మానవ విలువలూ .. సామాజిక సంబంధాలూ ...

రాజాబాబు కంచర్ల
94900 99231

ఏ కథ పుట్టినా... ఆ కథకు ఆ వ్యవస్థలో రూపుదిద్దుకున్న అనేక సంఘటనలు, సందర్భాలు ప్రేరణగా నిలుస్తాయి. కథ సమాజానికి నిలువుటద్దం. రచయిత బాలం వెంకటరావు 22 కథలతో తాజాగా 'పరిహారం' (మరికొన్ని కథలు) పేరిట ఒక సంపుటి వెలువరించారు. వీటిలో ఎక్కువ భాగం నాలుగు దశాబ్దాల క్రితం రాసినవే కావడంతో... నాటి పరిస్థితులకు, నాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడతాయి. ముఖ్యంగా ఈ సంపుటిలోని అన్ని కథలూ మనిషి జీవితంలోని వివిధ కోణాలను స్పృశిస్తూ, మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపుతాయి. మానవ సంబంధాలను, మనిషి విలువలను విశ్లేషిస్తాయి. నిత్యజీవితంలో సమాజంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కథావస్తువుగా తీసుకొని సరళమైన శైలిలో కథలుగా మలిచారు. మనిషిపై మనిషికి నమ్మకం వుండాలని, బంధాలను, విలువలను వస్తురూపంలో లెక్కించరాదన్న అంశం దాదాపు ప్రతి కథలోనూ కనిపించే సారూప్యత.
ఈ పుస్తక శీర్షికగా ఎంచుకొన్న 'పరిహారం' కథ యజమాని తన తప్పును నౌకరుపై వేసే కుటిల మనస్తత్వాన్ని చిత్రిస్తూ సాగుతుంది. ఊళ్లలో ఉండే రాజకీయాలకు పనోళ్లు ఎలా బలైపోతుంటారో, యజమానులు ఎలా తప్పించుకుంటారో ఈ కథ కళ్లకు కడుతుంది. కరెంటు షాకుకి గేదెని పోగొట్టు కున్న నరసయ్య 'పరిహారం' కోసం ఉద్యోగం వదులుకోవాలో, ఉద్యోగం కోసం యజమాని అన్యాయాన్ని సహించాలో అర్థంకాక తల్లడిల్లుతాడు. యజమాని బాగుంటే తనకో పదిరూపాయలు పెంచమని అడగొచ్చని పనివాళ్లు అనుకుంటే, పనివారి శ్రమను ఎలా దోచుకోవాలా అని యజమాని చూస్తుం టాడు. పెట్టుబడిదారులు... కార్మికుల మధ్య వుండే వైరుధ్యం ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.
కాలం ఎంత అభివృద్ధి చెందినా, విజ్ఞానం ఎంత పెరిగినా సాటి మనిషిలో నిజాయితీ, మాట మీద నమ్మకం వున్నంతకాలం రుజువులు, సాక్ష్యాలు అక్కరలేదని, మనిషి వస్తువు కాదు... మనిషి మీద మనిషికి నమ్మకం వుండాలని, మనిషిని మనిషి నమ్మలేనినాడు జీవితం దుర్భరం అవుతుందని చెప్పే కథ 'విలువలు'. మనిషిని మనిషి నమ్మకపోతే మానవత్వానికి అర్థం ఉండదని ఈ కథ ద్వారా రచయిత విలువైన విషయాలను చెబుతారు.
కొందరు నవ్వుని ముఖాన మాస్క్‌లా తగిలించుకొని పైకి ఎంతో అప్యాయతను ఒలకబోస్తారు. ఆ నవ్వు వెనుక, ఆ ఆప్యాయత వెనుక అసలు రూపం వేరే ఉంటుంది. 'సార్‌' అంటూనో, 'గారూ' అంటూనో పిలుస్తూనే పక్కకు వెళ్లి అవమానకరంగా మాట్లాడతారు. స్కూలు పిల్లల్లా 'అరేరు'... 'ఒరేరు' అనుకుంటూ ఎందుకు అన్యోన్యంగా వుండలేక పోతున్నాం... అనే ప్రశ్న 'ఒరేరు' కథలో కనిపిస్తుంది. 'ఒరేరు' అని పిలిపించుకోడానికి రాజారావ్‌ పడిన తపన, ఆవేదన చూసి.. 'ఒరేరు' అని ఆప్యాయంగా పిలిచే ఒక్క స్నేహితుడూ లేని జీవితం వ్యర్థమని ఈ కథ చదివినవారికీ అనిపిస్తుంది. మంచి పంటభూమిని, పచ్చని పంట పొలాలను చేపల చెరువులుగా మార్చేసి, డాలర్లు సంపాదనలో పడి పచ్చని ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే పరిణామాలేమిటో 'చేను-చేప' కథ చెబుతుంది. పచ్చని చెట్లను కూడా నరికేస్తే... కాస్తంత నీడ కోసం, కాసిన్ని మంచినీళ్ల కోసం అప్పల్రాజు పడే నరకం, అతను సంపాదించిన డబ్బు తీర్చలేకపోతుంది. ఆ అనుభవం తర్వాత అప్పల్రాజు ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఈ కథ చదివితే అర్థమౌతుంది. ప్రకఅతిని విధ్వంసం చేస్తే ఎలా గుణపాఠం చెబుతుందో 'చేను-చేప' వివరిస్తుంది. మనిషికి- పర్యావరణానికి ఉన్న సంబంధాన్ని, పర్యావరణం ధ్వంసమైతే మనిషి పరిస్థితి ఏంటన్న విషయాన్ని సుబోధకంగా వివరిస్తుంది.
