విపరిణామాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు

కేశవ్‌
98313 114213

ద్వంద్వ ప్రమాణాలతోనూ, పతన విలువలతోనూ, ప్రగతి నిరోధక ఆర్థిక విధానాలతోనూ, దిగజారుడు మనువాద సంస్క ృతితో కుళ్ళిపోతున్న వ్యవస్థ మీద నిప్పురవ్వల్ని కురిపించిన వ్యాసాల పరంపర 'కొంచెం నిప్పు - కొంచెం నీరు'. నిద్రాణమైన పాఠకుడ్ని మండించడానికి, బాధతో, ఆవేదనతో దుఃఖించేలా చెయ్యడానికి ముందుకొచ్చాడు రచయిత అరణ్య కృష్ణ.
'ఒక సంస్కృతిని వికసింపజేయాలన్నా, విధ్వంసం చేయాలన్నా భాష ఒక బలమైన సాధనం' (పే.72). సరిగ్గా, అలాంటి భాషనే బలమైన సాధనంగా, పదునైన ఆయుధంగా, మండించే నిప్పుగా మార్చి ఈ వ్యాసాలు సమకూర్చారు. నేటి సంక్లిష్ట సామాజిక పరిస్థితుల్లో ఈ వ్యాసాల అవసరం చాలా ఉంది. సామాజిక, సాంస్కృతిక భావజాలాలను వెనక్కి తీసుకెళ్ళడానికి, ప్రజలను మరలా అంధకారంలో తోసెయ్యడానికి అహర్నిశలూ ప్రయత్నం చేస్తూ, అనుక్షణం ప్రగతి నిరోధక భావాలను వ్యాప్తి చెయ్యడానికి వెనుకాడని హిందూత్వ భావజాలం నేపథ్యంలో పుకార్లకూ, నిజాలకు మధ్య భేదాన్ని తెలుసుకొని, రాజ్యం వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని అన్ని వ్యాసాలూ దోహదపడతాయి.
విల్‌ఫ్రెడ్‌ ఓవెన్‌, పీబీ షెల్లీ పాశ్చాత్య కవులకు వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల మీద విపరీతమైన ఆగ్రహం ఉంటుంది. సరిగ్గా, అరణ్యకృష్ణ రాసిన ఏ వ్యాసం తీసుకొన్నా, అదే ఆగ్రహం కనిపిస్తుంది. సైనికులను యుద్ధాలకు పంపించే నికృష్టమైన విధానాలను కొనసాగిస్తూ, మరలా యుద్ధభూమిలో అత్యంత దయనీయంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల్ని వీరులనీ, శూరు లనీ, త్యాగధనులనీ కీర్తించిన పెట్టుబడిదారీ వ్యవస్థ మీద, ద్వంద్వ ప్రమాణాల మీద ఈ పాశ్చాత్య కవులు విపరీతమైన ఆగ్రహం చూపిస్తారు. అరణ్యకృష్ణ రచనల్లో కూడా ఈ అగ్నికణాలు కనిపిస్తాయి. ఈ ఆగ్రహం వ్యక్తిగతం కాదు, సామాజికం. సార్వజనీనం.
ఒక కవి వ్యాసకర్తగా తనను తాను రూపాంతరం చెందించుకోవలసిన చారిత్రక పరిస్థితులు కవి చుట్టూ ఉన్న సమాజమే కల్పిస్తుంది. కవిగా తనకు లభించని విశాలమైన కాన్వాసు ఒక వ్యాసకర్తకు లభిస్తుంది. మరిన్ని విషయాలను మరింత లోతుగా, మరింత విశాలంగా, మరింత స్పష్టంగా చర్చించడానికి, విశ్లేషించడానికి, తర్కించడానికి అవకాశం లభిస్తుంది. ఈ రచనలోని మొత్తం వ్యాసాల్లో ఇదే వాస్తవం కనిపిస్తుంది. వ్యాసకర్తలో కవీ, కవిలో వ్యాసకర్తా లీనమైనప్పుడు అక్షరాలు లయతో విన్యాసం చేస్తాయి. వాక్యాలు నాట్యమాడ తాయి. ఎన్నోచోట్ల అక్షరాలు భావాల కత్తులతో హృదయాన్ని గుచ్చుతాయి. అగ్ని బాణాల్ని సంధిస్తాయి. ప్రశ్నిస్తాయి. విమర్శిస్తాయి. ఆవేదనతో విలపిస్తాయి. కన్నీటిని కురిపిస్తాయి.
