70 ఏళ్ల క్రితమే ప్రగతిబాటన సాగిన రథచక్రాలు

చెరుకూరి సత్యనారాయణ

తెలుగులో ప్రగతిశీల నవలా రచయితలు నలుగుర్ని లెక్కించాల్సివస్తే చిటికెన వేలిపై చటుక్కున ఎక్కి కూర్చొనే రచయిత మహీధర రామమోహనరావు గారు. చదివింది వీధిబడిలోనే అయినా 13వ ఏటనే రచనా వ్యాసాంగం ప్రారంభించాడు. అనువాదాలు, కథలు, నాటికలు రాసినా 40వ దశకం వరకూ నవలల జోలికి వెళ్లలేదు. 'రథచక్రాలు'తో ప్రారంభించి 'ఓనమాలు', 'ఈ దారి ఎక్కడికి?', 'కొల్లాయి గట్టితేనేమి?' 'మృత్యువు నీడల్లో' మొదలైన 15 నవలలు రాసి తెలుగులో అగ్రశ్రేణి నవలా రచయితగా వాసికెక్కారు.
రచయితగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా కన్నా ఒక ప్రచురణకర్తగా మహీధర గారి కృషి అద్వితీయం, అనన్య సామాన్యం. తన సోదరులు జగన్‌మోహన్‌, కృష్ణమోహన్‌లతో కలిసి తమ గ్రామమైన ముంగండలో విశ్వసాహిత్యమాల పేరుతో ఒక ప్రచురణ సంస్థని స్థాపించారు. పైసా చేతిలో లేకుండానే ఈ సాహసానికి పూనుకొని కొన్ని చలం పుస్తకాలు, అనువాదాలు మొదట ప్రచురించారు. పారితోషికం ఇచ్చే స్థోమత లేక కాపీరైటు చట్టం కింద జైలుశిక్షకు సిద్ధపడ్డారు. వీరితో పాటు సనాతన బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వీరి భార్యలు, పెద తల్లి పుస్తకాలు కుట్టి అతికించి బైండ్‌ చేసేవాళ్లు. పంచుకోవటానికి ఆస్తులు లేకపోయినా రామమోహన్‌, కృష్ణమోహన్‌ గార్లు ఒకరు రాజమండ్రి నుంచి బరంపురం దాకా; మరొకరు దక్షిణాన తడ వరకు ఆంధ్రదేశాన్ని పంచుకొని సైకిళ్లపై పుస్తకాలు పెట్టుకుని గ్రామ గ్రామాన తిరిగి వాటిని అమ్మేవాళ్లు. ఈ రకంగా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగు నేల నాలుగు వైపులా వెదజల్లారు.

తొలి నవలా 'రథచక్రాలు'తోనే రాజకీయ నవలలు ఎలా రాయాలో చూపించి తదనంతరం కాలంలో రాజకీయ నవలలు రాసిన అనేక మంది రచయితలకు, రచయిత్రులకు గైడ్‌గా నిలిచాడు మహీధర. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో 'ఓనమాలు' (1956), 'మృత్యువు నీడలో' (1957) నవలలు రాశారు. అలా తొమ్మిది పదుల వయసు దాటిందాకా రాస్తూనే ఉన్నాడు. రథ చక్రాలు, కొల్లాయి గట్టితేనేవి? ఈ దారి ఎక్కడికి? నవలలో గోదావరి జిల్లాల నేపథ్యం వున్నా ఆనాటి కాలంలో 1947కి ముందు తర్వాత ఆంధ్ర ప్రాంతం లోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని; స్వాతంత్య్రానికి ముందే కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న పదవీ లాలసనే సమర్థవంతంగా చిత్రించారు. మరీ ముఖ్యంగా రథ చక్రాలు నవలలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ప్రకాశం మంత్రివర్గం రాష్ట్రంలోనూ, తెలుగు ప్రాంతంలోనూ ప్రజలపైనా, ప్రజానాయకులపైనా సాగించిన విచ్చలవిడి దౌర్జన్యకాండ నేపధ్యంలో ఆనాటి గ్రామాల్లో కాంగ్రెసు - కమ్యూనిస్టు గ్రూపుల మధ్య ఘర్షణ ఈ కథలో కూడా చూడవచ్చు.