ప్రేమ పేరుతో వంచనకు గురై, వ్యభిచార రొంపిలో కూరుకుపోయిన ఓ యువతి కథ 'వాసనలేని పువ్వు'. ప్రేమించిన వాడిని నమ్మి, తల్లిదండ్రులకు చెప్పకుండా... ఇల్లు వదిలిపోయిన యువతి... తన జీవితం ప్రేమించిన వాడితో అద్భుతంగా... పూలనావలా సాగిపోతుందనుకున్న దశలో ఓ బిడ్డకు తల్లవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమించి, అద్భుతమైన జీవితాన్నిస్తానని చెప్పిన శ్యామలరావు... 'ఇకముందు నాకేమీ కావు. మిగిలిన గొడవల్తో నీతోనూ కూడా నాకు సంబంధం లేదు' అంటూ ఒక అర్ధరాత్రి తల్లీబిడ్డను వదిలేసి వెళ్లిపోతాడు. బతుకుదెరువు కోసం ఆ యువతి రోడ్డున పడితే... ఈ వ్యవస్థ ఆమెను వేశ్యగా మార్చుతుంది. బిడ్డను అనాధాశ్రమానికి చేర్చుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ యువతి తన అక్క, బావను ఎలా కలిసింది... తర్వాత ఆ యువతి ఏమైంది అనేది ఈ కథ చెబుతుంది.
ఈ దేశానికే కాదు... ఏ దేశానికైనా ఆహారం అందించేవాడు రైతు. అలాంటి రైతు వ్యవసాయ రంగం నుంచి తప్పుకుంటే మనిషి మనుగడకు అర్థం లేదని 'పునరాగమనం' కథ చెబుతుంది. నిచ్చెన మెట్లలాంటి ఈ దళారీ వ్యవస్థలో రైతు ఎంత దోపిడీకి గురవుతున్నాడో వివరిస్తుంది. వ్యవసాయం శుద్ధ దండగ అని, గిట్టుబాటు ధరలేక అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని, వ్యవసాయాన్ని వదిలి.. పట్నం వెళ్లి... చెరకురసం బండి నడిపిన ఓ యువకుడి కథ ఇది. చివరకు చెరకురసం బండి నడపడంలో వున్న పోటీతో పాటు.... రైతు ఎలా మోసపోతున్నాడో కూడా తెలుసుకుంటాడు. రైతు వుంటేనే మానవజాతి బతికి బట్టకడుతుందని, వ్యవసాయంతోనే రైతు మనుగడ అని ఈ కథ చెబుతుంది.
ఈ రోజుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రవర్తన... మనిషికి ఆభరణం వంటిది. ఎంత పెద్ద చదువు చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా... ఉద్యోగానికి ఆ సర్టిఫికెట్లతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యం. ఆ విషయాన్ని చాలా సింపుల్‌గా వివరించిన చిన్న కథ 'ఉద్యోగం'. కథ చిన్నదే అయినా... ఇందులో పెద్ద నీతి వుంది. జీతం పెంచమని అడిగితే... 'ఎందుకు?' అంటూ అర్థం లేని ప్రశ్న వేస్తాడు యజమాని. తన వ్యాపారాన్ని పెంచుకోడానికి లంచం ఇవ్వడానికి మాత్రం వెనకాడడు. ఆ లంచం కూడా ఆ ఉద్యోగి ద్వారానే పంపుతాడు. జీతం పెంచమంటే సర్దుకుపొమ్మని చెప్పే యజమాని పై అధికారులకు తన చేతుల మీదుగానే లంచాలు ఇప్పిస్తుంటే... విసిగిపోయిన ఉద్యోగి ఏం చేశాడన్నదే 'సంపాదన' కథ సారాంశం.
'తప్పెవరిది?' కథలో సత్యవతి పాత్ర చిత్రరణ అభ్యంతర కరంగా ఉంది. కోర్కెలతో బరి తెగించిన అమ్మాయిగా.... చిత్రించారు. శంకరం పాత్రను ప్రవేశపెట్టిన తీరు కూడా సందర్భోచితంగా లేదు. సత్యవతే శంకరాన్ని పిలిచి, తన కథ తనే చెప్పుకోవడం అంత ఆసక్తికరంగా లేదు. సత్యవతి కథను చెప్పడానికి ప్రవేశపెట్టిన ఒక అప్రధాన పాత్ర శంకరం. వయస్సు తొందరలో కోర్కెలకు బానిసైతే... నైతికంగా, భౌతికంగా ఎలా పతనం అవుతామో చెప్పాలనుకున్న రచయిత తాపత్రయం అభినందనీయమే. అదే సందర్భంలో సత్యవతి పాత్రను, తన ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పే సన్నివేశాన్ని మరింత బిగువుగా చెప్పివుంటే.. ఈ కథ ఆసక్తికరంగా ఉండేది. మొత్తం మీద ఈ కథలన్నీ చదవదగ్గవే. మనుషులను, మనస్తత్వాలను వివరించేవే!