'గాయమంటే ఆమె చర్మం మీద చేసేదేనా? గాయమంటే నెత్తురొచ్చేదేనా? చర్మం మీద గాయాలే నొప్పి పుట్టిస్తాయా? ఒక ఇబ్బందికరమైన చూపు దుస్తుల లోపలి దేహాన్ని స్కాన్‌ చేస్తున్నప్పుడు, ఒక జుగుప్సాకరమైన కదలిక ఏకాంత సమయానికి చెందిన శరీర భాగాల్ని తడిమినప్పుడు మనసుకు కూడా గాయమవుతుంది...'' (పే.58). ఒక వ్యాసకర్తలో కవీ, ఒక స్త్రీవాదీ, ఒక ప్రగతిశీలుడూ కలగలిసినప్పుడు వాక్యాలు ఇలానే అత్యంత ప్రతిభావంతంగా ఉద్భవిస్తాయి. డా. ఎ.కె.ప్రభాకర్‌ సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలోని 43 వ్యాసాల్లో రచయిత ఇలా ఎన్నో విషయాల మీద ఆగ్రహంతో లేచివస్తాడు. అసంఖ్యాకమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల మీద ఈ వ్యాసాలు చైతన్యం కలిగిస్తాయి. నేటి హిందూత్వ కాషాయీ కరణ, కార్పొరేటీకరణ నిజస్వరూపాలను బట్టబయలు చేస్తాయి - ఈ వాక్యాలు. పతనమైపోతున్న విద్యారంగం మీద బాణాలు విసురుతాడు రచయిత. గుమస్తాలను మాత్రమే తయారుచేసే సాహిత్య సుగంధాలు లోపించిన ఇంగ్లీషు మీడియం విద్యా విధానాన్ని ప్రశ్నిస్తాడు. పిల్లల మీద లైంగిక దాడుల పట్ల మండి పడతాడు. ఒక పెద్ద పరిశ్రమగా మారిపోతున్న విలాసాల పెళ్ళిళ్ళలో మిస్సయిన మానసిక బంధాన్ని ఎండగడతాడు. 'జీవితాల కన్నా, వివాహ పరిశ్రమే బలంగా ఉంది' అంటాడు (పే.98). ఒక మధ్య తరగతి కుటుంబం 20 - 30 లక్షలు ఒక్కో పెళ్ళికి ధారపోస్తున్నది' అని వాపోతాడు. రేపు అంబానీ ఏ 'జియో లింక్స్‌' పేరుతో వివాహాలు నిర్వహించే ఒక కార్పొరేటు సంస్థని ప్రారంభిస్తే బహుశా బ్రాండెడ్‌ పెళ్ళిళ్ళు జరుగుతాయేమో' (పే.98) అని సెటైర్‌ విసురుతాడు. అలానే, హిందూత్వ ప్రాపగాండా మీద విమర్శ బాణాలు సంధిస్తాడు మరో దగ్గర. ఆత్మహత్యలకు దారితీసే వ్యవస్థను 'ఉరిపోసుకుంటున్న మానవత్వం' అని వాపోతాడు. అభివృద్ధి అనే అంశమే లేని 'అభివృద్ధి'ని ప్రశ్నిస్తాడు. పెద్ద పెద్ద కట్టడాలు, రోడ్లు అభివృద్ధి కావంటాడు. మరో దగ్గర మాట్లాడుతూ 'భారతదేశం అనాదిగా బహుళత్వంతో ముందుకు నడుస్తోందని అంటాడు. 'భాషలో, అహారంలో, ఆహార్యంలో, అలవాట్లలో భిన్నత్వం, బహుళత్వం మనది.- కానీ పాలకులు అనుసరించే విధానాలు బహుళత్వానికి, భిన్నత్వానికి అఘాతంగా మారాయని' నిర్ధారిస్తాడు. (పే.100).
