సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి అధ్యక్షులు కె. ఆనందాచారి అధ్యక్షతన 'సమాంతర ఛాయలు' పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న
కవి కె. శివారెడ్డి 'సమాంతర ఛాయలు' పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ పుస్తక రచయిత మువ్వా శ్రీనివాసరావు మనసులో గూడు కట్టుకున్న 93 కవితలు 200 పేజీల్లో పరుచుకున్నాయని, అందులోని ఒక్కో కవిత ఒక్కో అంశాన్ని స్ఫురింపజేస్తుందని తెలిపారు. 1975 నుంచి నేటి వరకు సమాజంలో పరుచుకున్న కాలాన్ని కవిత్వంగా ఆయన చెప్పిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. సాహిత్యప్రస్థానం సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ సమాంతర ఛాయల్లో కఠోర జీవిత సత్యాలున్నాయని,... ఆశయ బలం ఉందని చెప్పారు. ఒక్క పిడికిట్లో నగరాన్ని.. పల్లెను పట్టుకున్న కవిత్వం మువ్వా కవిత్వమని కొనియాడారు. సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ మనిషిని మనిషికి దగ్గర చేయడం, జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన కవిత్వం సమాంతర ఛాయల్లో ఉందని కొనియాడారు. 10టీవీ సిఇఒ, కవి అరుణ్‌సాగర్ మాట్లాడుతూ సమాంతర ఛాయలు కవిత్వం జీవిత చిత్రాలను చూపిస్తోందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు సీతారాం మాట్లాడుతూ గుర్తింపు రాజకీయాలు ఆగిపోయిన చోట క్రాంతి శ్రీనివాసరావు కవిత్వం ప్రారంభమయ్యిందని అన్నారు. కవి యాకూబ్ మాట్లాడుతూ ల్యాప్‌ట్యాప్‌లో కవిత్వం రాస్తున్న క్రాంతి శ్రీనివాసరావుకు ఆన్‌లైన్‌లో కవిసంగమం వేదిక లభించిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్ స్వాగతం పలుకగా, తంగిరాల చక్రవర్తి వందన సమర్పణం చేశారు. నాగశిరీష ఆలపించిన లలితగీతం సభికులను అలరించింది. కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు.