సంపాదకీయం

హిందీ హడావుడి, అలజడి
హోంమంత్రి అమిత్‌ షా హుకుంలు, తర్వాత పరిణామాలు చూస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హిందీని దేశమంతటిపై వెంటనే రుద్దేయాలని ఎంత హడావుడి పడుతున్నదీ స్పష్టమవుతుంది. గతంలో వచ్చిన నిరసన బేఖాతరు చేసి మళ్లీ పాత ఫక్కీకే దిగడం యాదృచ్ఛికమేమీ కాదు. రాజ్యాంగం అధికారిక భాషలుగా గుర్తించినవే 22. మరో 38 భాషలు అందులో చేర్చాలనే ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. దేశంలో మాట్లాడే భాషలు, ఉప భాషలు 400 పైనే. దక్షిణాన తమిళం, తెలుగు వంటివి సుదీర్ఘ చరిత్ర గలవి. హిందీ అమలు విషయంలో తొందరపాటు దేశానికే అనర్థదాయకం.
విదేశీ భాష ఇంగ్లీషుకు లేని అభ్యంతరం దేశంలో సగంమంది మాట్లాడే హిందీకి దేనికని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. నిజానికి హిందీ మాట్లాడేవారి లెక్క కృత్రిమంగాపెంచి చూపుతున్నారు. హిందీ, హిందూత్వ, హిందూస్థాన్‌ మంత్రత్రయం సంఘ పరివార్‌ ఎప్పుడూ వదలిపెట్టింది లేదు. భారత దేశ చారిత్రక వాస్తవికతలూ, భాషా సాంస్క ృతిక వైవిధ్యాలు తెలిసిన వారెవరూ ఒకే భాషను, మతాన్ని దేశమంతటా అమలు చేయడం సాధ్యమని అనుకోరు. రెండొందల ఏళ్లు బ్రిటిష్‌వారు పాలించిన ఈదేశంలో ఇప్పుడు ప్రపంచీకరణ తోడై ఆ భాషాధిపత్యం మరింత పెరుగుతుందన్నా .. దానికి పాలకుల పోకడలే ప్రధాన కారణం. గురజాడ చెప్పినట్టు దేశభాషలు వికసించకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. 1960లలో హిందీని ఏకపక్షంగా రుద్దాలని చూడటం సహజంగానే తీవ్రమైన అశాంతికి దారితీసింది. చివరకు ఏ రాష్ట్ర శాసనసభైనా స్వచ్ఛందంగా తీర్మానం చేస్తేనే హిందీని అమలుచేయాలని నిర్ణయించారు. అప్పటివరకూ అనుసంధాన భాషగా ఆంగ్లం కొనసాగాలని అధికార భాషా విధానంలో పేర్కొన్నారు. రాజ్యాంగం 343 నుంచి 351 వరకూ గల అధికరణాలు చెప్పేదదే. హొంమంత్రి అంటున్నట్టు హిందీయేతరులు ప్రభుత్వాలు ఆ భాషలోే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాల్సిన అవసరం లేనేలేదు. అలా చెప్పడం ప్రజాస్వామ్యమూ కాదు.