-డా|| ఎం. హరికిషన్
9441032212
బస్సు వేగంగా దూసుకుపోతోంది. రఘురాం కిటికీలోంచి బైటకు చూస్తున్నాడు. చల్లని గాలి ప్రశాంతంగా తాకుతూ వుంది. చీకటిలో రోడ్డుకి ఇరువైపులా ఏమీ కనబడ్డం లేదు. కండక్టర్ టికెట్లు కొట్టడం పూర్తయ్యింది. లైట్లు ఆర్పివేశారు. కాసేపటికే ఎవరో
సిగరెట్ అంటించారు. ఒక్కసారిగా భాస్వరం వాసన గుప్పుమంది. రఘురాంకి తలతిప్పినట్లుగా అన్పించింది. ఠక్కున లేచి సిగరెట్టు తాగుతున్న వ్యక్తి దగ్గరకు పోయి ''పాడెయ్యి దాన్ని. బస్సులో తాగగూడదని తెలీదా'' అన్నాడు కటువుగా. అతను తలెత్తి రఘురాం వంక చూశాడు. ఆరడుగుల ఎత్తుతో, బలిష్టమైన ఒంటితో చీకటిలో మసకమసకగా కనబడుతున్నాడు. మారు మాట్లాడకుండా సిగరెట్ బైట పడేశాడు. రఘురాం తిరిగి తన స్థలానికి చేరుకున్నాడు. అమావాస్య దగ్గర పడుతుండడంతో చుట్టూరా చిక్కని చీకటి ఆవరించింది. సమయం పదకొండవుతూ వుంది. హెడ్‌లైట్ల వెలుతురులో మెలికలు తిరుగుతున్న నల్లని రోడ్డు మధ్యలో తెల్లని చారలు వింతగా మెరుస్తూ వున్నాయి. చాలామంది నిద్రలో జోగుతూ వున్నారు. ఎటువంటి అలికిడి లేదు.
అంతలో సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు ఒక్క కుదుపుతో ఆగిపోయింది. అందరూ ముందుకి తూలారు. అర్థంగాక అయోమయంగా చూడసాగారు. వెంటనే ఏవో అరుపులు, కేకలు... అద్దాలు భ ళ్ళున పగలసాగాయి. డ్రైవర్ రహదారిపై రాళ్ళు అడ్డంగా వుండడంతో ఏం చేయాలో పాలుపోక వెనక్కి తిప్పడానికి ప్రయత్నించాడు. అంతలోపే కొందరు పగిలిన అద్దాల గుండా కిటికీలలోంచి లోపలికి వచ్చేసి తలుపు తెరిచారు. తెల్లని మాసిపోయిన బనియన్లు, పైకెత్తి కట్టిన పంచలు, ముఖాలకడ్డంగా కట్టిన వల్లెలు వున్న కొందరు కట్టెలు, కత్తులతో లోపలికి దూసుకువచ్చారు. జరుగుతున్నదేమో జనాలకు నెమ్మదిగా అర్థమవుతూ వుంది. అంతలో కొందరు యువకులు ''ఎవర్రా మీరు'' అంటూ పైకి లేచారు. వెంటనే వాళ్ళు కట్టెలతో దొరికిన వాళ్ళని దొరికినట్టు దబదబదబ బాదసాగారు. ఒకరిద్దరి తలలు పగలి ఎర్రని రక్తం బైటపడింది. అది చూడగానే మిగతా వాళ్ళందరి గుండెలు దడదడలాడాయి. భయంతో కొయ్యబారి పోయి వణుకుతూ కుర్చీల్లో అతుక్కుపోయారు. దొంగలు ఆడవాళ్ళ వంటిమీది నగలు, మగవాళ్ళ వాచీలు, వుంగరాలు, గొలుసులు బలంవంతంగా గుంజుకోసాగారు. కొందరు సూటుకేసులు పగలగొట్టి విలువైన వస్తువులు బైటికి తీస్తున్నారు. పావుగంటలో పని ముగించుకొని సైగలు చేసుకుంటూ వేగంగా బైటకు పోవడం మొదలుపెట్టారు.
