అక్కడ..
ఆ ఆవరణలో వున్న తోట
ఎప్పుడూ నవ్వుతూ వుండేది
అతడి కళ్లలో ఆనందమై
కదులుతూ వుండేది
అద్భుతంగా అక్కడి పువ్వులు
విచ్చుకున్న పూట..
వెన్నెల కుప్పలు రాసిపోసినట్లుండేది
కొమ్మలకు కట్టిన రెమ్మల ఊయలలు..
ఆకుపచ్చని అలల్లా ఎగసిపడేవి
ఆ తోట మధ్యలో అతడు
ఒంటరిగా కూర్చొనేవాడు
మరపురాని తన వికత గతాన్ని
అంతర్లీనంగా ప్రవహించే
నైరాశ్యపు చీకటిని
కాసేపు అలా..
కాలానికి వదిలేసి
అతడా పూల పరిమళాలతో
సహవాసం చేసేవాడు
గాలి వేసే వీలలను
కొత్త ఉత్సుకతతో ఆలకించేవాడు
పగిలిన మబ్బుల్లోంచి వడుస్తున్న వాన చినుకులను
దోసిళ్లుపట్టి స్వాగతించేవాడు
ఎక్కడో పోగొట్టుకున్న
వెలుగు ముక్కలను
అతడా మొక్కల పాదుల్లో వెతుకుతుండేవాడు
ఏమయిందో..కానీ..
ఇప్పుడా తోట పూయడం లేదు
ఏ కొమ్మా పలకడంలేదు
నిన్నటి దాకా అలరారిన చివురు గుబురులన్నీ
నేడు నిశ్శబ్దమై..నిశ్చేతనమై
తలలు వాల్చాయి
అయినా.. అతడు మాత్రం
అక్కడే వున్నాడు
చెంపకు చేయి ఆన్చి
దిక్కుతోచక..దిగులు దక్కులతో
రేపటి వసంతానికై కలలు కంటూ
మసకవేకువ రాసిన మంచు గేయమై..
ఎర్రని గాయమై
అతడు ఆ పరిసరాల్లో నే
పరిభ్రమిస్తున్నాడు
చివరి వసంతం
కవి:
- సునీత గంగవరపు