కవిత్వమై కురిసిన ''హృదయరశ్మి''

  కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
  9948774243

    ప్రజాస్వామిక విలువలు చైతన్యించే రీతిలో పెట్టుబడిదారీ వ్యవస్థ నికృష్టచేష్టలను దుయ్యబడుతు కవిత్వమై సాగిపోతున్న కవి డా|| ఎన్‌.గోపి. జీవితం + కవిత్వం తన వ్యక్తిత్వంగా వెలుగుదారుల్లో పయనిస్తున్న కవీయన. సమాజాన్ని, నిజజీవితాన్ని 'లోచూపు'తో పరిశీలిస్తూ 'హృదయరశ్మి' అనే కవితా సంపుటిలో కవితారశ్మిని అక్షరాల్లో అభివ్యక్తీకరించిన అగ్రగామి కవి యన్‌.గోపి.
కవి హృదయం కదిలితే వినిపించే శబ్దం కవిత్వం. హృదయ నిశ్శబ్దాన్ని శబ్దింపజేస్తూ సమాజాన్ని మేల్కొలిపేందుకు తపిస్తూ ఆలోచనలను అక్షరాలు చేస్తుంటాడు కవి. ఒక దృశ్యాన్ని సాధారణ పాఠకునికందని ప్రత్యేక దృక్కోణంలో దృశ్యమానం చేయగల శక్తి ఒక్క కవికి మాత్రమే వుంటుంది. కవి శక్తినిబట్టి అభివ్యక్తి భావనలు వెలువడుతుంటాయి. కవి భాషలో భావాల్ని కక్కుతున్నాడా? భావాల్ని భాషలో పొదుగుతున్నాడా? అని ఆలోచిస్తే నిజమైన కవి భావాలకు తగిన, పొందికగల భాషను పొదుపుకుంటుండాడు. అట్లా ప్రజాస్వామిక విలువలు చైతన్యించే రీతిలో పెట్టుబడిదారీ వ్యవస్థ నికృష్టచేష్టలను దుయ్యబడుతు కవిత్వమై సాగిపోతున్న కవి డా|| ఎన్‌.గోపి. జీవితం + కవిత్వం తన వ్యక్తిత్వంగా వెలుగుదారుల్లో పయనిస్తున్న కవీయన. సమాజాన్ని, నిజజీవితాన్ని 'లోచూపు'తో పరిశీలిస్తూ 'హృదయరశ్మి' అనే కవితా సంపుటిలో కవితారశ్మిని అక్షరాల్లో అభివ్యక్తీకరించిన అగ్రగామి కవి యన్‌.గోపి.
''హృదయ రశ్మి'' కవితా సంపుటిలో 78 కవితలున్నాయి. ఇందులో 24 కవితలు కవిత్వమంటే ఏమిటో ఎట్లా వుండాలో నిర్వచనాపూర్వకంగా చెప్పబడ్డాయి. కవిత్వాన్ని గూర్చిన కలవరింత పలవరింత వో తపస్సు ఇందులో కనిపిస్తుంటూంది. ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలనుండి కవిత్వం రాస్తూ 17 కవితా సంపుటాలను వెలువరించిన ఈ కవి కవితా దృష్టి 2013లో ఎలా వుందో ఈ కవితాసంపుటి 'హృదయరశ్మి' పట్టిస్తుంది. కవిగా ఎంతో ఎత్తుకు ఎదిగి అగ్రగామికవిగా కవితా శిఖరాగ్రాన నిలబడ్డ ఈ కవి వ్యక్తీకరించే తాజాభావాలేమిటో కవిత్వం యెడల కవి దృష్టి ఏమిటో ''హృదయరశ్మి''లో కవిత్వాన్ని గూర్చి చెప్పిన కవితలను మాత్రమే విశ్లేషించడమే ఈ నా వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం.
ద్రవించడం, చలించడం, ప్రవహించడం ఎరిగిన కవి ఎన్‌.గోపి. సహజత్వంగా, తాత్వికంగా సరళమైన పదలాలిత్యం తో కవిత్వాన్ని స్పర్శించిన తీరు, అర్థసాఫల్యతతో అక్షరాలు కవితా వాక్యాలై పఠితను ఒడిసిపట్టుకునే వైనం ఎంత వరకు కనిపిస్తుందో పరిశీలిద్దాం.  
కవిత్వం సహజసిద్ధంగా, ఏ అలజడి లేకుండా, పువ్వు పూసినంత హాయిగా, మట్టిలో విత్తనం చిట్లినంత నిశ్శబ్దంగా, వెలువడాలి అంటారు. చీమలదండులా జ్ఞాపకాలు పాకి రావాలంటారు. ఆకు రాలిపడ్డట్టు వ్యక్తమవ్వాలి కవిత్వం అంటూ ''చీకటి మూలాల్లో/ వెన్నెల సోకుతున్నప్పుడే/ లోకం కవిత్వంగా మారుతుంది/ గత్యంతరం  లేకనే మాటలు/ నిజానికి/ నిశ్శబ్దమే అసలైన కవిత్వం'' అనగలిగిన అభివ్యక్తి గోపీది.
