స్వయం ప్రకాశ చిత్రకారుడు రాజా రవివర్మ

గనారా
99492 28298

ఇది ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవిత చిత్రానికి అద్భుతంగా పట్టం కట్టిన నవల. రచయిత మోహన్‌ సమర్థతకు, గొప్ప ఊహాశక్తికి నిదర్శనం ఈ రచన. ఈ కథ మొదలయ్యే సమయానికి ఈస్టిండియా కంపెనీ చరిత్ర ముగిసింది. బ్రిటిష్‌ వారు తమ పాలన స్థిరపరచుకున్నారు. అనేక సంస్థానాలు స్వాధీనం చేసుకున్న కాలం అది. కేరళలో తిరుచానూరు రాజ కుటుంబం అప్పటికింకా మాతృస్వామిక వ్యవస్థలోనే ఉండేది. ఆ వంశంలో ఆడపిల్ల లేకపోతే దత్తత తీసుకునే ఆచారం కూడా ఉంది. దత్తత సోదరి పెదరాణి లకిëబాయి. రవివర్మ అక్కడే పుట్టాడు. ఆ దివాణానికి రాజు 'అయిర్యం'. రవివర్మ భవిష్యత్తుకు బాటలు పడ్డాయి. కేరళవర్మ రవివర్మని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించాడు. బాల్యంలో అందరు పిల్లలలాగే కనిపించిన గోడలపై సుద్దముక్కలతో బొగ్గులతో పిచ్చిపిచ్చి గీతలు గీస్తూ తన మార్గాన్ని తానే చూసుకున్నాడు రవి. రంగుల్లో రంగయ్యాడు. చిత్రకళతోపాటు సాహిత్యంపై పట్టు సాధించి చందస్సు నేర్చుకున్నాడు. సంస్క ృతం, మలయాళంపై పూర్తి అవగాహన ఏర్పడింది. అతని అభివృద్ధిలో పెద్దరాణి లకీëబాయి తోడ్పాటు ఎంతో ఉంది.
అతడికి 19 ఏళ్లు రాగానే 13 ఏళ్ళ భాగీరధితో వివాహం అయింది. మానేవికార దివాణానికి అల్లుడయ్యాడు. భాగీరధి, మాధవి బాల్య స్నేహితులు. కలిసిమెలసి పెరిగారు. భాగీరధి అలంకారాలతో కూడిన అందం తప్పితే సహజ సౌందర్యం కాదు. భాగీరధి చిత్రం వేయడానికి ప్రయత్నిస్తే, ఆమె తిరస్కరించింది. అప్పుడు మాధవి చిత్రం వేయడానికి చాలా ప్రయత్నించాడు. విముఖత చూపిస్తూనే అతని ఆకర్షణలో పడింది మాధవి.
'ప్రేమలు, వియోగాలు, అసూయ దాచేస్తే దాగేవి కావు. రవి తనని సహజంగానే కోరుకుంటున్నాడా!'
కొంతకాలం మాధవి తప్పించుకు తిరిగింది.
''తప్పించుకు తిరుగుతున్నావేం? అలకా?''
''నాకెందుకు అలక, నేనేమన్నా మీ భార్యనా?''
చిత్రకారుల్లో ఉండే సహజ సౌందర్య ఆరాధన ఆమె చిత్రాన్ని గీసేందుకు దోహదం చేసింది.
రాజదర్బారులో ఉండే కుట్ర రాజకీయాలు చిన్నప్పటి నుంచీ తెలిసిన మాధవి అనేక జాగ్రత్తలు తీసుకుంది. సౌందర్య ఆరాధన అని, అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తను ఎన్ననుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా వాటి పునాది దేహమే అని భావిస్తారు.
మదరాసు టౌనుహాలులో చిత్రకళా ప్రదర్శన జరిగింది. రవి వేసిన మాధవి చిత్రంపై సందర్శకుల దృష్టి పడింది. చిత్రకారుడు ఎవరై ఉంటారా అని తెలుసుకోవాలని అక్కడ ఆతృత. ఆ చిత్రానికి బంగారు పతకం వచ్చింది. పత్రికలు ప్రత్యేక వ్యాసాలు రాశాయి. మదరాసు ప్రెసిడెన్సీ కళా ప్రపంచంలో రవి పేరు మారుమోగింది. ఆ తరువాత రవి జీవితకాలం వెనుదిరిగి చూడలేదు. రాజప్రసాదాల్లో, జమీందార్ల బంగ్లాలోనే కాక ఆంగ్లేయుల భవనాల్లో కూడా రవి చిత్రాలు నిండిపోయాయి. రవి విజయంలో తమ్ముడు రాజవర్మ పాత్ర ఎంతో ఉంది. తను ఎప్పుడూ అన్న వెన్నంటే ఉన్నాడు.
