రాళ్ళపల్లి ఇద్దరూ గొప్ప విద్యాంసులు, వాళ్ళ మధ్య గురుశిష్య సంబంధముంది. పరస్పరం గౌరవించుకున్నారు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయితలుగా, విమర్శకులుగా ఉంటూ స్నేహాలతో, శత్రుత్వాలతో ప్రవర్తిస్తూ సాహిత్య సేవ చేసినవాళ్ళు ఎందరో ఉన్నారు. తిరుపతి వేంకట కవులు, శ్రీనివాస సోదరులు, వేంకట పార్వతీశ్వర కవులు వంటి జంట కవులు బాగా ప్రసిద్ధులు. విశ్వనాథ పింగళి సమకాలిక సాహిత్య సేవకులుగా ఉంటూ, ఇద్దరూ సంప్రదాయవాదులైనా, రెండు భిన్న మార్గాలలో ప్రయాణించారు. విశ్వనాథ శ్రీశ్రీలు విరుద్ధ మార్గానుయాయులు, చలం శ్రీపాదలు ఇద్దరూ సంస్కరణవాద రచయితలైనా వాళ్ళ మార్గాలు వేరు వేరు. ఈ కోవలో చేరే వారే కట్టమంచి, రాళ్ళపల్లి ఇద్దరూ గొప్ప విద్యాంసులు, వాళ్ళ మధ్య గురుశిష్య సంబంధముంది. పరస్పరం గౌరవించుకున్నారు. అయినా వాళ్ళ మౌలిక భావజాలాలు, జీవిత విధానాలు వేరు వేరు. ఇద్దరు కలిసి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు. వాళ్ళ మధ్య వ్యక్తిగత గౌరవం, అభిప్రాయ వైవిధ్యం ఐక్యత ఘర్షణ సిద్ధాంతం లాగా కొనసాగాయి. ఆ సంబంధాల్ని అర్ధం చేసుకుందాం.
కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మకు 1910వ సంవత్సరంలో తన వియ్యంకుడు కందాళి రఘునాధా చార్యుల ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయమయ్యారు. వీరి పరిచయాన్ని గురించి 'నాగురువులు' అనే వ్యాసంలో రాళ్ళపల్లి ఇలా చెప్పుకున్నారు. ''పాత ప్రపంచముననే ప్రాకులాడుతున్న నాకు వారితోడి సహవాసము ఆధునిక ప్రపంచపు తలుపులు తెరచి ఆహ్వానించినది'' ఇది రాళ్ళపల్లి మీద పడిన కట్టమంచి ప్రభావాన్ని తెలియచేస్తుంది.
అప్పటికి రాళ్ళపల్లికి 17 సంవత్సరాలు. కట్టమంచికి 30 సంవత్సరాల వయసు. రాళ్ళపల్లి విద్యార్థి కాగా కట్టమంచి ప్రతిభ, లోకజ్ఞానం అనుభవం, అధికారం, ఆత్మప్రత్యయంలో రాళ్లపల్లి కంటే ముందున్నాడు. ఒక్క సంస్కృత భాష పరిజ్ఞానంలో తప్ప.
రాళ్ళపల్లికి తెలుగుభాషతో పరిచయం తక్కువ. అచ్చ తెలుగు రామాయణం, నీలాసుందరి పరిణయం, ఆంధ్రనామ సంగ్రహాలను బాల్యంలో తన తండ్రి కర్నమడకల కృష్ణమాచార్యులవద్ద చదివిందే. ''నా తండ్రిగారుపదేశించిన ఆయింత తెలుగు కూడ మలినమై మాసిపోయియుండును. ఆ సమయమున దానికుత్తేజము గలిగించి ఉద్ధరించిన పుణ్యము శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిది అని కట్టమంచి నుండి తాను పొందిన మేలును కీర్తించాడు రాళ్ళపల్లి.