రఘురాం పిడికిలి బిగుసుకుంది. ఒకప్పుడు సైనికునిగా పనిచేసిన ధైర్యం వెన్నుతట్టసాగింది. దొంగలు అంత ప్రొఫెషనల్‌గా కూడా లేరు. ఒక్కన్ని పట్టుకున్నా చాలు. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఒక్కుదుటున పైకిలేచి బస్సుదిగుతున్న వాళ్ళ వెంబడి తానూ దుంకి అందరికన్నా చివర పోతున్న ఒకన్ని గట్టిగా వెనుక నుండి వాటేసుకున్నాడు. వాడు విడిపించుకోవడానికి గట్టిగా కేకలు పెడుతుండడంతో ముందు పోతున్న ఇద్దరు వెనక్కి తిరిగి కట్టెల్తో దాడి చేశారు. ఆ దెబ్బలను లెక్కచేయకుండా పట్టినపట్టు విడువకుండా మరింతగా బిగించాడు. బస్సులో తేరుకున్న జనాలు ఒక్కసారిగా బైటకు దుంకారు. వాళ్ళనుచూడగానే దొంగలు వులిక్కిపడ్డారు. ముగ్గురు తప్ప మిగిలినవారు అప్పటికే చీకటిలో కలసిపోయారు. ఒకడు ఆఖరి ప్రయత్నంగా కత్తి తీసి బలంగా రఘురాంను పొడవబోయాడు. రఘురాం నేర్పుగా పక్కకి తిరగడంతో కత్తి దొంగ భుజంలోకి దిగి రక్తం ఎగజిమ్మింది. వాళ్ళు అదిరిపడ్డారు. జనాలు దగ్గర కావడంతో తాము గూడా పట్టుబడతామేమోనన్న భయంతో ఒక్కన్ని అలాగే వదిలేసి పారిపోయారు. వాడు రఘురాం పట్టు నుంచి తప్పించుకోడానికి గింజుకోసాగాడు. ఆ పెనుగులాటలో మొహానికడ్డంగా కట్టుకున్న వల్లె పక్కకి తొలగింది. మసక వెలుతురులో ఆ దొంగ మొహం చూసిన రఘురాం కళ్ళు పెద్దగయ్యాయి. ''నువ్వా'' అన్నాడు ఆశ్యర్యంతో. దొంగ తలెత్తి రఘురాం వంక చూశాడు. క్షణకాలం ఇద్దరి కళ్ళూ కలిశాయి. చేతిపట్టు సడలింది. వెంటనే ఆ దొంగ ఒక్కుదుటున విదిలించుకొని వేగంగా పారిపోయాడు. రఘురాం షాక్ తిన్నవానిలా అట్లాగే నిలబడిపోయాడు.
రఘురాం వుండేది సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ కాలనీలో. మిలట్రీ నుంచి వచ్చేశాక బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. నందికొట్కూరులో ఒక పెండ్లి వుంటే బైలుదేరాడు. అంతలో ఈ సంఘటన. పెళ్ళిలో వున్నా రఘురాం చుట్టూ అవే ఆలోచనలు. ఆ రూపం మళ్ళా మళ్ళా గుర్తుకు రాసాగింది. చిన్నప్పుడు ఒకరినొదిలి ఒకరు అస్సలు వుండేటోళ్ళు కాదు. వాని ఆలోచనలతో తల పగిలిపోతోంది. లాభం లేదు... వూరికి పోతే తప్ప విషయం అర్థం కాదు. మళ్ళా ఇప్పట్లో ఇటువైపు వచ్చే పనేం లేదు అనుకున్నాడు. పెళ్ళి పూర్తి కాగానే కర్నూలుకి చేరుకొని డోన్ వైపుకు బైలుదేరాడు. డోన్ పక్కనే చిన్నపల్లె. రోడ్డు మీంచి మూడు కిలోమీటర్ల దూరం. బస్సు దిగి నడక మొదలుపెట్టాడు.
