ప్రతి రోజూ ఉగాదే!

ఈదర శ్రీనివాస రెడ్డి

ఆడంబరాలకు పరుగులు తీస్తే ఎండమావులే ఎదురవుతాయి
నిండిన బతుకును కాదని తలిస్తే
వెలితి కొలతలే కనిపిస్తాయి

ఉన్నదానితో తృప్తి పడక లేని దాని కోసం చూస్తే
జీవితం తెల్ల కాగితాల ఖాళీ పుస్తకంలా అగుపిస్తుంది
ఐదంకెల జీతంతోనే అనుబంధాలను వెల కడితే
జీవితం గుడ్డి గుర్రాల పరుగు పందెంలా తోస్తుంది
ఖరీదైన సామాన్లతో ఆప్యాయతలను లెక్కకడితే
బతుకంతా బూజు పట్టిన భవనంలా గోచరిస్తుంది
లక్షల జీతాల కోసం అయినవాళ్లను వదిలి వెళితే
ఎండమావుల వెంటపడే ఎడారి ఒంటెల మారతాము
ఆకాశహర్మ్యాల్లో ఒంటరిగా గడపాలి అనుకుంటే
సమాధుల్లోని శవాలను కాసే కాటి కాపరిలా మిగులుతాం
ప్రతి క్షణం రూపాయి నాణాలతో కాలాన్ని కొలిస్తే
కన్నీళ్లు కార్చటానికి కూడా సమయం లేక
కసాయి వాళ్లుగా మిగులుతాం

అనుక్షణం నోట్ల కట్టల మధ్య సహజీవనం చేస్తే
నెత్తుటి మాంసాలు గడ్డకట్టిన శిలలా మారుతాం
అనుబంధాలు అన్నిటికీ అక్షర రూపం ఇస్తూ పోతే
జీవన పదబంధంలో ఖాళీలంటూ మిగలవు
ఆప్యాయతలు అన్నిటినీ అందంగా పేర్చుకుంటూ పోతే
బతుకు వైకుంఠపాళీలో అన్నీ నిచ్చెనలే ఎదురవుతా యి
అంతరాల వెతుకులాట మాని అందరితో కలిసి బతికితే
ఆనందాన్ని పంచే అనుభూతులను గుండెల్లో దాచుకుంటే
జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ పోతే
రేపు అన్నదాని కోసం ఆలోచనే రాని ప్రతి రోజూ ఉగాదే!