రవి సంతానంలో పెద్దవాడు చెడు వ్యసనాలకు, స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయమై భార్య భాగీరధికి రవివర్మకు మధ్య విభేదాలు పొడచూపాయి.
''తిని కూర్చోవడానికా, మనిషి జన్మ ఎత్తింది?'' అన్నాడు రవి.
''లేదు. పిచ్చి బొమ్మలు వేసుకుంటూ, ముష్టివాళ్ళలా దేశం పట్టుకుని తిరగడానికి, ముండలతో కులకడానికి''
''నోర్మూరు. ఎవరు కులికారు?''
''మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?''
''నువ్వు చూశావా?''
''నీ బొమ్మలే చెబుతున్నాయి''
రవిలో కళాతృష్ణని గమనించనివారు నిందలు వేయడానికి వెనుకాడలేదు. అయినప్పటికీ రవి తన ప్రయాణం ఆపలేదు.
'కిళిమానూరు'లో రవికి సంగీత సాహిత్యాలతో రోజులు గడుస్తున్నా, మనసులో కొడుకు ప్రవర్తనను తట్టుకోలేక పోయాడు. సువిశాలమైన భారతదేశం తిరగాలని నిశ్చయించు కున్నాడు రవి.
'చరాచర ప్రకృతి మనిషి భౌతికావసరాలను తీర్చడంతో పాటు అతని భావనా ప్రపంచానికి కావలసిన ధాతువులనూ సమకూరుస్తుంది. కల్పనకు పంచభూతాలు ఆసరా ఇస్తాయి. ఒక పువ్వును మనిషి కేవలం ఒక పువ్వుగానే ఊహించలేడు. తనకు తెలిసిన రంగూరూపాలను, పరిమళాలను, కాంతులను అతిశయంతో జత చేశాడు. ఒక వనితను, ఒక భావోద్వేగాన్ని, ఒక పదచిత్రాన్ని బొమ్మ కట్టేటప్పుడూ అంతే! అంతర్నిహిత స్రవంతులు బాహ్యజగత్తులోకి నానా వర్ణాకృతులను, సంరంభా లను జత చేసుకొని సృజనతో సంగమించి సయ్యాటలాడ తాయి.'
హంస అనే పక్షిని మన పురాణాల్లో చెపుతారు కానీ దాని రూపం ఎలా ఉంటుందో ఊహించడానికి లేదు. రవివర్మ దమయంతి చిత్రంలో హంసను చూసినవారికి హంస అంటే ఇదే అనే విధంగా చిత్రం ఊహల్లో నిండిపోయింది. రవివర్మ చిత్రించిన దమయంతి అద్భుతమైన చిత్రం.
రవి బొంబాయి ప్రయాణం సాగించాడు. జోషి అనే మిత్రుడితో పూనా చిత్రశాలకు వెళ్ళాడు. అక్కడ లితోప్రెస్‌కు వెళ్ళి దేవతా చిత్రాలు చూశాడు.
గమ్యం చేరడానికి గమ్యం లేని ప్రయాణం సాగింది. వ్యక్తాన్వేషణలో ఆత్మకాన్వేషణ కూడా కొనసాగింది. బృందా వనం, ఉజ్జయిని, మధుర, హస్తినాపురం చూశాడు. సుమారు నాలులు నెలల ప్రయాణం. అనేక పుస్తకాలు చదివితే కానీ దేవుళ్ళ రూపాలను ఊహించటం సాధ్యం కాలేదు.
శివపార్వతుల కుటుంబ, యశోదాకృష్ణులు, సీతారామ కల్యాణం, సీతా అపహరణం, శ్రీరామ పట్టాభిషేకం, రాధాకృష్ణులు, గజేంద్రమోక్షం, కాళీమర్ధనం, నానా దేవతలు, అందగత్తెలు అనేకానేక చిత్రాలు రవి వేయడంతో మార్కెట్లో విశేషమైన ఆదరణ లభించింది. ప్రతి ఇంటిలో రవివర్మ వేసిన దేవుళ్ళ చిత్రాలతో నిండిపోయాయి.
