అమృత మూర్తులు

ఈదర శ్రీనివాసరెడ్డి
ఎదుటి వాళ్ళ తప్పుల్ని
పదేపదే ఎత్తిచూపుతూ
మనసు అద్దం నల్లగా
మసక బారిపోతుంది
అసలు మనిషి లోపలి
రూపాన్ని కళ్ళతో చూడలేక
అడ్డుగీతలు గీసుకుంటూ
తనకు తానే చెరిగిపోతుంది

పక్క వాళ్ళ పొరపాట్లను
పదే పదే వల్లె వేస్తూ
హృదయవీణ మెల్లగా
మూగ బారిపోతోంది
అసలు మనిషి లోపలి
గొంతుని వినిపించ లేక
అపశృతులకు తావిస్తూ
తనకు తానే లయ తప్పుతోంది

చుట్టూ ఉన్న వాళ్ళ దోషాలను
పదేపదే వెతికి పడుతూ
మదిగది గోడలు సన్నగా
బీటలు వారుతున్నాయి
అసలు మనిషి లోపలి
భావాలు అర్థం చేసుకోలేక
అపార్థాలకు బీజం వేస్తూ
తనకు తానే శిథిలమౌతోంది

తోటి వాళ్ళ వైఫల్యాలను
పదే పదే తప్పు పడుతూ
మెదడు పొరలు నెమ్మదిగా
మరుగున పడుతున్నాయి
అసలు మనిషి లోపలి
ఆలోచనలు అవగతం కాక
అనర్థాలకు తెర తీస్తూ
తనకు తానే దారి తప్పింది

అయిన వాళ్ల అపరాధాలు
క్షమించుకుంటూ పోతేగానీ
గుండె చెరువులో తడి
ఆరకుండా ఉంటుంది
అసలు మనిషి లోపలి
ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే
ఆప్యాయతలతో నిండిన
అమృత మూర్తులం అవుతాము!