నిరీక్షణ

గన్నవరపు నరసింహమూర్తి
77520 20213

గ్రీష్మం ...
ఎండమండి పోతోంది. ఉదయం పది గంటల వేళ ...
వడ్రంగి రావుడు తన ఇంటి ముందు సాల్లో నాగలి నక్కుల్ని వేడి చేస్తున్నాడు. తొలకరి వచ్చిందంటే రైతులు పొలం బాట పడతారు. నాగళ్ళను, బండ్ల కమ్మిలను, కొడవలి కక్కుళ్ళను, పార, బొరిగెలను కంసాలి రావుడికిచ్చి వాటిని జారు చేయమంటారు.
వందల ఏళ్ల నుంచి పల్లెల్లో ఈ పరంపర కొనసాగుతోంది. ప్రతి పల్లెలో రెండు వందల రైతు కుటుంబాలు ఉంటే వాళ్ళ అవసరాల తీర్చడం కోసం ఒక వడ్రంగి, ఒక మంగలి, ఒక చాకలి, ఒక తెలక కుటుంబాల వారు ఉంటారు.
ఊళ్ళోని రైతులు తమ ధాన్యాన్ని, గడ్డిని, వరి చేలను, జనప చేలను, చెరకు గడల రవాణా కోసం కర్ర బళ్ళను, పొలం దున్నడానికి నాగళ్ళను, నూతిలోంచి నీళ్ళను తోడటానికి ఏతాములు బాగు చెయ్యటం కోసం వడ్రంగి దగ్గరకు వస్తారు.
రావుడు గాలితిత్తితో పొయ్యిని వేడి చేస్తూ నాగలి నక్కుల్ని వేడిచేస్తున్నాడు. ఇంతలో రైతు పరసన్న ... పొలం నుంచి వస్తూ రావుడు శాలలోకి ప్రవేశించాడు.
''రావుడూ... మా నాగలి నక్కులు అయిపోయినాయా? ఇచ్చి వోరం రోజులైపోనాది'' అన్నాడు.
''బావా, రేపిచ్చెత్తానులే... కొడుకులు ఊళ్ళో నేకపోవడంతో నేనొక్కణ్ణే అందరి పనులు సేయివలసి వత్తోంది'' అన్నాడు.
ఇంతలో ఇంకో రైతు అప్పలస్వామి పొలానికి వెళ్తూ రావుడి శాల్లోకి వచ్చాడు.
''ఏరా రావుడా... మా బండికి కమ్మిని బాగుసెయ్యిమనీ ఇచ్చినాను. సేసినావా నేదా?'' అని అడిగాడు.
''రెండు రోజులు పోనీ మావా... నా కొడుకులు ఊర్నించి వచ్చేత్తారు. ఆళ్ళు రాగానే మీ బండి కమ్ముల్ని మార్సెత్తాను'' అన్నాడు.
అదే సమయంలో ఆ ఊరి సర్పంచ్‌ గురివినాయుడు కొడుకు రాజు వచ్చి ''బావా! ఈ నాలుగు కొడవళ్ళ నక్కులు పాడైపోనాయి. గడ్డి కొయ్యిడానికి ఇబ్బందౌతోంది. కొద్దిగా జారు సేద్దూ'' అంటూ కొడవళ్ళని రావుడికిచ్చేడు.
తొలకరిలో రావుడి కుటుంబానికి క్షణం తీరికుండదు. అందరి రైతులకు వడ్రంగితో పనుంటుంది. రావుడు ఈ వడ్రంగి పనిని తన తండ్రి రామాచారి దగ్గర నేర్చుకున్నాడు. రామాచారి రెండేళ్ళ క్రితం చనిపోయాడు. అతనికి రావుడు, సోముడు ఇద్దరు కొడుకులు, ఇద్దరూ విడిపోయారు. వాళ్ళిద్దరూ ఊర్ని పంచుకొన్నారు. రావుడుకి పెళ్ళైంది. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు ఎనిమిదో తరగతి దాకా సదివి ఆ తర్వాత వడ్రంగి పనిలో చేరిపోయారు. తండ్రి దగ్గర పనంతా నేర్చుకొని తోడుగా ఉంటున్నారు. ఆ మర్నాడు అతని కొడుకులిద్దరూ ఊర్నించి వచ్చేసారు.
మర్నాడు ఉదయం పది గంటల సమయంలో రావుడు, అతని కొడుకులు పకీరు, సత్యం నాగళ్ళ నక్కులు, కర్ర తలుపులు తయారు చేస్తున్న సమయంలో... శాల ముందు ఒక మోటార్‌ సైకిల్‌ ఆగింది.
సత్యం అటు వైపు చూసాడు. మోటార్‌ సైకిల్‌కి స్టాండు వేసి పోలీసు ఇనస్పెక్టర్‌ మోహన్‌ ఖాకీ బట్టలు, తల మీద టోపీ, బెల్టుకి తుపాకీ, చేతులో లాఠీతో లోపలికి వస్తూ కనిపించాడు.
