైతం విజయాన్ని అందుకోవటానికే శక్తిని కూడదీసుకుంటాడు. ఆ వీరుల వరుసల్లో నిలబడ్డ వీరత్వం నాది. ఈ యుద్ధానికి మానసికంగా నన్ను నేను తయారుచేసుకున్నాను. మెల్ల మెల్లగా నీటిలోపలికి వెళ్లాను. ఒక్కసారిగా నీటి పైకొచ్చి పడవమీద మరోమారు గట్టిదెబ్బ కొట్టాను.
నేను కొట్టిన దెబ్బకు పడవ తల్లకిందులైనట్లయింది. కాని వెంటనే సర్దుకుంది. పడవను నాశనం చేయటం నా ఉద్దేశం కాదు. నేను ఈ గాలం కొక్కినుంచి తప్పించుకోవాలి. ఎలా? ఎలా? దాదాపు ఒక రోజంతా ఏకధాటిగా కొక్కీని కొరుకుతూ ఈ దురదృష్టంనుంచి బయటపడటానికి గిల గిలా నీటిలో కొట్ట కున్నాను. నా ధాటికి నీరంతా ప్రళయం వచ్చినట్లు సుడులు, సుడులుగా తిరిగింది. శక్తినంతా కూడదీసుకొని దాడి చేస్తూనే వచ్చాను. ఎంత శ్రమపడ్డా ఫలితం మాత్రం శూన్య హస్తాలతో ఎదురొచ్చింది. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూవుంటే నామీద నాకే పిచ్చి కోపం ఉప్పెనలా తన్నుకొచ్చింది. మొదటిసారి నా కళ్లల్లో తడిని చూశాను, నా వొంటిమీద మొప్పలు మూలగటం విన్నాను. సముద్రం మీద ఆ రోజుకు వెలుగు దిగిపోతూ చీకటికి ఆహ్వానం పలుకుతోంది. ఇప్పుడు చుట్టూ గాఢాంధకారం. క్రమ క్రమంగా నాలోనూ శక్తి పూర్తిగా నశించిపోయింది. నా తోక నాకే భారంగా మారిపోయింది. మునుపటిలా ఎటూ కదిలలేక పోయాను. కొక్కి మూలంగా దవడలకు భయంకరమైన గాయమైంది, దాని మూలంగా భరించలేని నొప్పి నా ప్రాణం మీద శత్రువులా దాడి చేయటం ప్రారంభించింది. నాలోని నరాలన్నీ ముక్కలు, ముక్కలుగా తెగిపోయి సెలవు తీసుకోవటానికి సిద్ధపడ్డాయి. కళ్లు శాశ్వత నిద్ర కోసం దారులు వెతుక్కోవటం ప్రారంభించాయి. పోరాడి గెలవాలన్న పౌరుషం ఇంకా నాలో బతికేవున్నా, నిస్సత్తువ మాత్రం నన్ను అచేతనంగా నీటిమీద తేలేలా చేసింది. ఓడిపోవడమంటే ఇదేనేమో. తలవంచటం ఇన్నాళ్లు నా తలరాతలో లేదనుకున్నాను. తల్లకిందులైపోయిన ఈ జీవిత ఆఖరి అధ్యాయంలో ఆయువు చివరి క్షణాలు కాలం హాజరుపట్టీలో సంతకాలు పెట్టటానికి ఉత్సాహంగా నిలబడ్డారు.
ముసలోడు నాకోసం వెతుకుతున్నాడు. అలలధాటికి నేను పడవకు దగ్గరగా వచ్చాను. అతడు సంతోషించాడు. చివరిసారి శక్తినంతా కూడదీసుకొని తోకతో పడవను బోల్తా కొట్టించా లనుకున్నాను. కాని నాలో జీవం పూర్తిగా కరువైపోయింది. తోకను అంగుళం కూడా కదలించలేక పోయాను. నిరాశ జోరుగా జోల పాటలు పాడటం మొదలుపెట్టింది. కళ్లు మూతలుపడుతున్నాయి. నీటిమీద తేలిపోతున్నాను. ప్రతిఘటన నాకు చాలా ఇష్టమైన పదం. చివరకు ఇష్టాలన్నీ మిగలకుండా పోయాయి, అయిష్టమైన మరణం మాత్రం నక్కలా నా పక్కనే కాచుకొని వుంది. సరిగ్గా ఈ అవకాశం కోసమే ముసలాడు కాచుకొని ఉన్నాడు. ఇప్పుడు నన్ను అతి దగ్గరగా చూస్తున్నాడు. నా భారీ శరీరాన్ని చూశాక ఆశ్చర్యం, ఆనందం రెండింటి మధ్య ఉక్కిరిబిక్కిరై నలిగి పోయాడు అతని చూపుల్లో నన్ను చంపాలనే తీవ్రమైన తపన, లావాలా అతడి కళ్లనుండి నా మీదికి ప్రవహించింది. అంతే మెరుపులా తన చేతిలోని బరిసెను నా ముక్కు దూలంలోనుంచి మొప్పగుండా బయటికి లాగి దాన్ని ఒక తాడుతో పడవకు కట్టాడు. మిగిలిన తాడును మధ్యకు కోసి దాంతో నా తోకను చుట్టి దాన్ని పడవ వెనక భాగానికి కట్టాడు. ఇక నేను ముసలాడినుండి తప్పించు కోలేనని తెలిసి పోయింది.