''ఎడతెగని దుఃఖంలో/ మెల్లగా తెరుచుకునే/ ఓ ఆవరణ'' లోకి అడుగిడిన కవి అప్పుడే ''అరణ్యంలో ఓ ఎండుపుల్ల విరిగినట్టు ఏదో స్ఫురణలోకి వెళ్లిపోతాడు. చివరకు కవిభావన ''కవిత్వం/ దేనికీ నిర్థారూకాదు/ అదో నిరంతర స్వప్నంగా'' ప్రకటిస్తాడు. కవి తన చిన్నప్పుడు చద్దిమూట విప్పినప్పుడు అన్నంతో కలిపిన చింత తొక్కు వాసన మరచిపోని జ్ఞాపకమే తన కవిత్వానికి మాతృకగా భావిస్తాడు కవి. అట్టడుగు వర్గాల జీవితాన్ని ఆవిష్కరించగలుగుతున్నాడంటే ఈ కవి తన మూలాలను తాను మరచిపోలేదు గనుకనే!'' పువ్వు పూసినట్లు కవిత్వం పూస్తుంది. కాకపోతే అది సామాజిక రుగ్మతలను మోస్తుంది'' అంటారు.
''వర్షం నదిని ప్రేమించినట్లు/ నేను కవిత్వం కోసం/ తాపత్రయ పడతాను''..../ నాతో పాటు కవిత్వం తప్ప మరెవ్వరూ లేరు.../సాయంత్రం రాలినచోట కొత్త ఆకులు/ ఒక్కోక్క వాక్యమే హృదయరశ్మిలో తడిసి/ ఉదయిస్తున్నాయి'' అంటారు. చినుకు చినుకు కలసి వంకై వాగై నదిని చేరి సాగరాన్ని కౌగిలించుకొన్నట్లు ప్రతి భావన అక్షరమై హృదయ రశ్మిలో వెలుగులు విరజిమ్ముతాయి. అంతరంగంలో తడవని, నానని భావాలు కవిత్వంగా ప్రకాశింపలేవనేది కవి భావన.
కాగితం మీద వో పిడికెడు అక్షరాలు చల్లితే వాక్యాలు అవుతాయి. అది కవిత్వం కావాలంటే దాన్లో పరిమళభరితమైన ఊపిరి ఉండాలి. కనులనుండి దూకే కన్నీటి ప్రవాహం గుండె కనుమల్లోంచి ప్రవహించాలి. ఉద్వేగఝరై గుండె కొండల్ని చుట్టాలి, కదిలించాలి అప్పుడే అది పద్యమవుతూంది.
గోడల నీడల్లో మన నీడలు కలసిపోయి తప్పిపోయి నప్పుడు, కాలప్రవాహం పైన ఒక భ్రమగా మిగిలి పోతున్నప్పుడు, ఎవడి నీడను వాడు గుర్తుపట్టే వెతుకులాటలో విజయం సాధించినప్పుడే కదా పరిణితి చెంది వాక్యం పద్యమయ్యేది. అందుకే పద్యం చెప్పాలంటే ''పరిణితి'' అవసరమంటాడు కవి. పరిణితి చెందే దాక పఠనం అవసరమన్న గోపీ వాక్యాలు నవకవులు యువ కవులు ఆమోదిస్తారనేది వాస్తవం. ''అనగనగా ఒక అగ్గిపుల్ల/ దాని పేరు కవిత్వం/'' అంటాడు గోపి. ఈ మాటలు వింటూంటే శ్రీశ్రీ కవితా వాక్యాలు గుర్తుకొస్తాయి. ''అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కావేవీ కవితకనర్హమన్న వాక్యాలు. ''దిగైడ్‌'' కవితలో గోపిగారు గుర్తుకు తెస్తారు. మండే అగ్గిపుల్లలో కనిపించే వేడి, వెలుతురు, ప్రసరించే శక్తి, వో మార్గదర్శకత్వంగా దర్శిస్తాడు కవి.
ఎంతకాలం నుంచి కవిత్వం రాస్తున్నా కవి ముఖ్యంగా తెల్సుకోవలసింది శబ్దాన్ని ఎక్కడినుంచి తీసుకోవాలో, ఎక్కడ నిక్షిప్తం చెయ్యాలో, సరికొత్తతనంగా భావవ్యక్తీకరణ అలవరుచుకోవాలో అనేదే ముఖ్యం. ''పసివాడి ఆకలి అమ్మకు అర్థమైనట్లు'' కవి అమ్మగా మారాలి అంటారు. కనిపించే దృశ్యాల వెనుక కనిపించని చరిత్రను చెప్పి స్ఫూర్తిని కలిగించే 'గైడ్‌' లాంటి వాడు కవి అంటారు. అందరూ లోకంలో నిద్రపోతున్నా కవి ఒక్కడే మేల్కొని వుండి లోకంపైన ఒక ప్రేమాంచల విరాట్‌ వస్త్రాన్ని కప్పే తండ్రి లాంటి వానిగా కవిని అభివర్ణిస్తాడు గోపి. కవిత రాస్తున్నప్పుడల్లా ''కలంలో సిరామట్టం తగ్గుతూ సముద్ర మట్టం పెరుగుతుంది'' అనగలిగిన కవి గోపి.
