మనసును తడిమే కలుంకూరి గుట్ట కథలు

నరహరిరావు బాపురం
99086 56434

కథలంటే అవి ప్రత్యేకంగా ఎక్కడినుంచో పుట్టుకు రావు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట నిత్యం కళ్ళముందు జరిగేవే కథకుడి కలంలో కథల రూపంలో ఒదిగిపోతాయి. వాస్తవికతను సహజత్వాన్ని రంగరించుకున్న సజీవత్వాన్ని సంతరించుకున్న కథలు పాఠకుల మనసులను చూరగొంటాయి. మనసున్న మనుషుల హృదయాలను తడుముతాయి. వివిధ రకాల జీవితాల్లో నిజ జీవితాలతో మమేకమైన కథలను చదివే పాఠకుడికి అవి కథల్లా అనిపించవు. పైగా 'అరే! ఇందులో ఉన్నవి మన జీవితాలేనే!' అని అనుకొని 'మన జీవితాలను ఎంత బాగా దర్శింపజేసాడీ కథకుడు' అని ఆశ్చర్యపోతాడు. ఆ అచ్చెరువులోంచి తేరుకొని 'ఈ రచయిత మనవాడేనబ్బా!' అని కథతో పాటు కథకుడినీ సొంతం చేసేసుకుంటారు. పాఠకుడిలో సరిగ్గా అలాంటి భావనలను ప్రతిఫలింపజేసే కథకుడు కె. వి. మేఘనాథ్‌ రెడ్డి. ఈ రచయిత 'కలుంకూరి గుట్ట కథలు' అనే కథా సంపుటితో తెలుగు సాహిత్యరంగంలో ముందుకు వచ్చాడు. ఒక్కో కథ చదువుతుంటే John Steinbeck అనే నోబెల్‌ బహుమతి రచయిత చెప్పిన మాటలు నిజమనిపిస్తాయి. If a story is not about the hearer he will not listen... A great lasting story is about everyone or it will not last. The strange and foreign is not interesting - only the deeply personal and familiar. ఈ అభిప్రాయం నిజమని తన కథల ద్వారా నిరూపించాడు ఈ రచయిత. ఈ సంపుటిలోని కథలు చదువుతున్న పాఠకుడు ఆ కథలలో చేరిపోతాడు. కథల్లోని వాతావరణాన్ని తన చుట్టుపక్కలే సందర్శిస్తాడు. కథల్లోని భావాలు- దుఃఖమో... బాధో... సంతోషమో... ఏదో ఒకటి మనలను మనల్నిగా వదలకూడదు. కథకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఆ భావోద్వేగాలన్నీ మనలను చేరిపోవాలి. ఇంకా కథకుడు చెప్పనివి కూడా మన ఇంగింతానికి అర్థమై పోవాలి. అచ్చంగా అలాంటి కోవకే చెందినవి కలుంకూరి గుట్ట కథలు.
ఈ కథా సంపుటి ద్వారా అలా పాఠకుడి మదిని ఆకర్షించడంలో ఒక విధంగా రచయిత కృతకృత్యుడయ్యాడు అనే చెప్పవచ్చు. ఇందులో 12 కథలు ఉన్నాయి. అన్ని కథలు పల్లెసీమల నేపథ్యాన్ని ప్రతిబింబించేవే అయినా ఏ కథకాకథ తనదైన విశిష్టతతో అలరిస్తుంది. ఇక్కడ కథకుడు కథలను మామూలుగా కాకుండా యాసలో రాయడం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. కథల్లో యాసను ఒదిగింపజేస్తూ కథలను హృద్యంగా చిత్రీకరించడమనేది ఒకవిధంగా అంత సులభసాధ్యం కాదనే చెప్పవచ్చు. ఆ విధంగా రాసి మెప్పించిన వారిని తెలుగు సాహిత్యరంగంలో వేళ్ళమీద లెక్కింపవచ్చు. కానీ తన మొదటి కథల పుస్తకంలోనే అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన ప్రాంతంలోని యాసకు ప్రాముఖ్యతనిస్తూ పల్లె జీవితాలను కథల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మట్టి పరిమళాలను ఆస్వాదించేట్లు చేసిన రచయిత మేఘనాథ్‌ అభినందనీయుడు.
ఈ రచయిత సాహిత్య రచనకు పూనుకొని ఇంకా మూడేళ్ళు కాలేదంటే ఆశ్చర్యమే మరి! సాహితీరంగంలో బుడి బుడి నడకల ప్రాయంలోనే అద్భుతంగా కథలను ఆవిష్కరించడ మంటే పువ్వు పుట్టగానే పరిమళించిన వైనం గుర్తుకు రాక మానదు. రచయిత ముప్పాతిక భాగం తన కథల్లో కథను చెప్పే రీతిలో నవ్యమైన శైలిని చొప్పించాడు.A story has no beginning or end : arbitrarily one chooses that moment of experience from which to look back or from which to look ahead అని ప్రఖ్యాత ఆంగ్ల రచయిత గ్రాహం గ్రీన్‌ మాటలు గుర్తుకు వస్తే... ఆల్‌ ది క్రెడిట్‌ గోస్‌ టు మేఘనాథ్‌.
వినూత్న రీతిలో కథలను నడిపించిన తీరు అబ్బురానికి గురి చేస్తుంది పాఠకుడిని. ఈ కథలు చదవడం ముగించగానే అంతవరకూ అపరిచితమైన చిత్తూరు ప్రాంతంలోని ఒకానొక యాస పాఠకుడికి మరింత చిరపరిచితమైనదిగా మారిపోతుంద నడంలో సందేహం లేనే లేదు.