ఈ తెలుగు భాషను కూడా తన కోసం కాక కట్టమంచి కోసమే నేర్చుకున్నానని కూడా చెప్పుకున్నాడు రాళ్లపల్లి.... మా సంబంధము దినదినమును పెరుగుచువచ్చినది. వారిని చూడలేని దినము దుర్దినముగా తోచినది సాయంకాలము ఏ రెండు మూడు గంటలు కాలమైనను మేమిద్దరమును కూర్చొని కాలక్షేపము చేయనిదినములు వారములో చాలా తక్కువ. తెలుగు కావ్యములు, ముఖ్యముగా కవిత్రయ రచనలు చదువుకొనుట, దానిపై లోకాభిరామాయణముగా ఎన్నో విషయాలు వారు చెప్పుట, నాతో చెప్పించుట ఇది మా గోష్టికి పరాయణము. వారి వినోదము కొరకే నేను తెలుగు కవిత్వమునకు శ్రీకారము చుట్టితిని.'' అని తెలుగు భాషపై తనకు పరిచయం కలగడానికి కూడా కట్టమంచి సహకరించాడని చెప్పారు.
రాళ్ళపల్లి మొట్టమొదటి తెలుగు రచనా వ్యాసాంగం వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన ''సుభాషిత కౌస్తుభము''లోని నూరు పద్యాల అనువాదంతో మొదలైంది. ఇది తనకు నచ్చక చించేశారనే అభిప్రాయం కూడా ఉంది. అలాగే 1912లో దానిని వనపర్తిలో ముద్రించారనే అభిప్రాయం కూడా ఉంది అది నేడు అలభ్యం.
వీరి మొట్టమొదటి తెలుగు సృజనాత్మక రచన ''భార్గవీ శతకం''. ఇది 26 పద్యాలతో అసంపూర్ణం. వీరి సంపూర్ణ రచనలు తన 18,19 సంవత్సరాల వయస్సులో రాసిన ''తారాదేవి'' (1911) 'మీరాబాయి' (1912) అనే ఖండకావ్యాలు. ఈ రెండింటిని కట్టమంచికి వినిపించి వారి ప్రశంసలు పొందారు. ఈ రెండు కావ్యాలను ముద్రించింది కట్టమంచే.
1912లో కాళిదాసు రఘువంశాన్ని అనువదించారు రాళ్ళపల్లి. దీని ప్రచురణకు కట్టమంచి ధన సహాయం చేయడానికి ముందుకు వచ్చినా తనకే నచ్చక ప్రచురించలేదు. భాసుని 'స్వప్నవాసవదత్త'ను కూడా అనువదించి నచ్చక చించేశాడు.
రాళ్ళపల్లి ప్రతిభను గుర్తించి ఎలాంటి ప్రభుత్వ పరీక్షలలో అర్హతపొందని రాళ్ళపల్లిని మైసూరు మహా రాజా కాలేజిలో మొట్టమొదటి తెలుగు పండితునిగా 1912 జూలై 2న కట్టమంచి నియమించాడు.
కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ''కవిత్వతత్త్వ విచారము'', ''అర్థశాస్త్రము'' అనే రెండింటికి శుద్ధ ప్రతులను తయారు చేసింది రాళ్లపల్లి వారే. ఈ రెండింటిలోను కట్టమంచి రాళ్లపల్లి అభిప్రాయాలను చేర్చారు. ''కవిత్వతత్త్వ విచారముపై ''అలంకారతత్త్వ విచారము'' అనే విమర్శన గ్రంథాన్ని రాసిన కురుగంటి సీతారామయ్య ''కవిత్వతత్వ విచారము'' రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ రాసిందే అనే వాదాన్ని తెచ్చినప్పుడు ఆ రచన కట్టమంచిదే అని సవినయంగా చెప్పుకున్నాడు రాళ్ళపల్లి.
రాళ్ళపల్లికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. వారి మొట్టమొదటి సంగీత వ్యాసమైన ''గానకళ'' అనే వ్యాసాన్ని కట్టమంచి చాలా మెచ్చుకున్నారు.
కట్టమంచి తాను అభిమానించే కవులు ముగ్గురని తన మొదటి రచన 'ముసలమ్మ మరణము' కావ్యానికి రాసుకున్న పీఠికలో చెప్పుకున్నారు.
''కవికుల బ్రహ్మదిక్కన గణనజేసి
సూరనార్యుని భావంబు సొంపుబొగడి
వేమన మహాత్ము సహజ. విద్యామయాత్మ
మొక్కి కవన మొనర్పంగ బూనినాడ''
కట్టమంచి, పింగళి సూరన రచనలైన కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నముల మీద ''కవితత్త్వ విచారము' అనే విమర్శగ్రంథం రాశారు. ఇందులో కూడా తిక్కన, వేమనలను ప్రస్తావించాడు.
రాళ్ళపల్లి తిక్కన మీద ''తిక్కన తీర్చిన సీతమ్మ'' అనే వ్యాసాన్ని రాశాడు. ''తిక్కనపై అభిమానానికి ఆయనే కారణం'' అన్నారు. కట్టమంచి ద్వారానే తిక్కన తనకు అభిమానని రాళ్ళపల్లి చెప్పుకున్నట్లైంది.
వేమనపై కట్టమంచి 1928లో ఏడు రోజులపాటు ఏడు ఉపన్యాసాలు ఇప్పించదలచినప్పుడు దానికి అర్హుడుగా రాళ్లపల్లి తన మనసులో మెదిలాడు. దానికి కారణం 1917 వావిళ్ళవారు ప్రచురించిన ''వేమన పద్యా''లకు రాళ్లపల్లి పీఠిక రాసి కట్టమంచి మన్ననలను పొందడమే.
ఈ ఉపన్యాసం ఇవ్వడానికి దరఖాస్తు చేసుకోడానికి 1928 'ఆంధ్ర పత్రిక'లో ప్రకటన వచ్చినప్పుడు సి.ఆర్. నరసింహశాస్త్త్రి ద్వారా రాళ్ళపల్లికి తెలిసినా దరఖాస్తు చేయలేదు. ప్రకటన వచ్చి ఇరవై రోజులైనా రాళ్లపల్లి నుంచి దరఖాస్తు రాకపోవడంతో కట్టమంచి వఇనీగి ఖిళిదీ'శి గిళితి బిచీచీజిగి తీళిజీ ళితిజీ ఖీలిళీబిదీబి రీచీలిబీరిబిజి జిలిబీతిశితిజీలి రీనీరిచీ?వ అని త్తరం రాశారు. కట్టమంచి మాటకు విలువనిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఉపన్యాసానికి సంబంధించిన సలహాలు, సూచనలు చేసి ఉపన్యసించడానికి రాళ్ళపల్లిని ప్రోత్సహించాడు.
రాళ్లపల్లి తన ''మీరాబాయి'' ఖండకావ్యాన్నీ, కట్టమంచి రామలింగారెడ్డి ''ముసలమ్మ మరణము'' ఖండ కావ్యాన్నీ నాయిక మరణంతోనే ముగించారు.
కట్టమంచి భారత కావ్యపాత్ర ద్రౌపదిని, రామాయణ పాత్ర సీతను తీసుకుని ''ద్రౌపది-సీత'' అనే వ్యాసాన్ని రాశాడు. రాళ్లపల్లి తెనాలి రామకృష్ణుని 'పాండు రంగ మహత్యము' లోని నిగమశర్మ అక్కపాత్రను తీసుకొని ఆ పేరుతోనే వ్యాసం రాశాడు. అలాగే వాల్మీకి రామాయణాన్ని తెలుగులోనికి అనువదించిన తిక్కన సీత పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని గురించి ''తిక్కన తీర్చిన సీతమ్మ'' అనే వ్యాసాన్ని రాశారు.
కట్టమంచి రామలింగారెడ్డి ''కవిత్వతత్త్వ విచారము'' శుద్ధ ప్రతి తయారు చేయడంలో రాళ్ళపల్లి తానే బాధ్యతలు నిర్వహించారు. అయినా అందులో తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా రాళ్ళపల్లి తన రచనలలో తెలియచేశారు.
''శిల్పము యొక్క అభిమతము సుఖము'' అనే కట్టమంచి అభిప్రాయంతో రాళ్ళపల్లి ఏకీభవించడు.
''ఆనందమనగా సుఖముగాదు. సుఖము ఇంద్రియములకు సంబంధించినది. ఆనందము ఆధ్యాత్మికము. అనగా ఆత్మకెక్కవగా సంబంధించినది.... సుఖము ఆనందము యొక్క మిత స్వరూపము. చంచలము సుఖమే దుఃఖమునూ... ఆనందమట్టిది కాదు;... ఆమేయము''. అని సుఖం ఇంద్రియాలకు సంబంధించినదన్నాడు.
వేమనపై కట్టమంచి రాళ్లపల్లితో చేయించిన ఉపన్యాసంలో కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాడు. వేమన రాయలసీమ రెడ్డి అనే కట్టమంచి అభిప్రాయాన్ని అంగీకరించలేదు.