ఒక అక్షరాన్ని మీటి భావసైన్యానికి నాయకత్వం వహించేట్లు, హృదయ భారాన్ని మోసేట్లు బతుకంతా అది వ్రేలు పట్టుకొని నడిపించేట్లు చేయడంలోనే కవి ప్రతిభ దాగుంటుంది. అటువంటి ప్రతిభావంతమైన కవిత్వ ధార  గల కవి గోపి అనడంలో ఎట్టి సందేహమూ లేదు. అందుకే ''ఇవాళ/ నడిస్తే అక్షరం/ పిలిస్తే అక్షరం/ అదిలిస్తే అక్షరం/ కదిలిస్తే అక్షరం/ ఆవలిస్తే అక్షరం/ అలిసిన కళ్లకు/ ఆకాశంలోని చుక్కలన్నీ అక్షరాలే'' అంటూ వో గొప్ప తాత్వికతను చెప్తాడు కవి.
తన అస్తిత్వ బోధనకు, సాధనకు, అక్షరమే చివరకు ఆయుధమయ్యింది అంటారు. నరాల తీగల మీద సాగే స్నేహ సంగీతాన్ని' అక్షరాలు అంటారు. సూర్యుడు తన కలంలోకి దూరి కవిత్వానికి కావల్సిన వేడి, వాడి వెలుతురు సమకూరుస్తున్నాడంటారు. హృదయాంతరంగాన్నుండి కవిత ఆవిష్కారమయ్యేటప్పుడు పుట్టే 'రొద' ఎలా వుంటుందో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు కవి. ''ఏదీ పైకి తెలియని జ్వరంలా లోలోపల వినిపించే స్వరంలో మార్పుల్లోంచి రాలే వెలుగునీడల్లా  కనిపిస్తూ ఒక అపూర్వశక్తిగా కవిత్వం అభివ్యక్తమవుతుంటూంది అంటారు. ''హాయిగా ఉండనివ్వదు/ కంటినిండా పండనివ్వదు'' అది వో ఎడతెగని ఆలాపన చాపకిందనీరులాగ దొంగలాగ వచ్చి ఆవేశంతో వ్యాకరణాన్ని రాల్చుతూ, విశ్లేషణ వీగిపోయ్యేట్టు చేస్తుంది అంటారు. ఆవేశం అమ్ముగా పెన్నులోంచి తీగలుగా రాలుతూ ఎన్నెన్నో ఆకృతులుగా అల్లుకోవడాన్నే కవిత్వంగా భావిస్తాడు గోపి.
''మానవీయత మీద కప్పిన పొరలను ఊదే విధంగా ఊదుకోవడమే కవిత్వం'' అంటారు. కిరణాలు పట్టుకొని ఎగబ్రాకుతూ గాలిలోకి ఎగరడము, అనుభవాలను అక్షరాలుగా పదునెక్కించడము, కవిత్వం అంటారు. సహజసుందర కవితాధారకు మూలం అన్వేషిస్తాడు అనంత తత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు ఇందులో కవి.
గోపి తన ''హృదయరశ్మి''లో కవిత్వాన్ని మోస్తున్న కవితల్ని  ఎన్నో రాశాడు. తన చేతిలో పెన్ను తనదికాదనే, అది కోట్లాది  నిరుపేదల పనిముట్లకు రూపాంతరమనే మహోన్నతమైన విశాలభావంతో సాగిపోతున్న కవిత్వం ''హృదయరశ్మి''లో కనిపిస్తుంది. కవిత్వ మూలాలను పట్టుకొని అనుభవాలతో కవితారీతుల్ని ''ప్రేం'' కట్టి లోపల రోదపెట్టే పద్యాన్ని లోకంలోకి వదిలేస్తాడు కవి. అది వో పక్షిలా ఎగిరిపోతూంది. అక్షరాల్లో తడిసి ముద్దవడం, పిడికెడు గుండెలో దాగున్న సముద్రమంత కవిత్వాన్ని మధించి కవితాసారాన్ని ''హృదయరశ్మి''లో నింపడం ఎరిగిన కవిగా గోపిని అభివర్ణించవచ్చు. ''హృదయరశ్మి''లో దాగున్న కవిత్వపు తీరు ఎరగాలంటే వోసారి హృదయరశ్మిని పాఠకలోకం స్పర్శించక తప్పదు.