ఈ సంపుటిలో మొదటి కథ 'పనిమంతుడు'లో రంగి, రంగడు పాత్రలు చదువరి మనసును ఆకర్షిస్తాయి. ఆ పాత్రల మాటలు, చేతలు ఎంతో సహజంగా రోజూ చూసే మనుష్యుల్లో కనిపిస్తాయి. కష్టనష్టాలు జీవితంలో భాగాలే అయినా వాటిని వచ్చినవి వచ్చినట్లుగానే స్వీకరించి జీవన పూదోటను వికసింప జేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుదన్న విషయాన్ని ఈ కథలోని పాత్రల ద్వారా తెలియజేస్తాడు రచయిత. 'వాన మబ్బులు' కథలో వాన కోసం ఎదురు చూపులు, రైతు బతుకులో కలసిపోయిన దుఃఖాలు, అంతటి దుఃఖంలోనూ రేపటి రోజుపై ఆశావహ దృక్పథం... ఇవన్నీ ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ఈ కథలోని లచ్చుము పాత్ర పల్లె కుటుంబాల్లో కనపడినా... ముఖ్యంగా కథలో లచ్చుము చూపించే తెగువ, ఆలోచనా పద్ధతి ఒకింత విస్మయం కలుగజేస్తుంది. ఈ కథను నడిపించిన తీరు అనిర్వచనీయం అనిపిస్తుంది. 'ఒలికిలి' కథలోని పిచ్చోడి పాత్ర చాలా కాలం మనలను వెంటాడుతూ ఉంటుంది. 'కలుంకూరి గుట్ట' కథలో చిన్నమ్మి, ఆనందుడుల ప్రేమ మన హృదయాలను కట్టి పడేస్తుంది. పాఠకుడి మనసులో 'కలుంకూరి గుట్ట' వర్ణన చెరగని ముద్ర వేయడమే కాక చదువరిని చేయి పట్టి ఆ గుట్టవైపు తీసుకెళుతుంది.
ఈ సంపుటిలోని కథలు చాలా మటుకు ఆ గుట్ట చుట్టుపక్కల చిత్రీకరించినవే! కలుంకూరి గుట్టను ఒక్కసారైనా సందర్శించాలనే కోరిక చదువరి మనసులో బలీయమౌతుంది. ఆ విధంగా కథల ద్వారా మనసులను చూరగొనడంలో రచయిత సఫలమైనట్లే! My short stories are like soft shadows I have sent out in the world, faint foot prints I have left. I remember exactly where I set down each and every one of them and how I felt when I did అని చెబుతారు జపనీస్‌ రచయిత హరుకి మురాకమి ఒకానొక సందర్భంలో. సరిగ్గా 'కలుంకూరి గుట్ట కథలు' ద్వారా రచయిత మేఘనాథ్‌ ఇదే చెబుతున్నాడని అని పిస్తుంది. తన జీవిత అనుభవాలను ఎటువంటి ఆడంబరాలు లేకుండా కథల్లో చొప్పించాడు రచయిత. తను పుట్టి పెరిగిన పల్లెల్లో తాను పెరుగుతూ గమనించిన అంశాలనే కథా వస్తువులుగా మలచి కథలకు సహజత్వాన్ని ఆపాదించాడు.
మట్టి పరిమళాలు మన నాసికలకు చేరి మనలను కాస్సేపు మరో లోకానికి తీసుకెళ్తాయి. కల్మషంలేని మనసున్న మనుషుల జీవితాలు మనలను స్ప ృశించి మానవతానుభూతిని కలుగ చేస్తాయి. హదయాలను స్పశిస్తాయి... మనమింకా జీవించి ఉన్నామన్న స్పృహను కలిగిస్తాయి. కథల్లోని ప్రతి పాత్రను సజీవంగా కళ్ళ ముందు నిలిపిస్తాయి. ఇలా ఏ కథ తీసుకున్నా ఏదో ఒక విధంగా మన జ్ఞాపకాల తేనెతుట్టిని జీవితకాలం పాటు కదిలిస్తూనే ఉంటాయి. లేదా ఆ కథలు... కథల్లోని పాత్రలు మన జ్ఞాపకాల పొదరిల్లులో పదిలమై కలకాలం ఉండిపోతాయి.When you read a short story, you come out a little more aware and a little more in love with the world around you అని మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ విన్నర్‌ జార్జ్‌ సాండర్స్‌ చెప్పిన వాక్యాలు యథార్థమని నిరూపిస్తాయి ఈ సంపుటిలోని కథలు. మనకు తెలియకుండానే రచయిత తన కలం చేత ఆవిష్కరించిన సజీవ వాతావరణంలో మమేకమైపోతాము.
పల్లె జీవితాల్లో పొడచూపే చిత్ర వైచిత్రాల అనుభూతుల రంగుల చిత్రాలను యథాతథంగా కనులముందు దృశ్యీ కరించడమే కాక యాసకు పట్టం కట్టి కథా సింహాసనంపై కూర్చోబెట్టిన రచయిత మేఘనాథ్‌ ఎంతైనా అభినందనీయుడు. ఎటూ ఇది రచయిత మొదటి సంపుటి కాబట్టి ఇందులోని లోటుపాట్లు తెలుసుకుని వాటిని సవరించుకొని ముందుకు సాగితే మున్ముందు తెలుగు సాహిత్యరంగంలో తనదైన ముద్రను వేసుకునే అవకాశం ఉంది మేఘనాథ్‌ రెడ్డికి. మరిన్ని కథలు ఈ నవ్య రచయిత కలం నుంచి ఆశిద్దాం.