మరణ ముఖద్వారం మెల్ల మెల్లగా తెరుచుకుంటోంది. ఒక్కసారిగా నా నాయకత్వానికి జేజేలు పలికిన మా సమూహం నా కళ్లముందు కదలాడింది. చాలా కాలంగా ఎన్నో ప్రమాదాల నుంచి వాళ్లను కాపాడుకుంటూ వచ్చాను. విహారానికి సముద్రపు లోతుల్లోకి వెళ్లినప్పుడు మా సమూహంలోని బుజ్జి బుజ్జి చేపలు ఏ భయంలేకుండా నా పొట్టకింద ఈదుకుంటూ ఆడుకునేవి. వేటకు వెళ్లిన ప్రతిసారి ఎదురైన యుద్ధంలో మా వైపునుండి ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా శతృసమూహాలను తరిమికొట్టే బాధ్యత ఏనాడూ విఫలం కాలేదు. ఎక్కడ ఏ ఆహార సంపద దొరికినా మొదట నా సమూహానికే వడ్డించే అలవాటు నాది. మా మధ్య ఆటలు, పాటలు నిత్యం సాగుతూ వుండేవి. లెక్కలేనన్ని సరదాలు, సంబరాలు మా సంతోషాలకు తోరణాలుగా నిలిచేవి. అన్నిటికీ నాయకత్వం నాదే. రోజూ చీకట్లో విహారానికి వెళ్లి సూర్యోదయం వేళకు తిరిగి మా స్థావరానికి రాగానే. మా అందరి దినచర్య ప్రారంభమయ్యేది. మరి ఇప్పుడు నేను లేని రాజ్యంలో నా సమూహం ఉనికి, సముద్రగర్భంలో నామరూపాలు లేకుండా పోతుంది. నా రాకకోసం ఎదురుచూసిన నా సమూహం రోదన తలుచుకుంటే నాకు దుఃఖం ఆగటం లేదు. మా శతృవుల దాడి ఇప్పటికే ప్రారంభమై వుంటుంది. సమూహ వినాశనానికి నేనే కారణమయ్యాను. నేను బాధపడుతున్నది చావుకోరల్లోకి వెళ్తున్నానని కాదు, నా వేదన నా సమూహం గురించి, నా వేదన నన్ను పెంచి, పెద్దచేసి, ఎంతో ప్రేమను అందించిన ఈ తల్లి సముద్రం గురించి, ఈ తల్లి గర్భంలో రుతువులు ఏవైనా మాకు అన్నీ పండగ దినాలే. వర్షం కురిస్తే చాలు; ఇంద్రధనుస్సులు మాకు కిరీటాలవుతాయి. తుపాను వచ్చిందంటే మా ఉత్సాహాలకు పతాకాలు లేస్తాయి. ఉప్పెన వస్తే చాలు ఆకాశం తాకే అలలు మాకు ఉయ్యాలలై ఊగుతాయి. మా ఆనందం పైనున్న ఆకాశాన్ని తాకేది. ఈ అపురూపమైన సంతోషాన్ని శాశ్వతంగా నా ఖాతాలో దాసుకోవాలనుకున్నాను. నా తల్లి సముద్రం ఎదమీద ఆడుకొనే రోజులు తరగని సంపదగా నాకు కానుకలవుతాయను కున్నాను. పుట్టుకతోనే సాధించుకున్న నా స్వర్గం ఒక్క 'ఎర' కారణంగా ఎడారిగా మారుతుందని వూహించలేక పోయాను. చివరకు ఇలా దీనావస్థలో దు:ఖిస్తూ, దగ్ధమైన నా జీవితాన్ని కన్నీటి పొరల్తో కప్పేసుకుంటూ, నా సముద్రం తల్లికి ఆఖరిసారిగా సాష్టాంగపడుతూ, శాశ్వితంగా నా కళ్లకు విశ్రాంతినిచ్చాను.
జరిగింది యుద్ధమే. కాని ఈ యుద్ధం ఇద్దరు వీరుల మధ్య జరగలేదు. ఇందులో పాల్గొన్న వీరత్వం నాది మాత్రమే! కాని మోసం విజయాన్ని తన్నుకు పోయింది. అపజయానికి నా దగ్గరికి వచ్చే అర్హత లేదని నిర్ధారణ చేసుకొని సిగ్గుతో పారిపోయింది. అందుకే నా పోరాటాన్ని గుర్తింమని ప్రపంచ సాహితీవేత్తలందరి వేడుకుంటున్నాను. మీ చరిత్ర యుద్ధాల్లో మరణించి మీచేత కీర్తించబడుతున్న వీరుల సరసన నాకూ ఒక గౌరవ స్థానాన్ని ఏర్పాటు చేయండి. సభలు, సమావేశాల్లో 'ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ' నవల గురించి చేసే ఉపన్యాసాల్లో ముసలోడూ, సముద్రం గురించి మాత్రమే కాదు; వీరత్వాన్ని ప్రదర్శించిన నా పోరాటాన్ని గురించి కూడా మనసు విప్పి మాట్లాడండి, సాహితీచర్చల వేదికలమీద నా పాత్రకు గౌరవప్రదమైన ప్రవేశం కల్పించండి. ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి అనుభవాలు, ఆలోచనలు, బాధలు, ఏడుపులు, సంతోషాలు సమస్తం వుంటాయి. వాటికి అక్షర రూపం రావటమే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అవకాశం నన్ను వరించటం నా వీరత్వానికి అక్షరాలన్నీ వరుసగా నిలబడి హారతులు పట్టినట్లుగా వుంది. ఇకనుంచి ప్రతి సూర్యోదయంలో నన్ను పలకరించే పాఠకుల కోసం వెతుకుతూ వుంటాను.