'ప్రకతి, చరిత్ర ప్రసాదించిన వరాలు బహుళత్వం, భిన్నత్వం. వాటిని కాపాడుకోవాలి. చరిత్రని విస్మరించేవారు కొత్త చరిత్రను రాయలేరు. వారు గతకాలపు విషాద చరిత్రలకి తిరిగి ప్రాణం పోస్తారంతే' అంటాడు (పే.106). నిజమే, గతకాలపు అంధకార యుగంలోకి దేశాన్ని, ప్రజల్ని తీసుకుపోయే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండడం ప్రగతిశీలులు, సృజనకారులు పరిశీలిస్తున్న విషయమే. 'గో కరోనా గో' అని కొవ్వొత్తులను వెలిగించి కరోనా వైరస్‌ను తరమండనీ, కోట్లకొలది ప్రజలను అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు ప్రణాళికాబద్ధంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రచన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఒక సమూహాన్ని పరాయి చేసేసి, మెజారిటీల ఆధిపత్యాన్ని రుద్దే విధానం నిజమైన ప్రజాస్వామ్యం కాదనీ, సమూహాలన్నిటి మధ్య భిన్నత్వం పట్ల, వైవిధ్యం పట్ల పరస్పర గౌరవం, సహనం ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యం అనీ, ప్రజాస్వామ్యంలో మెజారిటీ, మైనారిటీ అనేది ప్రభుత్వాల ఏర్పాటుకే తప్ప ప్రజా సమూహాల మధ్య ఆధిపత్యానికి సంబం ధించినది కాదని మరో వ్యాసం 'ఊరుకుందామా'లో అంటాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం నేపథ్యంలో ఇటీవలి దేశ పరిణామాలను పరిశీలిస్తే, ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రత్యేక మతస్తుల మీద ప్రణాళికాబద్ధంగా బురదజల్లి, విద్వేషం నింపి ఓట్ల సంచులు నింపుకొనే రాజకీయాల నడుమ ఈ వాస్తవాలు తెలుసుకోవడం అవసరం.
ఈ రచయిత 'మాఫిడియా'లో వార్తల వెనుక, టెలివిజను పరిశ్రమ వెనుక ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యం కోసం తవ్వుకుంటూ పోతాడు. వినిమయదారుడ్ని తమ లాభాల సంచుల్ని పోగేసుకోవడం కోసం పతనం చెయ్యడం ఒక ఎత్తయితే, ఆ వినిమయదారుడి అభిరుచుల్ని మార్చడం, అలా మార్చి మరలా తమ లాభాల సంచుల్ని బరువుల్ని పోగేసుకోవడం పెంచుకోవడం మరో ఎత్తు. రచయిత ఈ పరిణామాన్ని చక్కగా విశ్లేషిస్తాడు.