అడుగులు వేస్తూ వుంటే దుమ్ము పైకెగస్తా వుంది. మనుషులు అక్కడక్కడా మాసిన గడ్డాలతో, నల్లబారిన ముఖాల్తో, కరిగిన ఒంటితో కనబడుతున్నారు. పశువుల డొక్కలు లోపలికి పీక్కుపోయాయి. కొంతమంది ఆడవాళ్ళు గుంపుగా ఎక్కడో వూరికి దూరంగా వున్న సుంకులమ్మ చెరువు నుండి నెత్తిన ఒక బిందె, సంకలో ఒక బిందె పెట్టుకొని వేగంగా అడుగులు వేస్తున్నారు. పొలాలు నిర్మానుష్యంగా వున్నాయి. ఎండకు ఒళ్ళు చెమటలు కక్కుతూ వుంది. గసబెడతా వూళ్ళోకి ప్రవేశించాడు. రోడ్లమీద ఆడాడ పిల్లలు చెట్ల నీడన ఆడుకుంటున్నారు. పనుల కోసం వలసలు పోవడంతో చాలా ఇండ్లకు తాళాలేసి వున్నాయి. ముసిలోళ్ళు, పిల్లలు తప్ప యువకుల జాడ చాలా తక్కువగా కనబడుతూ వుంది.
చిన్నప్పుడు ఆడుకున్న వీధులు, చదివిన బడి, తిరిగిన ప్రదేశాలు అన్నీ నిశ్శబ్దంగా పలకరిస్తున్నాయి. చెళ్ళెళ్ళ పెండ్లిళ్ళు, నాన్న చనిపోవడం, గుత్తలు పెద్దగా రాకపోవడంతో వచ్చిన కాడికి భూములమ్మేసి అమ్మను తనతో తీసుకుపోవడం, వూరితో పది సంవత్సరాలుగా సంబంధాలు పూర్తిగా తెగిపోవడం... ఒకొక్కటే గుర్తుకు రాసాగాయి. నెమ్మదిగా అడుగులు వేస్తూ రామాలయం పక్క సందులోకి తిరిగాడు. చిన్ననాటి మిత్రుడు సుంకన్న ఇల్లు కనబడింది. తలుపు తెరిచే వుంది. ''హమ్మయ్య... ఇంట్లో ఎవరో ఒకరు వున్నట్టున్నార్లే'' అనుకుంటూ దగ్గరికిపోయాడు.
ఇంటి పక్కనే వున్న వేపచెట్టు కింద నులకమంచమేసుకోని వుత్తపైన పడుకోనున్న సుంకన్న అలికిడికి లేచి కూర్చున్నాడు. రఘురాంని గుర్తుబట్టి ఆశ్చర్యంతో, ఆనందంతో ''రేయ్...బాగున్నావా... ఏమిట్రా దారి తప్పొచ్చినావు. ఐనా ఇంత ఎండనబడి రాకపోతేనేం చల్లగైనాక రాగూడదా'' అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ లేచి దగ్గరకొచ్చాడు.
''ఏం లేదురా... స్నేహితుని కూతురి పెండ్లుంటే నందికొట్కూరుకి వచ్చింటి. ఎట్లాగూ ఇంత దూరం వచ్చాగదా... ఒకసారి అందరినీ పలకరిచ్చి పోదామని'' అన్నాడు.
''దా...దా...'' అంటూ లోపలికి పిలుస్తూ ''ఏమే... ఎవరొచ్చినారో చూడు'' అంటూ గట్టిగా కేకేసినాడు. సుంకన్న పెండ్లాం బైటకొచ్చి ''ఏంనా... బాగుండావా... పూర్తిగా నల్లపూసైనావ్. వదినా, పిల్లలు ఎట్లుండారు. చూసి ఎన్నేళ్ళయిందో... అంతా పెద్దోళ్ళయి పోయింటారే'' అంటూ పలకరిస్తూ కాళ్ళు కడుక్కోమని చెప్పింది. రఘురాం జలాట్లోకి పోయి గచ్చులో అడుగునున్న నీటిలో చెంబుతో ముంచుకోని కాళ్ళూ చేతులు కడుక్కున్నాడు. ''దా... బైట్నే కూచుందాం. ఇంట్లో ఒకటే ఉక్క'' అని సుంకన్న పిలిస్తే తలుపుతూ చెట్టు కింది నులకమంచి మీదకు చేరుకున్నారు.
''ఏరా... పంటలెట్లావున్నాయి. ఏమేసినావీసారి'' ప్రశ్నించాడు రఘురాం.
