తోకల రాజేశం,
9676761415
ఎంత పని చేశావు రహదారీ !
నువ్వు నా పల్లె గుండెల మీదికి నడిచొస్తుంటే
అమ్మమ్మ మా యింటికి వస్తున్నంతగా సంతోషపడ్డాను
నల్లని తాచుపామువని ఊహించనేలేదు
నువ్వు పట్నం నుంచి బయలు దేరితే
నీ వీపు మీద అభివృద్ధి వృక్షాలు మొలుస్తాయనుకున్న
ఆ అభివృద్ధి ఉరితాళ్లు విసురుతుందనుకోలేదు
నువ్వు నా యింటి ముందు నుంచి పరుగెత్తుతుంటే
మా యింటి పక్కనే నిల్చున్న నీడల చెట్టులా భావించేవాణ్ణి
కాళ్ల కింది పరికి కంపవైతావనుకోలేదు
నీ నల్లని దేహం మీద పాదం మోపితే
పొలం గట్ల మీద నడుస్తున్న పచ్చని అనుభూతి పొందే వాణ్ణి
పల్లె సౌందర్యాన్ని స్మశానీకరిస్తావనుకోలేదు
నువ్వెంత మోసం చేశావు తారు రోడ్డా !
నువ్వు ఆధునికతను దిగుమతి చేస్తున్నావనుకున్నా
మడుగులోని చేపపిల్లలను కొంగలు కరుచుకుపోయినట్లు
మా సంస్కృతిని మానుంచి ఎత్తుకుపోతావనుకోలేదు
నువ్వు సకల సౌకర్యాలను నా వాకిట్లో దించుతున్నావనుకున్నా
గొర్రెపిల్లను తోడేలెత్తుకపోయినట్లు
నాపల్లె శరీరాన్నే ప్రపంచ మార్కెట్లో తాకట్టుపెడతావనుకోలేదు
నువ్వు వచ్చి మా గడప గడపకూ
నవ్వుల పూల తోరణాలు కడుతావనుకున్నాను
గడపనే రెండు ముక్కలు చేస్తావని ఊహించనే లేదు.