''అయ్యా! పోలీసు ఇనస్పెక్టర్‌ బాబు వత్తున్నాడు'' అన్నాడు సత్యం. రావుడికి వాడి మాటలు అర్థం కాక వీధి వైపు చూసాడు.
అప్పటికి ఎస్సై గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. వెంటనే రావుడు చేస్తున్న పనిని వదిలేసి లేచి నిలబడి ''దండాలయ్యా.. రండి'' అన్నాడు.
ఆ మాట అన్నాడే కానీ రావుడికి లోలోపల పోలీసు తమింటికి ఎందుకొచ్చాడోనని బెంగగా ఉంది.
''నీ పేరేనా రావుడు'' అన్నాడు ఎస్సై లోపలికి వస్తూ ...
''సిత్తం బాబూ'' అంటూ కూర్చునేందుకు కుర్చీ వేసాడు.
''నేను ఇక్కడ కూర్చునేందుకు రాలేదురా. మీలో రావుడు ఎవర్రా?'' అని అడిగాడు.
''నేనే బాబూ'' అన్నాడు రావుడు భయంగా...
''సత్యం నీ కొడుకేనా''
''అవును బాబూ'' అంటూ రావుడు కొడుకు సత్యాన్ని చూపించాడు.
''నీ కొడుకు సత్యం చాలా పెద్ద తప్పు చేసాడు. తెలుసా?'' అని అడిగాడు.
''బాబు నాకేటి తెలవదు. ఏటి సేసి నావురా ఎదవా?'' అని అడిగాడు కొడుకు సత్యాన్ని.
''నేనేటి సెయ్యినేదయ్యా...'' అన్నాడు వాడు భయంగా
''నువ్వేమీ చెయ్యిలేదురా? అబద్ధాలు చెబుతావా? లాకప్పులో వీర బాదుడు బాదితే గానీ నిజాలు చెప్పవు'' అన్నాడు ఎస్సై కోపంగా.
''నాకేటి తెలీదు సార్‌'' అన్నాడు సత్యం.
''బాబు ... ఇంతకీ ఏం జరిగింది?'' అన్నాడు రావుడు.
''మొన్న మేము నలుగురు నక్సలైట్లను అరెస్టు చేసి లాకప్పులో పెట్టాము. వాళ్ళు తుపాకీతో మా పోలీసుల్ని చంపి పారిపోయారు. వాళ్ళలో ఇద్దరు ఇక్కడికి వస్తే నీ కొడుకు వాళ్ళ చేతి అరదండాలను ఉలితో కొట్టి తీసేసాడట. అంటే వీడికి వాళ్లతో సంబంధం ఉన్నట్లే కదా. అందుకే వీడిని అరెస్ట్‌ చేయిడానికి వచ్చాను'' అన్నాడు ఎస్సై.
''యస్సై బాబు! ఆడు అమాయకుడు. ఈల్లిద్దరు వారం కితం యిసాకపట్టణం సుట్టాలింటికి ఎల్లినారు. ఆడికి ఆ నక్సలైట్లెవరో తెలియదు'' అని అతను కాళ్ళు మొక్కాడు రావుడు.
''ఒరేరు రావుడూ... నీ కొడుకు గురించి నీకు సరిగ్గా తెలియదు. వీడు నక్సలైట్లతో తిరుగుతన్నాడనీ మాకు మీ ఊరోళ్ళే చెప్పారు. ఈడిని ఎంక్వైరీ సెయ్యాల. పదరా దొంగ నాయాలా'' అన్నాడు ఎస్సై, సత్యాన్ని పట్టుకుంటూ.
''బాబు! ఆడికి ఒంట్లో బాగునేదయ్యా. తగ్గితే రేపు నేను మీ టేసనుకి తీసుకొత్తాను'' అన్నాడు రావుడు.
''అంటే రేపు ఈడిని ఆళ్ల దగ్గరకు పంపించేద్దామనీ చూస్తున్నావా? మీ నాటకాలు నా దగ్గర చెల్లవు. ఇప్పుడే తీసికెళతాను'' అన్నాడు ఎస్సై.
ఇంతలో లోపలికి మరో ఇద్దరు పోలీసు లాఠీలతో వచ్చారు. శాలకెదురుగా పోలీసు జీపు ఉంది. వాళ్ళు సత్యాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. గ్రామంలోని ప్రజలంతా బయటకు వచ్చి చూస్తున్నారే గానీ ఒక్కరూ అడ్డుకోలేదు.
జీపు వెళ్ళిపోగానే రావుడు కొడుకు పకీరుతో ''ఒరేరు ఆ దొంగ నాయాళ్ళు ఆడిని ఏటి సేస్తారో ఏటో.. నువ్వు కూడా ఎల్లరా. ఆల్లకేదో సెప్పి తమ్ముణ్ణి ఇడిపించుకు రా'' అన్నాడు ఏడుస్తూ. పకీరు ఐదు నిమిషాల తర్వాత సైకిల్‌ మీద పోలీస్‌ స్టేషన్‌కి బయల్దేరాడు.
