చిన్ని ఆశ

తాండ్ర రమణ

ఇప్పుడు ...
జీవితం - ఓ చీకటి రాత్రి!
నవ్వు - ఓ కాగితం పువ్వు!
ఆశ - చిక్కుపడ్డ కలల చిట్టా!
.
నిజం మీద సమాజం కొట్టిన దెబ్బలన్నీ
వాటికవే వైరుధ్యాలై
ఇజాలను కప్పుకొంటే
ఇప్పటి నైరూప్యం రేపటికి రూపమౌతుంది
.
అసలిక్కడ మనస్సుకు చెప్పుకునే ఊసులేవీ
మలిన దేహావాహాలు తప్ప
మమతల కౌగిళ్ళ ఊహలేవీ
ఆవేశకావేశ వ్యూహాలు తప్ప!
.
మనుషులకు రెండు ప్రపంచాల జీవితం
సహజమైపోయాక
అసలు ముఖం ఒక ప్రశ్నైంది
నిజాయితీ వెగటెత్తి పోయింది
.
అయినా, మనస్సు ఏకకాలంలో
వైరుధ్యాలతో చెట్టాపట్టాలేసుకుని
విహారాలు చేస్తున్నప్పుడు

విచక్షణ కనిపించని ఓ చల్లని తెమ్మెరలా
ఆవరించదా అనే చిన్న ఆశ!