ఎం. తిమ్మారెడ్డి
రాబోయే ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు 42 శాతం పెరగబోతున్నాయి. ఇది రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం 1998లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్
రంగంలో సంస్కరణలు ప్రారంభించినప్పుడు ప్రపంచబ్యాంకు సూచించిన కరెంటు ఛార్జీల పెంపు 15 శాతం. 2000 మే నెలలో 20 శాతం ఛార్జీలు పెంచారు. 2013-14 సంవత్సరంలో -1,03,535 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు అందించడానికి రూ. 49,189 కోట్లు అవసరమని డిస్కమ్‌ల అంచనా. ప్రస్తుతం అమలులో ఉన్న కరెంటు ఛార్జీల ద్వారా రూ. 30,582 కోట్లు వసూలవుతాయి. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే రూ. 5,882 కోట్లు పోగా మిగిలిన రూ. 12,725 కోట్లను కరెంటు ఛార్జీలను పెంచడం ద్వారా రాబట్టుకోవాలని ప్రతిపాదన.
ప్రధాని మన్మోహన్‌సింగ్ సమయం దొరికిన ప్రతిసారీ మన దేశంలో ఇంధనం ధరలు, వాటితోపాటు కరెంట్ ఛార్జీలను పెంచవలసిన అవసరాన్ని వక్కాణిస్తూనే ఉన్నారు. డిసెంబర్‌లో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలోనూ, జనవరి 7న కొచ్చిన్‌లో పెట్రోలియం రిఫైనరీని ప్రారంభించే సందర్భంలోనూ ప్రధాని ఇదే చెప్పారు. అంతర్జాతీయ ధరలతో పోల్చితే మనదేశంలో బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ధరలు తక్కువగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి ప్రజలలో అవగాహన పెంపొందించి ఇంధనాల ధరలు పెరిగేటట్టు, దానితో పాటు ప్రభుత్వాలపై సబ్సిడీల భారం తగ్గేటట్టు చూడాలన్నారు. మీరు కరెంటు చార్జీలను పెంచండి మిగతా విషయాలు నేను చూసుకుంటానని కరెంటు అధికారులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభయహస్తాన్ని అందించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా!
రాబోయే ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు 42 శాతం పెరగబోతున్నాయి. ఇది రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం 1998లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రారంభించినప్పుడు ప్రపంచబ్యాంకు సూచించిన కరెంటు ఛార్జీల పెంపు 15 శాతం. 2000 మే నెలలో 20 శాతం ఛార్జీలు పెంచారు. 2013-14 సంవత్సరంలో -1,03,535 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు అందించడానికి రూ. 49,189 కోట్లు అవసరమని డిస్కమ్‌ల అంచనా. ప్రస్తుతం అమలులో ఉన్న కరెంటు ఛార్జీల ద్వారా రూ. 30,582 కోట్లు వసూలవుతాయి. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే రూ. 5,882 కోట్లు పోగా మిగిలిన రూ. 12,725 కోట్లను కరెంటు ఛార్జీలను పెంచడం ద్వారా రాబట్టుకోవాలని ప్రతిపాదన. 2012-13 సంవత్సరానికి కరెంటు ఛార్జీలను 15 శాతం పెంచి రూ. 4,420 కోట్లు అదనపు ఆదాయం పొందేందుకు ఎపిఇఆర్‌సి అనుమతినిచ్చింది. దీనితోపాటు మూడు సంవత్సరాల కాలానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎ రూపంలో దాదాపు రూ. 12,000 కోట్లు వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి ఎపిఇఆర్‌సి ఇప్పటికే అనుమతులనిచ్చింది.. రాబోయే సంవత్సరానికి 42 శాతం ఛార్జీల పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడడమే!