రంగనాథ రామాయణ కర్తృత్వ విషయంపై కట్టమంచి చూపిన ఉదాహరణలన్నిటికీ సమాధానాలు చూపించారు. కట్టమంచి గోనబుద్ధారెడ్డి కర్త అంటే రాళ్ళపల్లి రంగనాథుడని చెప్పాడు. ''వారి శక్తి యుక్తులను గౌరవించినంత హార్థముగా వారి అభిప్రాయములను అంగీకరించుట నా వంటి వారికి పలుమాఱుగల్గు భాగ్యముగాదు'' అని తన శక్తి యుక్తులపట్ల అభిమానం ఉన్నా వారి అభిప్రాయాలను అభిమానించనంటూ చెప్పాడు.
ఈ వ్యాసాన్ని చదివిన రామలింగారెడ్డి మూడు రోజులు ధమదుమలాడిరట ! అప్పుడు వీరిద్దరికీ సన్నిహితులైన అబ్బూరి రామకృష్ణారావు కట్టమంచితో ''మీ శిష్యుడు ఇంత ధైర్యముగా మీ సిద్ధాంతములను ఖండిచుచున్నప్పుడు మీరు గర్వపడవలెను కాని గోపగించుట ఎందుకండి ? అని అన్నారట ! అప్పుడు రెడ్డి గారు శాంతించారట !
కొంతకాలానికి రాళ్ళపల్లి కట్టమంచిని కలిసినప్పుడు యోగక్షేమాల తర్వాత నవ్వుతూ ''మీ విమర్శకులు మమ్ములను బతకనిస్తారేమయా?'' అంటూ రాళ్ళపల్లితో కట్టమంచి అన్నారట.
సాహిత్యపరంగానే కాక నిజజీవితంలో కూడా వీరి అభిప్రాయాలు కలవవు. ''నాది సనాతన సంప్రదాయం. ఆయనది ఆధునికంలో ఆధునికం'' ''నీవు కూడా పెండ్లి చేసుకొని భార్య బంధంలో చిక్కుకొని స్వరూపనాశనం చేసుకోవద్దయా !' అని రాళ్ళపల్లికి ఉపదేశించాడు. 'మీ ఉపదేశం కాలాతీతంగా వచ్చింది. మరి మీకున్న భయమూ నాకు లేదు.'' అని రాళ్ళపల్లి బదులిచ్చాడు.
మరోసారి ''రామునికి సీత చెల్లెలు గాని భార్య కాదు'' అని రాళ్లపల్లి కట్టమంచితో అనగా అప్పుడు ''అందులో ఆశ్చర్యమేమి లేదు. చెల్లెలే భార్యగా వ్యవహరించి వుండవచ్చును.'' అని కట్టమంచి అన్నారట. అంటే అలాంటి వివాహాల గురించి మరియు అన్య రక్తంవారు తమ రాజ్యాన్ని ఏలకూడదనే ఉద్దేశంతో కూతురునే వివాహం ఆడేవారని కట్టమంచి చెప్పెనట. ''ఆ మాట నాకెంత హృదయ భేదకంగా వుండిందో చెప్పి చూపలేను'' అని చెప్పుకున్నాడు రాళ్ళపల్లి.
ఇలా చాలా విషయాలలో కట్టమంచి అభిప్రాయంతో రాళ్ళపల్లి అభిప్రాయాలకు పొంతన లేక పోయినప్పటికీ కట్టమంచి శక్తియుక్తులపట్ల మాత్రం రాళ్ళపల్లికి అమితమైన అభిమానం.
''గాథాసప్తశతిసారము'' అనే గ్రంథాన్ని కట్టమంచికి అంకితమిస్తూ రాసిన పద్యాలే అందుకు నిదర్శనం వాటిలో ఒకటి -
''నీదు నగవు బిగువు, నెఱపల్కుపదును, నీ తెలివిలోతు, నడతతెగువ, నీదు నిండు తెలుగుమనసు, నీయోర్ని నీకూర్ని మచ్చు మందులగుచు మరిపెనను''
ఇలా కట్టమంచితో రాళ్లపల్లికి 1910లో పరిచయమై 1950 వరకు అంటే కట్టమంచి మరణం వరకు కొనసాగింది. కట్టమంచి చే నియమించబడిన మైసూరు మహారాజ కాలేజిలో రాళ్ళపల్లి తెలుగు పండిత పదవిలో 1912 జులై 3వ తేది నుంచి 1949 డిసెంబరు 19 వరకు ఉండి పదవి విరమణ చేశారు.