మడతలు విప్పుకున్న జ్ఞాపకాలు

 

   సౌగంధి యసస్విని 
   9948714105  
   కళ్ళల్లోకి జారే వెంట్రుకల్ని
   ఎనక్కి నెట్టుకొని
  జారే చెడ్డీనెగేసుకుంటూ
  కట్టుకున్న ఇసుక గూడులు
  ఒక్కొక్కటిగా మెలిపెడుతూనే ఇంకా......

మనవడిష్టమనే
ర్యాంప్‌ సాంగ్‌ విన్నప్పుడల్లా
జతగాళ్ళతో కలిసి పాడిన
''రింగు రింగు బిళ్ళ''
పాట గుర్తొస్తుంది
క్షణకాలం పాటు
నా దేహమ్మొత్తం పాటవుతుంది
             -0-
''చింటూ ఎక్కడికిరా
వానలో తడిస్తే జలుబు చేస్తుంది''
కోడలిపిల్ల మాటలు విన్నప్పుడల్లా
సాహసగాళ్ళతో కలిసి 
వానలో తడుస్తూ
పిల్లకాల్వల్లోకి దూకే
పడవల సమూహాలైన దృశ్యాలు
నాకళ్ళలో మెదలాడుతుంటయ్‌
వంటింటి పోపుడబ్బాల్లోనో
కాగితపు మడతల్లోనో 
ఒక్కొక్కటిగా పేర్చుకొన్న జ్ఞాపకాలు
అప్పుడప్పుడూ
నావైపే జాలిగా చూస్తుంటాయి
నిస్సహయున్నై
ఏ స్పందనా లేకుండా
మరమనిషి గా నేను....?
         -0-
ఇంటిళ్ళ పాదీ
కల్సికూర్చొని వడ్డించుకొని
కడుపారా తిన్న రోజులు
తినేసమాయాన్నే కుదించుకున్న 
జీవితాల్నుండి
దూరంగా... మానుండి
ఎప్పుడు జరిగిపోయాయో?
మెలిపెడుతున్నాయింకా...
        -0-
చెంగుపట్టి లాగిన స్పర్శ..
ఫాన్‌ గాలికి చెల్లాచెదురైనా 
డైరీలో కాగితాలు
      -0-
నావాళనుకున్న వాళ్ల
ఏ పలకరింపూ లేని
మౌన సంభాషణ
నాచివరి రోజులకిది
రోజువారీ కార్యక్రమైందీ 
ఓల్డేజ్‌ హోంలో....