న్యూఢిల్లీ 5వ ఆర్ట్‌ఫెయిర్
గుడిపూడి విజయరావు
చిత్రకళకు ఎంత వేగంగా ఆదరణ పెరుగుతున్నదని అనుకున్నా హైదరాబాదు లాంటి నగరాలలో అనేక గ్యాలరీలు ఎన్నెన్నో షోలు నిర్వహిస్తున్నా ఒక్క ఎంఎఫ్ హుస్సేన్ ఒరిజినల్
చూడటం, లేదా ఒక్క జామిని రాయ్ పెయింటింగ్ చూడటం ఎంతో గొప్పగా ఉంటుంది. కాని ఒకే చోట ఎంఎఫ్ హుస్సేన్, ఎస్‌హెచ్ రజా, ఎఫ్ ఎన్ డి సౌజా, అక్బర్‌పదమ్‌సీ, సోమనాథ్ హోరే లాంటి ఆర్టిస్టుల ఒరిజినల్ వర్క్స్ చూడటం ఎంత ఆశ్చర్యం ఆనందం కల్గిస్తుందో తేలిగ్గానే వూహించుకోవచ్చు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని న్యూఢిల్లీలో 2013 ఫిబ్రవరి 1-3 తేదీల్లో జరిగిన ఇండియా ఆర్ట్‌ఫెయిర్ కల్గించింది. కేవలం పైన పేర్కొన్న లాంటి లబ్దప్రతిష్టులైన వారి చిత్రాలే కాదు, తమదైన ముద్రవేసుకోగలిగిన యువ, మధ్యవయస్కులైన ఆర్టిస్టుల చిత్రాలను, సంపూర్ణమైన నవ్యతను, తాజాదనాన్ని వెదజల్లే యువ చిత్రకారుల కళాసృష్టిని పుష్కలంగా ప్రదర్శించింది ఈ ఫెయిర్.
అంతేకాదు, ఈ ఫెయిర్‌లో పికాసో, సాల్వెడార్ డాలి, చాగల్, వారోల్, డామియన్ హిర్స్ట్ లాంటి ప్రఖ్యాత విదేశీ ఆర్టిస్టుల వర్క్స్‌నూ చూసే అవకాశం లభించింది. పైగా అధిక సంఖ్యలో విదేశీ గ్యాలరీలు ఈ ఉత్సవంలో పాల్గొన్నాయి. అయితే, ఈ విదేశీ గ్యాలరీలు సైతం భారతీయ చిత్రకారుల చిత్రాలను ఎక్కువగా అమ్మకాలకు ఉంచడం విశేషం. ఈ బృహత్తర కార్యక్రమం అంతటికీ సూత్రధారి 32 ఏళ్ల నేహా కిర్‌పాల్ అంటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఈ కార్యక్రమాన్ని ఆమె ఐదేళ్ల క్రితమే అంటే కేవలం 28 ఏళ్ల వయస్సులోనే ఆరంభించారు. ఇండియా ఆర్ట్‌సమ్మిట్ పేరుతో మొదలై అంతకంతకూ కొత్తపుంతలు తొక్కుతూ ప్రతి ఏటా అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఐదేళ్ల క్రితం 34 గ్యాలరీలు పాల్గొంటే ఇప్పుడు 104 గ్యాలరీలు పాల్గొనడం వాటిలో 45 విదేశీ గ్యాలరీలు కావడమే దీనికి నిదర్శనం.
ఎన్‌ఎస్‌ఐసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఫెయిర్ ప్రాంగణంలోకి అడుగుపెట్టడంతోనే వాతావరణం మారిపోతుంది. ఆ ప్రాంతమంతా కళాత్మకత ఉట్టిపడుతుంది. ఆరుబయట ఏర్పాటు చేసిన శిల్పాలు, ఇన్‌స్టాలేషన్లు స్వాగతం పలుకుతాయి. ఓ వైపున ఆర్ట్ బుక్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆర్ట్‌గ్రంథాలు ప్రచురించే మార్గ్, ఢిల్లీఆర్ట్‌గ్యాలరీలాంటి సంస్థలు స్టాళ్లు ఏర్పాటుచేశాయి. ఆర్ట్ ఇండియా మేగజైన్, ఆర్ట్ డీల్, టేక్ ఆన్ ఆర్ట్ తదితర మేగజైన్లు ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. బ్రష్షులు, కలర్లు, పేపర్లు, కేన్వాసులు తదితర ఆర్ట్‌సరంజామా విక్రయించే స్టాలు యువ కళాకారులతో కిక్కిరిసి పోయింది. ఈ వైపునే ఒక హాల్లో ఉపన్యాసాలు, సెమినార్లు నిరంతరం కొనసాగాయి. అనేక మంది దేశ విదేశీ ఆర్టిస్టులు, ఆర్ట్ క్రిటిక్స్, కలెక్టర్లు ఉపన్యాసాలు ఇచ్చారు, చర్చల్లో పాల్గొన్నారు.
అసలు ప్రదర్శన అంతా తాత్కాలికంగా నిర్మించిన ఓ పెద్ద హాలులో ఉంది. అనేక విభాగాలుగా విభజించబడిన ఈ హాల్లో ఆయా గ్యాలరీలు గ్రూపు షోలను, సోలో షోలను ఏర్పాటు చేశాయి. ఈ హాల్లోకి ప్రవేశించి కొన్ని అడుగులు వేయడంతోనే విపరీతంగా ఆకట్టుకునేది ఢిల్లీ ఆర్ట్‌గ్యాలరీ ప్రదర్శన. ఎంఎఫ్ హుసేన్ నుండి మొదలు పెట్టి దేశంలోని వివిధ ప్రాంతాల ఉద్దండ కళాకారుల చిత్రాలను, శిల్పాలను ఈ గ్యాలరీ ప్రదర్శించింది. ఒక్కో ఐటం వద్ద దాన్ని రూపొందించిన కళాకారుని గురించి, ఆ కళాకృతి గురించి వివరించే అందమైన బ్రోచర్లను ఉంచడంతో ప్రత్యేకంగా వాటిని వివరించాల్సిన అవసరం లేకుండా సరిపోయింది. కాని ఇలాంటి ఏర్పాటుకాని, లేదంటే వివరించే నైపుణ్యం కలిగిన వ్యక్తులు కాని దాదాపు ఏ గ్యాలరీలోను కనిపించక పోవడం లోపమే. ఆయా గ్యాలరీల వద్ద కేవలం కేర్‌టేకర్లు మాత్రమే ఉన్నారు. కళ గురించి, చిత్రాల గురించి ఎంతో కొంత తెలిసిన వారికి అది అంతగా ఇబ్బంది కల్గించకపోయినప్పటికీ ఆసక్తిగా కళ గురించి తెలుసుకుని ఆస్వాదిద్దామని అసంఖ్యాకంగా వచ్చిన యువతీయువకులకు ఇది తీవ్ర నిరాశను కలుగ చేసింది.
ఫెయిర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి అనేకం ఉన్నాయి. ఉదాహరణకు బెంగాల్ చిత్రకారుడు, శిల్పి సోమనాధ్ హోరే ప్రదర్శన గురించి. కోల్‌కటాకు చెందిన ఆకార్‌ప్రకార్ గ్యాలరీ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన హోరే కళాసృష్టిలోని అన్ని పార్శ్వాలను ఆవిష్కరించింది. బెంగాల్ కరువు గురించి చిత్తప్రసాద్ చిత్రాలను మాత్రమే గీస్తే, చిత్రాన్ని చూసే ప్రేక్షకునిపై ఆ బీభత్సాన్ని మరింత బలంగా ముద్రవేసేలా చిత్రాలు, ప్రింటు,్ల శిల్పాలు ఆయన తయారు చేశారు. ఈ ఆర్ట్ ఫెయిర్‌లో చూసిన ఒరిజినల్ చిత్రాల ఫోటోలను అనేకం మనం ఇంతకు ముందే చూసి ఉంటాము. కాని వాటిలోని గొప్పదనం ప్రత్యక్షంగా చూస్తే తప్ప అర్ధం కాదు. ప్రత్యేకించి కలర్ కాని, ఆ కలర్ తీవ్రత కాని, టెక్స్‌చర్ కాని నేరుగా చూస్తే తప్ప తెలియదు. ఈ ఫెయిర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో ప్రదర్శన ఇండియన్ మాస్టర్స్ లైన్స్. ఎంఎఫ్ హుసేన్, ఎస్‌హెచ్ రజా, అక్బర్‌పదమ్‌సీ తదితర మాస్టర్స్ లైన్ డ్రాయింగులను ఈ ప్రదర్శనలో ఉంచారు. వాటిలో అనేకం ప్రసిద్ధమైన పెయింటింగ్సుకు ఆధారాలు.
కేవలం చిత్రాలే కాకుండా, అనేక ఇన్‌స్టాలేషన్లు విశేషంగా ఆట్టుకున్నాయి. వీటిలో అనేకం పర్యావరణ, సామాజిక, రాజకీయ అభిప్రాయాలను బలంగా వెల్లడించేవిగా ఉండటం విశేషం. ఉదాహరణకు, ఓ వాల్‌పై నేలను దున్ని విత్తడానికి సిద్ధంగా ఉన్న చిత్రం ఉంటుంది. దాని క్రిందనే రెండు మూడు బస్తాలలో పెద్ద సైజులో మట్టి గోళీలు ఉంటాయి. అయితే ఒక్కోదానిలోపల ఒక్కో రకం విత్తనం ఉంటుంది. ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఒక్కో గోలీని తీసుకెళ్లి మొలకెత్తడానికి అనువుగా ఉన్న నేలలో వేయాలన్న విజ్ఞప్తి కూడ అక్కడ దర్శనమిస్తుంది. పచ్చదనాన్నిపెంచాల్సిన ఆవశ్యకతను ఈ విధంగా వ్యక్తం చేస్తాడు ఆ కళాకారుడు. మరో ఇన్‌స్టాలేషన్‌లో మహాత్మాగాంధీ ప్రతిమ పూర్తిగా ముసుగు వేయబడి ఉంటుంది. అదో ఉప్పు గుట్టపై ఉంటుంది. సమాజంలో పెచ్చరిల్లిన అవినీతి, అనైతికతలపై ఉప్పుసత్యాగ్రహం మాదిరి మరోసారి పోరాటం చేయాలన్నది ఆ కళాకారుని ఉద్దేశం. ఆ ఇన్‌స్టాలేషన్ సందర్శించిన ప్రతి ఒక్కరికి ఆ సందేశం గుర్తుండేలా చిన్న సీసాలో ఉప్పును ఇచ్చారు. అప్పారావు గ్యాలరీ ప్రదర్శించిన ఓ శిల్పం బలమైన రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. రెండు కమ్మోడ్‌లలో ఒక దానిలో ముగ్గురు రాజకీయనేతలను, మరో దానిలో ఇద్దరు రాజకీయనేతలను ఉంచి, ఒక దానికి లోక్‌సభ అని మరో దానికి రాజ్యసభ అని పేరుపెట్టారు.
పట్టణాలకు వలస గురించి చెప్పే ఓ బృహత్తర శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముంబాయి నగరంలో ఆశాశహర్మ్యాలు, వాటి మధ్యనే అతి పెద్ద మురికివాడలు, ఇరుకు రహదారులు- వీటన్నింటిని రేకులు, ప్లాస్టిక్ ముక్కలు మొదలైన వాటితో వాస్తవాన్ని ఎంతో బలంగా వ్యక్తీకరించే రీతిలో రూపొందించారు. మరో ఇన్‌స్టాలేషన్ ఓ పెద్ద సాలెగూడు. ఈ సాలెగూడును దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే తప్ప దేనితో తయారు చేశారో తెలియదు. అదంతా ప్లాస్టిక్ ప్రైస్‌టాగ్స్‌తో తయారు చేశారు. దాన్ని చేయడానికి ఆరు మాసాలు పట్టిందట. ఆ పక్కనే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వివిధ భంగిమల్లో జీవం ఉట్టిపడే చిన్నారుల శిల్పాలు. వాటిని తయారు చేసింది గుండుసూదులతో, ఇనుపతీగల బ్రష్‌లతో అని తెలుసుకున్న ప్రతి ఒక్కరు విపరీతంగా ఆశ్చర్యపోయారు.
చివరిగానే తప్పనిసరిగా చెప్పుకోవలసింది, ఈ ఫెయిర్‌లో తెలుగువారి గురించి. హైదరాబాదుకు చెందిన సృష్టి ఆర్ట్‌గ్యాలరీ రెండేళ్లుగా పాల్గొంటున్నది. అంతా తెలుగు చిత్రకారుల వర్క్స్‌నే ప్రదర్శించింది. అంతేకాకుండా పలు దేశ విదేశీ గ్యాలరీలు లక్ష్మాగౌడ్, వైకుంఠం, రమేష్ గోర్జాలా తదితర ఆర్టిస్టుల చిత్రాలను ప్రదర్శించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది. తెలుగు చిత్రకారులూ మొత్తం ప్రదర్శనలో గణనీయంగా కనిపించడం సంతృప్తిని కలిగించే అంశం.
ఈ సారి ఫెయిర్‌లో అమ్మకాలూ బాగానే ఉన్నాయని అన్నారు. ఫెయిర్ నిర్వాహకులు స్టాళ్లకు అద్దెమాత్రమే తీసుకుంటారు. అమ్మకాలపై ఎలాంటి కమిషన్ తీసుకోరు. అందుచేత అమ్మకాలు గ్యాలరీలకు ఆకర్షణీయంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఏదో ఒకటి రెండు చిత్రాలు అతి పెద్ద మొత్తాలకు అమ్ముడు పోయే పరిస్థితి కాకుండా, పెద్ద సంఖ్యలో మధ్యశ్రేణి, సాధారణ స్థాయి ధరలు కలిగిన చిత్రాలు బాగా అమ్ముడయినట్లు చెప్పారు. సందర్శకుల్లో కూడ చిత్రాలను సొంతం చేసుకోవాలని వచ్చినవారు ఎక్కువగానే ఉన్నారు. మొత్తంగా ఆర్ట్ మార్కెట్ స్తబ్దతలో కొనసాగుతున్న సమయంలో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌మాదిరిగా కలెక్ట్ చేసేవారు తక్కువగానే ఉన్నారు. కొనుగోళ్లు ఎక్కువ భాగం వక్తిగతంగా అలంకరణ కోసమే. మొత్తం ప్రపంచ ఆర్ట్‌మార్కెట్ వార్షిక టర్నోవర్ 6,000 కోట్ల డాలర్లు ఉంటే, దానిలో భారత దేశం వాటా ఒక శాతం కన్నా కూడ తక్కువే అంటే ఒకింత అసంతృప్తి కలుగుతుంది. ఏదేమయినప్పటికీ ఈ ఆర్ట్ ఫెయిర్ దేశవ్యాపిత చిత్రాలను, రీతులను అర్ధం చేసుకోవడానికి ఓ చక్కటి అవకాశం అనడంలో సందేహం లేదు.