రెండు రోజుల తరువాత సత్యాన్ని పోలీసులు హాస్పిటల్లో చేర్పించారు. వాడిని చూడటానికి రావుడు, పకీరు, ఊరి సర్పంచి, మరికొంత మంది వెళ్ళారు. పోలీసులు కాళ్ళ మీద, చేతుల మీద లాఠీతో బాగా కొట్టడం వల్ల సత్యం లేవలేని స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు వారం రోజుల పాటు సత్యాన్ని ఆసుపత్రిలో ఉంచి నయం చేశారు.
ఈలోపల ఒక ఘోరం జరిగిపోయింది. సత్యాన్ని అరెస్ట్‌ చేసిన ఇనస్పెక్టర్‌ మోహన్‌ బయటకు వెళ్ళినపుడు అతడిని నక్సలైట్లు కాల్చి చంపేరు. ఆ వార్త జిల్లా అంతా దావానలంలా వ్యాపించింది. సత్యాన్ని మరో మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తే పోలీసులు వాడిని వదిలేసారు.వాడు కట్లతో ఇంటికి వచ్చేసాడు.
రావుడు కొడుకు సత్యాన్ని చూసి బాధపడ్డాడు. అతని భార్య కొడుకుని చూసి బోరున ఏడ్చింది. ఊళ్ళో కొందరు కక్ష కట్టి లేని పోనివి పోలీసులతో చెప్పడం వల్లే ఈ ఘోరం జరిగిందని రావుడికి తెలిసింది.
అయినా ఏమీ చేయలేని పరిస్థితి. సత్యం వారం రోజుల తర్వాత కోలుకొని మళ్ళీ పనిలో పడ్డాడు. సత్యం మంచి పనివాడు. రైతులకు వాడి పనంటే ఎంతో ఇష్టం. అందుకే సత్యం తిరిగి వచ్చి పనులు చేస్తూ ఉండటంతో వాళ్ళు సంతోషించారు.
కానీ వారం తరువాత మళ్ళీ పోలీసులు వచ్చారు. వాళ్ళని చూసి రావుడు సత్యాన్ని ఇంట్లోకి పంపించేసాడు.
''సత్యం ఎక్కడరా? వాళ్ల గురించి వాడికి బాగా తెలిసే ఉంటుంది. ఆణ్ణి స్టేషన్‌కి పంపు'' అన్నాడు హెడ్‌ కానిస్టేబుల్‌.
''బాబూ! ఆడికి ఒంట్లో బాగునేక పోతే యీసాకపట్నం ఆసపత్రికి పంపించేను. రాగానే పంపిత్తాము'' అని అబద్ధం చెప్పాడు రావుడు.
వాడు రాగానే స్టేషనుకి పంపమని చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.
వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత సత్యం వచ్చాడు.
''నాయనా సత్యం... నువ్వు కొన్నాళ్ళు ఇక్కడుండకు. ఈ పోలీసులు నిన్ను బతకనివ్వరు'' అన్నాడు రావుడు.
అయ్య ముఖంలో భయం కనిపించింది సత్యానికి. ఏం చెయ్యాలో తోచలేదు.
అఅఅ
ఆ మర్నాడు సత్యం చీకటి పడుతుండగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. సంవత్సరం గడిచిపోయింది. వాడొస్తాడని రోజూ రావుడు, పకీరు ఎదురు చూస్తున్నారు.
కానీ సత్యం రాలేదు. ఊళ్లో అంతా వాడు నక్సలైట్లలో చేరిపోయాడని అనుకుంటున్నారు. పోలీసులు మాత్రం ప్రతి వారం రావుడింటికి వచ్చి సత్యం గురించి వివరాలడిగి వెళ్ళిపోతున్నారు.
ఆరు నెలల తరువాత ఒక రోజు రాత్రి సత్యం ఇంటికి వచ్చాడు. వాడిని చూసి రావుడు ఆశ్చర్య పోయాడు. ఇన్నాళ్ళూ ఎక్కడికెళ్ళి పోనావురా?'' అని అడిగాడు.
''అయ్యా! ఆరోజు అన్నల దగ్గరికి ఎల్లినాను. ఆళ్ళు ఆరు నెలల తరువా నన్నొదిలేసారు. ఇప్పుడు ఇక్కడుంటే పోలీసులు నన్ను వదలరు. అందుకే కొన్నాళ్ళపాటు యిసాకపట్నం ఎల్లి అక్కడే పని సేసుకొని బతుకుతాను. నేనొచ్చినట్టు ఎవ్వరికీ సెప్పొద్దు'' అని సెప్పి తల్లి పెట్టిన భోజనం తిని వెళ్ళిపోయాడు సత్యం.
రావుడు కొడుకెప్పుడు వత్తాడా అని నిరీక్షిస్తూ కాలం గడుపుతున్నాడు.