నవల కథా క్రమం పరిశీలిస్తే ... బ్రాహ్మణ అగ్రహారానికి అనుబంధ పల్లె లంక మాలపల్లె. అగ్రహారం కాంగ్రెసు పార్టీ పలుకుబడిలో వుండగా లంక మాలపల్లె కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో ఉంటుంది. అగ్రహారంలో కాంగ్రెసు నాయకుడు విశ్వనాథం కుటీల రాజకీయవేత్త కాగా, కాంగ్రెసు ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందనుకునే భ్రమలో వున్న మరో నాయకుడు సత్యానందం. పల్లెలో జాన్‌, మరియమ్మ కమ్యూనిస్టు కార్యకర్తలు కాగా, విశ్వం ఆ ప్రాంతపు కమ్యూనిస్టు నాయకుడు. పైగా జమిందారీ దివాన్‌ కొడుకు. జమిందార్‌కు మాలపల్లి జనాలకు మధ్య చాలా కాలంగా వున్న తగాదాల కారణంగా లంక మాలపల్లెను తగలబెడతారు. ఆ ఇళ్లను ఆర్పే పని చేయటమే గాక ఆ జనాలకు తన తోటలో పునరావాసం కల్పిస్తాడు సత్యానందం. ఈ క్రమంలోనే కమ్యూనిస్టుల పట్ల తనకున్న దురభిప్రాయాలు మార్చుకుంటాడు. వారి ఆచరణ, సంస్కార వంతమైన వారి ప్రవర్తన అందుకు దోహదపడతాయి. అనంతర కాలంలో దేశంలో పొడచూపిన అతివాద రాజకీయాల గురించి, దాని పెడ ధోరణి గురించి ఆనాడే జాన్‌ పాత్ర ద్వారా సమాధానాలు చెప్పించాడు రచయిత.


వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెసు నాయకుడు విశ్వనాధం అరెస్టు, కమ్యూనిస్టు నాయకుడు విశ్వం అరెస్టుల సందర్భంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రభుత్వ వర్గ దృక్పథాన్ని తెలియజేయటంతో పాటు సత్యానందం లాంటి నాయకులను ఆలోచింపజేస్తుంది. 'ప్రపంచాన్నంతా బంధువులుగా భావించే స్వభావం కమ్యూని స్టులదని' చెప్పిన విశ్వం మాటల్లోని నిజం నవలలో వ్యక్తమవు తోంది. జానకి, భద్ర, మేరి లాంటి స్త్రీ పాత్రల ద్వారా ఆనాటికి ఎవరూ వినివుండని స్త్రీ వాదపు ఆలోచనల్ని, స్త్రీ, పురుష సంబంధాలు వ్యక్తిగతం కాదు సామాజికం అన్న పురోగామి దృక్పథాన్ని వినిపిస్తాడు రచయిత. జానకి లాంటి సాంప్రదాయ ఛట్రం నుంచి వచ్చిన స్త్రీ 'మగవాళ్లు మనల్ని కాపలా కాయాల్సిందే అన్న భయం వున్నంత కాలం మగాళ్లు మనల్ని భయపెడతారు. ఆడది తన్ను తాను కాపాడుకోవటమే దారి. మన ప్రవర్తనలోనే మనకు రక్షణ ఉండేలా చూసుకోవాలి' అని గ్రహించటం దానికి తార్కాణం. కమ్యూనిస్టు కుటుంబాల్లో స్త్రీల పని విధానం కమ్యూనిస్టుల పట్ల గౌరవం కలిగించేలా నవలలో చిత్రించబడింది.
1948లోనే ఈ నవల రాసినా 1956 దాకా ప్రచురించ బడలేదు. చివరికి కాట్రగడ్డ నారాయణ రావు గారి వితరణ కారణంగా బయటకొచ్చిన తరువాత చాలా కాలానికి కావలి సొసైటీ ఫర్‌ సోషల్‌ ఛేంజ్‌ వారు 2016లో ప్రచురించారు. సుప్రసిద్ద కథా రచయిత సింగమనేని గారి ముందుమాట, అనుబంధంగా ఆకాశవాణి కోసం కేతు విశ్వనాధరెడ్డి రచయితతో చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ కూడా ఈ ప్రచురణలో జోడించారు.