ఇంతకూ కరెంటు ఛార్జీలను పెంచవలసిన అవసరముందా? క్షుణ్ణంగా పరిశీలిస్తే లేదనే చెప్పాలి. అది ఎట్లంటే... పెరుగుతున్న ఛార్జీల భారం ముఖ్యంగా పెరుగుతున్న విద్యుత్ కొనుగోలు ఖర్చుల వలన ఉత్పన్నమవుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్‌కు రూ 3.10 కాగా రాబోయే సంవత్సరంలో ఇది రూ. 4.07కు పెరగనున్నది. కెజి బేసిన్‌లో సహజవాయువు ఉత్పత్తి తగ్గి దిగుమతి చేసుకుంటున్న ఎల్‌ఎన్‌జి మీద ఆధారపడడం వలన, దేశంలో తవ్వి తీస్తున్న బొగ్గు ధరలు పెరగడంతోపాటు ఖరీదుతో కూడిన విదేశీ బొగ్గు మీద ఎక్కువగా ఆధారపడడం వలన, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో రెగ్యులేటరీ కమిషన్ ప్రవేటు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుండడం వలన విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగుతాయి. పెరుగుతున్న ఇంధనపుఖర్చుతో కరెంటు ఛార్జీలు పెను భారమవుతున్నాయి. డిస్కమ్‌లకు అవసరమైన రూ. 49,189 కోట్లలో రూ. 42,138 కోట్లు విద్యుత్ కొనుగోలుకే ఖర్చవుతుంది. ఇందులో రూ. 32,076 కోట్లు చర ఖర్చులు అంటే ఇంధన కొనుగోలు ఖర్చులు. ప్రభుత్వ విధానాల వలన ఇంధనం (బొగ్గు, సహజవాయువు) ధరలు పైపైకి పోతున్నాయి. జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రస్తుత సంవత్సరంలో చెల్లిస్తున్న ధరలను రాబోయే సంవత్సరంలో చెల్లించబోయే ధరలను పోల్చితే ఇది తేటతెల్లమవుతుంది.
పైన పేర్కొన్న జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు సింగరేణి, కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఒరిస్సాలోని మహానది బొగ్గు క్షేత్రాల నుంచి సరఫరా అవుతుంది. ఈ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాల వలన కొంత బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. విటిపిఎస్ ఇంధనం ఖర్చులు యూనిట్‌కు 30 శాతం పెరగగా ఆర్‌టిపిపి ఇంధనం ఖర్చులు 70 శాతం పెరగబోతున్నాయి.
దేశంలోని బొగ్గు కంపెనీల ఆర్థిక పరిస్థితి చూస్తే బొగ్గు ధరలను పెంచవలసిన అవసరం కనిపించదు. అయితే బొగ్గు డిమాండ్, లభ్యత మధ్యనున్న వ్యత్యాసాన్ని తగ్గించాలని, దేశంలోని బొగ్గు ధరలు అంతర్జాతీయ ధరలతో సమానంగా ఉంచాలని, బొగ్గు త్రవ్వకంలో కూడా ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించాలని, ప్రస్తుతపు బొగ్గు ధరలు వారికి ఆకర్షణీయంగా లేవు కాబట్టి ఈ ధరలను పెంచక తప్పదని కేంద్ర ప్రభుత్వం ఈ విధాన నిర్ణయానికి వచ్చింది. గత కొద్ది కాలంలో బొగ్గు ధరలను 25 నుంచి 40 శాతం వరకూ పెంచారు. ధరలు పెంచడం వలన కోల్ ఇండియాకు 2011-12లో లాభాలు 64 శాతం పెరిగాయి. ఈ సంస్థ 2012-13 రెండవ త్రైమాసికంలో రూ. 3,078 కోట్ల లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే సమయంలో సంస్థ లాభాలు రూ. 2,593 కోట్లు. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 11 శాతం పెరగగా లాభాలు 19 శాతం పెరిగాయి. ఇదే విధంగా సింగరేణి కంపెనీ కూడా ప్రతి సంవత్సరం వందల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నది. వీటి లాభాలను రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు పెరుగుతున్న కరెంట్ ఛార్జీల రూపంలో భరించవలసివస్తున్నది.
దేశంలో బొగ్గు కొరత ఉందన్న మిషతో కేంద్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు వాడకాన్ని తప్పనిసరి చేసింది. దేశీయ బొగ్గుతో పోల్చితే దిగుమతి చేసుకున్న బొగ్గులో 80 శాతం ఎక్కువ నాణ్యత (మండించే గుణం) ఉంటుందని చెబుతుంటారు. అయితే దీని ధర స్వదేశీ ధర కంటే 300 శాతం అధికంగా ఉంటుంది. స్వదేశీ బొగ్గు ఒక టన్ను రూ. 3,000 కంటే తక్కువగా లభ్యం కాగా విదేశీ బొగ్గు ఒక టన్నుకు రూ. 9,000 వరకూ వెచ్చిస్తున్నారు. విదేశీ బొగ్గు వాడకం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన సూచనలు కూడా లేవు. విదేశీ బొగ్గు దిగుమతి రాజకీయ నాయకుల జేబులు నింపడానికేనంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు నిక్షేపాలున్న దేశాలలో భారత్ ఒకటి. అయినా ఇక్కడ బొగ్గు ఉత్పత్తిని అదేపనిగా తొక్కి పెడుతున్నారు. 1997 నుంచి బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయిస్తున్నారు.కోల్ ఇండియా సంస్థకు 60 బిలియన్ టన్నుల నిక్షేపాలు గల బొగ్గు గనులను కేటాయించగా అది ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ప్రైవేటు కంపెనీలకు 40 బిలియన్ టన్నుల నిక్షేపాలు గల బొగ్గు గనులను కేటాయించగా వాటి ఉత్పత్తి 40 మిలియన్ టన్నులలోనే ఉంది. మన రాష్ట్రంలోని జెన్‌కోకు కేంద్ర బొగ్గు గనుల శాఖ 2005లోనే అనిసెట్టి పల్లి, పెనుకుల చిల్క, పెన్‌గడప, తాడిచెర్ల అనే నాలుగు బొగ్గు క్షేత్రాలను దాని స్వంత ఉపయోగానికై కేటాయించింది. సాధారణంగా 2008లోనే ఇక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావలసి ఉంది. ఏడు సంవత్సరాల తరువాత కూడా ఎటువంటి పురోగతీ లేకపోవడం వలన కేంద్రం మొదటి మూడు క్షేత్రాలకిచ్చిన అనుమతులను రద్దు చేసింది. తాడిచెర్లకు సంబంధించి జెన్‌కోకు షోకాజ్ నోటీసును జారీ చేసింది.
సహజ వాయువుకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. రిలయన్స్ సంస్థ తాను కెజి బేసిన్‌లో ఉత్పత్తి చేస్తున్న సహజవాయువును ఎక్కువ ధర సాధించడానికై ఇక్కడ ఉత్పత్తిని అదే పనిగా తగ్గిస్తూ వస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం 60 ఎంసిఎండి సహజవాయువు ఉత్పత్తి కాగా అది ఇప్పుడు 25 ఎంసిఎండిలకు దిగజారింది. ప్రణాళికలననుసరించి ఈ ఉత్పత్తి యదార్థంగా 80 ఎంసిఎండిలకు చేరవలసి ఉంది. కొద్దికాలం క్రితమే ఈ ధరను ఒక ఎంబిటియుకు 2.5 డాలర్ల నుంచి 4.2 డాలర్లకు పెంచారు. అయినా ఇది రిలయన్స్ సంస్థను సంతృప్తి పరచలేదు. ఈ సంస్థ ఒప్పందం ప్రకారం త్రవ్వవలసిన సహజవాయువు ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఇందులో 1,000 మెగావాట్లు కూడా పనిచేయడం లేదు. దీనివలన ఉత్పన్నమైన కొరతను తీర్చడానికి ఒక్కొక్క యూనిట్ రూ. 10 వరకు వెచ్చించి రూ. 6,008 కోట్ల ఖర్చుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆర్‌ఎల్‌ఎన్‌జితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కెజి బేసిన్‌లో సహజవాయువు ఉత్పత్తి తగ్గడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చూపుతున్న కారణాలు నమ్మదగ్గవి కాదని కేంద్ర ప్రభుత్వ పెట్రోలియమ్ శాఖ, డైరెక్టర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కెజి బేసిన్ క్షేత్రాలను జాతీయం చేయాలని సూచించింది. ఇంత నష్టం వాటిల్లుతున్నా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపడానికే తయారైంది. కానీ రిలయన్స్ నాటకంపై పల్లెత్తుమాట అనడం లేదు.
బొగ్గు, సహజవాయువుల లభ్యత, ధరల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తే ధరలను ఇంకా తగ్గించవచ్చు. ఇంధనపు ఖర్చులతో పాటు మన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) నిర్వాకం వలన స్థిర ఖర్చులు / పెట్టుబడి ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో కుదుర్చుకున్న లోపభూయిష్ట కరెంటు కొనుగోలు ఒప్పందాల (పిపిఎ) వలన ప్రతి సంవత్సరం మూడు నాలుగు వందల కోట్ల రూపాయల అదనపు భారం వినియోగదారుల మీద పడుతున్నది. దీనితోపాటు జెన్‌కోలో కొత్తగా నిర్మించిన యూనిట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలూ ఛార్జీల పెంపునకు కారణమవుతాయి. విటిపిఎస్, ఆర్‌టిపిపి, కాకతీయ కొత్త యూనిట్లకు సంబంధించి కాగ్ జరిపిన పరిశీలనలో రూ 1,213 కోట్లు అదనంగా, అనవసరంగా ఖర్చు పెట్టినట్టు తేలింది. ఈ యూనిట్లకు సంబంధించిన పిపిఎలను మూడు సంవత్సరాల క్రితమే ఎపిఇఆర్‌సి అనుమతుల కొరకు సమర్పించారు. అయితే కమిషన్‌కు వాటివైపు చూసే తీరిక దొరకడం లేదు. అదే సమయంలో పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు అనుకూలంగా రేటు నిర్ణయించడానికి తాము రూపొందించిన నిబంధనలనే తుంగలో తొక్కడానికి దానికి ఎటువంటి వెరపూ లేదు. ఇంతకుముందు పవన విద్యుత్ రేట్లను నిర్ణయిస్తూ 2009 మార్చి 31వ తేదీన కమిషన్ విడుదల చేసిన ఉత్పత్తులను పునఃపరిశీలించమని కోరుతూ పవన విద్యుత్ ఉత్పత్తి దారుల సంఘం 2012 జనవరి 31వ తేదీన ఒక రివ్యూ పిటిషన్‌ను కమిషన్‌కు సమర్పించింది. కమిషన్ బిజినెస్ రూల్స్ ప్రకారం కమిషన్ ఉత్తర్వులిచ్చిన 90 రోజులలో రివ్యూ పిటిషన్ సమర్పించాలి. కొన్ని వందల రోజుల తరువాత సమర్పించిన పైరివ్యూ పిటిషన్‌ను స్వీకరించడమే కాక కమిషన్ వారు ఉత్పత్తి దారులకు అనుకూలంగా పవన విద్యుత్ ధరలను ఒక యూనిట్‌కు రూ. 3.50 నుంచి రూ. 4.70కు పెంచుతూ సరికొత్త ఆదేశాలను జారీ చేశారు. ఇక్కడ ఇంకా జుగుప్సాకరమైన విషయమేమంటే పవన విద్యుత్ ఉత్పత్తి సంఘం 2008లో ఏ సమాచారం సమర్పించిందో అదే సమాచారాన్ని 2012 లోనూ సమర్పించింది. ఒకే సమాచారం ఆధారంగా కమిషన్ ఒకసారి ఒక రేటును ఇంకోసారి వేరొక రేటును నిర్ణయించింది. ఇంతకు దిగజారిన కమిషన్ నుంచి రాష్ట్ర ప్రజలు న్యాయం ఆశించడం దుస్సాహసమే !
ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులో ఉన్న వనరుల నేపథ్యంలో డిస్కమ్‌లు ప్రతిపాదించిన 42 శాతం కరెంటు ఛార్జీల పెంపు అనవసరం కిరణ్‌కుమార్‌ల వంటి వారితో కూడిన మన్మోహన్ గణాల విధానాలే ప్రజలపై వచ్చి పడుతున్న పెను భారాలన్నింటికీ కారణం.
(వ్యాసకర్త పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ ఆన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కన్వీనర్)
(చర ఖర్చులు (యూనిట్‌కు రూపాయిల్లో)
జెన్‌కో కేంద్రం 2012-13 2013-14
విటిసిఎస్-4 2.65 3.44
ఆర్‌టిపిపి 2.18 3.71
కెటిపిఎస్-6 1.76 2.53
కాకతీయ-1 1.75 1.86