విషాదాలూ, వివాదాలూ

తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సుహృద్భావంతో వ్యవహరిస్తాయని అందరూ ఆశించారు. అలా జరగాలని కోరుకున్నారు కూడా. అయితే విద్యా సంస్థల ప్రవేశాలతో మొదలు పెట్టి విద్యుత్‌ రంగం వరకూ ప్రతిదీ పెను వివాదమవుతున్నది. నిజంగా ఇది దురదృష్టకర పరిస్థితి. ఇందుకు కారకులెవరని తలలు పగలగొట్టుకోవడం కంటే కలసి కూచుని సమస్యలు పరిష్కరించుకోవడం మేలైన మార్గం. ఏకైక మార్గం కూడా. నూతన రాష్ట్రాలు గనక సమస్యలు ఇక ముందు కూడా రావడం సహజంగా జరుగుతుంది. వాటిని చట్టబద్దంగా వాస్తవిక దృష్టితో పరిష్కరించుకోవాలే గాని రాజకీయ వివాదాలుగా   మార్చుకోవడం ఉభయులకూ నష్టం. కేంద్రం కూడా ఇందుకు సహకరించవలసి వుంటుంది. పైగా  ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి సమధిక సహాయం సహకారం అందించడం కూడా పరిస్థితి మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. ఇక్కడ వివాదాలు చినికి చినికి గాలివానలవుతుంటే కేంద్రం ఇతర వ్యవస్థలు తమ వంతు పాత్ర తప్పక నిర్వహించాలి ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాను విశాఖపట్టణాన్ని ఇతర జిల్లాలను అతలాకుతలం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భారీ  ప్రాణనష్టం తప్పినప్పటికీ   ఇళ్లు పొలాలు సంస్థలూ  భారీగానే నష్టపోయాయి. రెక్కల కష్టం మీద రోజువారి శ్రమ మీద ఆధారపడిన వారి జీవితాలు కుప్పకూలాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత సహాయం అందినా జరగాల్సింది చాలా వుంది. చాలాకాలం పడుతుంది కూడా. విభజన తర్వాత ఇంకా పాలన పూర్తిగా కుదురుకోకముందే ఇంతటి విపత్తు రావడం నిజంగా విచారకరం. తుపాను దెబ్బ నుంచి కోలుకోవడానికి వేయి చేతుల సహాయపడటం ప్రతివారి బాధ్యత. ఇప్పటికే ఆ విధమైన స్పందన కనిపించడం అభినందనీయమైనా అలసత్వానికి అవకాశం లేకుండా కృషి జరగాలి. ఇదే సమయంలో  వర్షాభావం వల్ల కరెంటు కొరత వల్ల  ఏర్పడిన వ్యవసాయ సంక్షోభం  తెలంగాణలోనూ రైతాంగ ఆత్మహత్యలు విషాదకరంగా సాగుతున్నాయి. వీటిని నివారించేందుకు కూడా తక్షణ చర్యలు తీసుకోవలసి వుంటుంది.పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ప్రకటించి ఆహ్వానించడం ఎంత ముఖ్యమో అన్నం పెట్టే రైతన్నల వెతలు తీర్చి బతుకు నివ్వాల్సిన బాధ్యత అంతకన్నా ముఖ్యమని ప్రతిచోటా ప్రభుత్వాలు గుర్తించవలసి వుంటుంది.