సారంగదరియా .. సంవాదమేందయా?

తెలకపల్లి రవి
ఒక పాట లేదా రచన సినిమా మరేదైనా హిట్‌ అయిందంటే దానిపై ఒక వ్యర్థ వివాదం లేవనెత్తడం ఒక రివాజుగా మారుతున్నది. అదేదో విషయం గురించి అయితే అదే తీరు. కేవలం దాని మూలం ఏమిటి, అనుకరణా? అనుసరణా? వంటి సాంకేతికాంశాలతో వాదన సాగుతుంది. ఇప్పుడు సారంగ దరియా పాటపై పంచాయతీ కూడా ఆ కోవలోదే. ఫీల్‌గుడ్‌ చిత్రాలు తీయడంలో శేఖర్‌ కమ్ముల సాటిలేని మేటి అయితే, పాపులర్‌ పాటల్లో అందెవేసిన చేయి సుద్దాల అశోక్‌ తేజ. వీరిద్దరూ కలిపి ఫిదా కోసం రూపొందించిన 'వచ్చిండే' ఆల్‌ టైమ్‌ హిట్‌. ఇప్పుడు సారంగదరియా కూడా ఆ తరహాకు చేరిపోయే సూచన లు రావడం వల్ల కావొచ్చు చర్చ రచ్చ సాగాయి. ఇంతా చేసి ఆ పాటలో అంత మధనం చేయాల్సిందేమీ లేదు. దర్శకుడి కోరికపై జానపద తరహాలో కవి ఒక పాపులర్‌ పాట రూపొందించాడు. దానికి మూలం అంతకుముందు జానపద గీతాల పోటీలో కోమలి అనే అమ్మాయి పాడిన పాట అనేది వినగానే అర్థమై పోతుంది గనక దాపరికమేమీ లేదు. పోనీ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న లాగా కోమలి రాశానని చెబుతున్నదీ లేదు. ఇక ఇందులో సమస్య ఏమిటి?
నేను విన్నంతలో రెండు మూడు అంశాలు అనిపించాయి. ఒకటి కోమలికి చెప్పకుండా వాడుకున్నారు. వాడుకున్నా తప్పు లేదు గాని తామలా చేయలేదని వారంటున్నారు. నా పాట మంగ్లీ ఎందుకు పాడాల్సి వచ్చిందని ఆ అమ్మాయి అడిగితే అయ్యో అనిపించవచ్చు గాని ఫోన్‌ చేసి చెప్పామని, పాడమని కూడా అడిగితే గొంతు బాగాలేదని ఆమె చెప్పారని అశోక్‌ తేజ వివరిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల కోమలి పేరు కూడా జతచేశారు. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే ఇదంతా వచ్చిందని ఉభయులూ అంగీకరించి, సుహృద్భావంతో రచ్చకు ముగింపు పలికారు. ఇప్పుడది సమస్య కాదు. పోటీలో విన్న పాటను అశోక్‌తేజ వాడుకోవడం ఏదో నిజాయితీ రాహిత్యమైనట్టు కొందరు చేస్తున్న వ్యాఖ్యలే హాస్యాస్పదమైనవి. జానపదం ఎవరిదీ కాదు అంటే దాన్ని తప్పు పడుతున్నారు. ఈ పాట హిట్‌ కాకుంటే ఇదంతా జరిగేదా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులభం.
'చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు' పాట ఉందనుకుందాం.. లేకుంటే 'గోగులు పూచే గోగులు పూచే' తీసుకుందాం.. కాదంటే సుప్రసిద్ధమైన 'ఏరువాక సాగారో' తీసుకుందాం. ఎవరిది పేటెంట్‌? ఎవరిది కంటెంట్‌? ఎప్పుడూ చర్చ జరగలేదే? నేను సైతం ప్రపంచాగ్నికి అన్న శ్రీశ్రీ చరణాలను అశోక్‌తేజ రెండుసార్లు వాడుకున్నారు, రుద్రవీణలోనూ టాగోరులోనూ. అవార్డులు కూడా వచ్చాయి. జానపదాల్లాగే క్లాసిక్స్‌ కూడా అందరివీ. ఇప్పుడు నేను జగమే మాయను మరో విధంగా రాస్తానంటే ఎవరూ కేసు వేయలేరు.
దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తపు రవిక మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దానిపేరే సారంగ దరియా అన్న ఈ చరణాలు జానపదాన్ని ప్రేరణగా తీసుకుని సినీకరించినవి తప్ప పేటెంటు ముచ్చట ఏముంటుంది? పాడటమంటారా? మంగ్లీకి ప్రత్యేక తరహా స్వరం వుంది గనక పాడించి ఉండొచ్చు, మామూలుగా ఉండే స్వరాలు, రూపు అక్షరాలు సినిమాకు సరిపోకపోవడం తరచూ జరుగుతుంటుంది.
సారంగ దరియా పదాల గురించి కూడా చాలా చర్చ చేస్తున్నారు. ఇవి కొత్తవి కావు. సారంగధర అన్నది తెలుగునాట ఒక శృంగారంతో ముడిపడిన ప్రయోగం. 'రాజు లేనప్పుడు సారంగో నీవు రారాద పోరాద సారంగో' పాట తెలియని వారెవరు? మహాభారత చరిత్రతో మొదలైన రాజరాజనరేంద్రుని కొలువులో మొదలయ్యే పాట అది. పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం బతుకుతెరువు కోసం ఘంటసాల గానంలో సముద్రా జూనియర్‌ రాసిన పాట సరేసరి. సారంగి అనే పల్లీయ వాద్యం కూడా వుంది. ఇక దరియా అనేది ధర అన్నదానికి దగ్గరగా వుండటం ఒకటైతే హిందీలో లేదా సంస్క ృతంలో అర్థాలు వెతుకుతున్నారు, చెబుతున్నారు. అయితే పాపులర్‌ సినిమా సంగీతంలో ముందు కూర్పులో నేర్పు, తర్వాతనే అర్థంపై తీర్పు. సూపర్‌ హిట్‌ అయింది గనక అదే అంతిమమనీ కాదు.
ముత్యాల ముగ్గులో సినారె రాసిన పాట గుత్తపు రవిక ఓమ్మ చెమట చిత్తడిలో తడిసి ఉండగా.. గుర్తు చేసుకుంటే గుత్తపు రవిక పదం కొత్తదేమీ కాదని తోస్తుంది. మరిన్ని పాటల్లోనూ ఆ ప్రయోగం ఉంది. ప్రాంతాల వారీ తేడాతో ఎన్ని వున్నా ఆస్వాదన లోనూ, ఆచ్చాదనలోనూ కూడా తెలుగు భాష మాధుర్యానికి మచ్చుతునకగా నిలిచే మధుర పదసంపద చాలానే వుంది. వాటిని స్వీకరించాలే గాని ఊరకే సాగదీసుకుంటే స్వారస్యం మిగలదు. సామజవరగమనా నిను చూసి ఆగగలనా పాటలో కాళ్ల గురించి అంత రాయడం గతంలో జరిగిందా అంటే లేదు, అలా అని అనంతంగా ఆస్వాదించలేదా? సంగీతానికి సృజనకూ కూడా సాధారణ వాద ప్రతివాదాలే కొలబద్దలైతే అప్పుడు కళాభిరుచి కాస్త గట్టెక్కుతుంది.
సాహిత్య సృష్టిలో సారూప్యతలు, సామీప్యతలే కాదు పాత దాన్నే కొత్తగా చెప్పాల్సి రావడం సహజమే. ఇతర భాషా పదాలు రాయాల్సి రావడం కూడా సహజం. శూన్యం నుంచి ఎవరు ఏమీ సృష్టించలేరు. పాతది లేకుండా కొత్తది సృష్టించలేము. ఈ ప్రపంచీకరణ యుగంలో ఉంటూ కూడా పక్క రాష్ట్రాల పదజాలం రావద్దనలేము. పక్కదేశాల పదాలను కూడా ప్రయోగించాల్సి రావచ్చు. పైగా మల్టీ కల్చర్‌ ఉన్న సినిమా రంగంలో అలా కాదని అసలు ఊహించగలమా? అందుకని పాతది కొంత తీసుకుని కొత్తగా రాయడం ఇవాళే సుద్దాల అశోక్‌ తేజ మొదలు పెట్టింది కాదు. ఆయన చివర కూడా కాదు.