రవి యాత్రలో అనేక పట్టణాలు తిరిగాడు. ప్లేగు బారిన పడకుండా జాగ్రత్త పడ్డాడు. అనేకానేక రుగ్మతలు జయించాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, రాజుల, సంస్థానాధీశుల వ్యాపారుల ఆదరణ పొందాడు. ప్రముఖులు ఆయనతో చిత్రాలు వేయించు కోవడానికి వారు తహతహలాడుతూండేవారు. బ్రిటిష్‌ పాలకు లు సైతం ఆయన వర్ణచిత్రాల పట్ల ఆసక్తి ప్రదర్శించేవారు. నేడు జమీందారుల ఇళ్ళలో పాత పెయింటింగులు, శిథిలమైనప్పటికీ వారి వైభవాన్ని చూస్తాం. రవి చేత చిత్రపటం గీయించుకొని, వారి పూర్వ స్థితిని మనకు తెలియజేస్తారు.
'స్వీయబుద్ధికి లోకరీతికి పొంతన కుదరదు'. పరమల్‌ చిత్రాలు గీయలేదు, లాభసాటిగా కూడా కనిపించలేదు.
తమ్ముడు రాజావర్మ నవలలు, చరిత్ర పుస్తకాలతో మల యాళీ సమాజం స్థితిగతులపై ఆంగ్లంలో వ్యాసాలు రాసే పనిలో పడి అన్నకు అందని మరో ప్రపంచంలో గడిపాడు.
'సంచార ప్రాణుల సహజ స్వభావం మనిషే కాదు, తిర్యగ్జంతువులకు కూడా కాలు బయటపెడితేనే మనుగడ. తిండి కోసం, సంపద కోసమే కాదు, సమస్త దాహాలూ తీర్చు కోవడానికీ, భావాల్లో, మాటల్లో, కదలికల్లో... సారాంశంలో జీవితరంగ భూమిపై నిరంతరం, నవ నవోన్వేషంగా పురి విప్పి నర్తించడానికీ సంచారం అనివార్యం.'
రాజావర్మ ప్రయాణంలోనే సుస్తీ చేసింది. రవి అతణ్ని మదరాసు చేర్చి కడుపులో పుండుకు శస్త్రచికిత్స చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. తమ్ముడు రాజావర్మ భౌతికంగా రవికి దూరం అయ్యాడు. రవివర్మ మానసికంగా ఒంటరి వాడయ్యాడు. శారీరక శక్తి క్షీణించింది. బ్రిటిష్‌ చక్రవర్తి పలు రంగాలకు చెందిన ప్రముఖులకు 'కైజర్‌-ఇ-హింద్‌' ప్రకటిం చింది. రవికి 1904లో ఇచ్చారు.
కురాళం జలపాతంలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసి అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని తలచాడు. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాడు. రవివర్మ డయాబెటిక్‌ అని డాక్టర్లు నిర్ధారణ చేశారు. క్రమంగా శక్తి కోల్పోయాడు. అయినా పెయింటింగ్‌ మానుకోలేదు. దివాణం లో స్థిరపడ్డాడు. బంధువులు, మిత్రులు అంతా అక్కడే ఉన్నారు. రవి అనారోగ్యం గురించి దేశం అంతా తెలిసి పోయింది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా డాక్టరు బాలచంద్ర, మతారు, శ్రీరామ్‌ పంత్‌, కేశవజోషి బొంబాయి, మద్రాసు నుంచీ వచ్చారు. ప్రాంతీయ, దేశీయ, విదేశీయ పత్రికా లేఖకులు చేరుకున్నారు. శ్వాస అందక ఛాతీ ఎగిసిపడింది. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. కొసల్లోంచి రెండు నీటి చుక్కలు రాలాయి. ముఖంలో వేదన తొలగి ప్రశాంతత ఆవరించింది. వాకిట్లోంచి చల్లగాలి రివ్వున లేచింది. ప్రాణదీపం ఆరిపోయింది.
్జ్జ్జ
రచయిత పి.మోహన్‌ ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి అనేక వ్యాసాలు, డైరీలు సేకరించి, అనేకమంది ప్రత్యక్ష పరోక్ష పరిచయస్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించి, అసమాన మైన ఓర్పుతో రాజా రవివర్మ జీవితానికి నవలారూపం ఇచ్చారు. మోహన్‌ ఆయన రచనాశైలి కుంచెతో చిత్రించినట్లు కనిపిస్తుంది. కవి కానీ, చిత్రకారుడు, చరిత్రకారుడు కానీ తను చూసే వ్యక్తుల్ని తెలుసుకున్న నాడు ప్రగాఢంగా తనపై ముద్ర వేస్తారు. వారినుంచీ తప్పించుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు ఆ రచయితను వెంటాడి విసిగించి తమ సంగతి తేల్చుకుంటారు. అలా మోహన్‌ పాఠకుల ముందు రవివర్మను తీసుకువచ్చాడు. అందరూ చదవాల్సిన నవల ఇది.