వార్త పఠనంగా కంటే దశ్యంగా ప్రజలకు చేరడం వెనుక ప్రజల అభీష్టాల కంటె నేపథ్యంలో ఒక వ్యవస్థ ఉందనీ, వ్యవస్థ తన ప్రయోజనాలకనుగుణంగా, తనకు అనువైన విధంగా మీడియా రంగాన్ని అచ్చునుండి దృశ్యం వైపుగా రూపాంతరం చేయించిందనీ, అలా మనల్ని అలవాటు చేసిందనీ, అలా మారిన అలవాటుతో తన లాభాల సంచుల్ని పోగుచేసుకుందనీ అంటాడు అందుకే 'మాఫిడియా'లో (పే.175). పఠనం నుండి దశ్యరూపంలోకి వార్త మారిపోయిన తర్వాత పాలకవర్గాలకు మరింత అనువైన స్పేస్‌ ఏర్పడింది. తమ విధానాలను ప్రశ్నించ కుండా చెయ్యడానికి, తమకు అనుకూలంగా యాంకర్‌ మూకల్ని తయారుచేసుకోవడానికీ, తాము తిండిపెట్టిన విధంగా తినడానికీ, డిబేట్‌ చేయడానికి ఎవరు మాట్లాడాలో, ఎవర్ని మాట్లాడించ కూడదో చక్కబెట్టుకొని తమ విలువల ప్రయోజనా లను అమర్చుకోవడానికి మరింత సావకాశం లభించింది. ఏది వార్తగా మారాలి? దేన్ని వార్తల నుండి బయటికి పంపించాలి? మొదలైన విషయాలను నిర్ణయించుకోవడం వీరికి సులభమయింది. ప్రజల అజ్ఞానానికి పునాదులు మరింత పకడ్బందీగా వెయ్యగలిగే అవకాశం డిజిటల్‌ టెలివిజన్‌ 'దశ్యం' ద్వారా సాధించుకో గలిగారు. - ప్రజాస్వామ్యానికి ఇది మరో పెద్ద దెబ్బ.
హిందూత్వ ప్రాపంగాండాలో దేశాన్ని వెయ్యేళ్ళ వెనక్కి తీసుకెళ్ళి అంతా వైదిక యుగంలోనే జరిగిపోయిందనీ, విజ్ఞాన శాస్త్రాన్ని హేళన చేసి అంధకారంలోకి ప్రజల్ని తరుముకెళ్ళడం ఒక ఎత్తు. నూతనంగా అభివృద్ధి చెందిన ఇంటర్నెట్‌, డిజిటల్‌ విప్లవం, సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని వాట్సప్‌ను పుకార్ల విశ్వవిద్యాలయంగా మార్చుకొని చరిత్రను ఎంత వీలయితే అంతగా వ్యక్తీకరించి, తమకు నచ్చని నాయకులను, తమదారికి అడ్డువచ్చే నాయకులను చరిత్రహీనులుగా మార్చేయ్యడం మాబ్‌ను రెచ్చగొట్టడం మరో ఎత్తు. అందుకే, 'నిజాలు గబ్బిలాల్లా తలకిందులుగా వేలాడుతూ దర్శనమిస్తుంటాయి' అని వాట్సప్‌ యూనివర్శిటీ పుకార్ల పరిశ్రమ మీద ధ్వజమెత్తుతాడు 'ఆ వైరస్‌ పేరు పుకారు'లో (పే.135). 'కార్పొరేట్లకు కావలసిందల్లా పాలకులిచ్చేస్తారు. అందుకు ప్రతిగా 'ఇన్‌ఫర్మేషన్‌ డంపింగ్‌'కి కావలసినంత స్పేస్‌ను వాళ్ళు ఏర్పాటు చేసేస్తారు' అని ఈ పుకార్ల పరిశ్రమ వాట్సప్‌ విశ్వవిద్యాలయం పనితీరుని చిత్రించిన తీరు ప్రశంసించదగ్గది. నేటి పాలకవర్గ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు దారి చూపిస్తాయి. అప్రమత్తం చేస్తాయి. మూకలో బాజాలు వాయించే మందలో కలిసి పోకుండా వెనుక ఉండి విశ్లేషించడానికి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తాయి. తేళ్ళ అరుణ ప్రచురించిన ఈ పుస్తకాన్ని సాహస రచనలు అని ముందుమాట రాసిన ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ కొనియాడగా, 'నీటిలో నిప్పు' అని డా.ఎ.కె. ప్రభాకర్‌ పేర్కొన్నారు. హిందుత్వ భావజాలంతో దేశం ఎటుపోతుందో అర్థంకాని యువతకూ, ప్రజలకూ ఈ రచన దిక్సూచిలా పనికొస్తుంది.