సుంకన్న ఆకాశమొంక చూసి నిట్టూరుస్తా ''అవ్వ వడికిన నూలు తాత మొలతాటికి సరన్నట్లు పెట్టింది రావడమే గగనమైపోతోంది. ఈ యవసాయం చేసే దాని కన్నా కూలిపనికి పోవడమే మేలురా... ఎండలు సూసినావు గదా... ఈ సమ్మచ్చరం మరీ ఎక్కువైపోయినాయి. దుడ్లు మన్నులో పోసినట్లే. ఏమీ సేయలేక కిందాపైనా మూసుకోని గమ్మున ఆకాశమొంక సూస్తా కూచున్నాం'' అన్నాడు.
అంతలో అటువైపు పోతున్న క్రిష్ణారెడ్డి రఘురాంని చూసి ''ఏమన్నా... ఎప్పుడొచ్చినావు'' అంటూ పలకరిస్తూ మంచమ్మీదకు చేరుకుని రఘురాంని ఎగాదిగా చూస్తూ ''అనా... నేను గూడా ఇంటరైపోగానే నీ యెంబడే మిలట్రీలో చేరింటే బాగుండేదనా'' అన్నాడు.
''నీకేంలే కృష్ణారెడ్డి! రోజుకో కాంట్రాక్టు. పూటకో అగ్రిమెంటు. దుడ్లు దులిపిన కొద్దీ రాల్తున్నాయ్. ఇంగెందుకో ఆ వుత్తుత్త ఏడుపు'' అన్నాడు సుంకన్న.
''సాల్లేరోయ్... దొరికినాడు గదాని బలే సంబడంగ ఎగిరెగిరి చెబ్తున్నావ్. దా.. ఓ కాంట్రాక్టిప్పిస్తా. కూలోల్తో పనుల్చేపిచ్చి, పెద్దరెడ్డికి పర్సెంటేజిచ్చి, ఇంజనీర్లను మేపి, బిల్లులు సాంక్షను చేపిచ్చుకునేసరికి తలలో జేజెమ్మ దిగొస్తాది. కూచోని మాటలు చెప్పడం గాదు కాంట్రాక్టులంటే''.
కృష్ణారెడ్డి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయినాడు. వాడట్లా పోగానే ''మాటలు నేర్చినాడు కొడుకు. రెడ్డి రాజకీయం వుపయోగించి వూళ్ళో కాంట్రాక్టులన్నీ కొట్టెస్తా వున్నాడు. దానికి తోడు పనికి ఆహార పథకం లడ్డులెక్క దొరికింది. ఈ కరువుల్లో గూడా పచ్చగుండేది ఇట్లాంటి నాకొడుకులే. స్నేహితులైనా, బంధువులైనా ఎంతవసరమొచ్చినా ప్రామిసరీ నోటు మీద సంతకం లేకుండా ముడ్డి కింద నుంచి మూట తీయడు. వడ్డీల మీద వడ్డీలేస్తా వుంటే తట్టుకోలేక ఆఖరికి భూములు అమ్ముకోవాల్సిందే... పాపం... శంకరప్ప లేడూ... బోయగేరిలో వుంటాడు. అప్పు కట్టలేక, అవమానం తట్టుకోలేక ఆఖరికి పొలంలోనే చింతచెట్టుకి వురేసుకునె. ఇంకా ఎంతమంది వుసురు పోసుకోవాల్నో వీడు'' అన్నాడు.
రఘురాం మనసంతా అదోలా అయిపోయింది. కాసేపు మౌనంగా వుండిపోయాడు. మళ్ళా పదే పదే బస్సు సంఘటన గుర్తుకు రాసాగింది. విషయం చెప్పకుండా కాసేపు అవీ ఇవీ మాట్లాడి ''అవునూ బలిజగేరిలో గోవిందయ్యని చిన్నప్పుడు మనతోబాటు చదువుకున్నాడే... వాడెట్లా వున్నాడు. చూడక చానా రోజులైంది'' అన్నాడు. ఆరా తీస్తూ..
సుంకన్న ఓ నిమిషం పాటు ఆగి ''ఇంగెక్కడి గోవిందయ్య. మూడు సమ్మచ్చరాలైపాయ వూరిడిచి. ఇంతవరకూ ఇటువైపు గూడా తొక్కి చూళ్ళా'' అన్నాడు.
''ఏం... ఏమైంది'' ఆతృతగా అడిగాడు.
''నువ్వు వూరిడ్చిన మూడు సమ్మచ్చరాలనుకుంటా... కరువొచ్చి వరసగా రెండు సమచ్చరాలు దెబ్బ మీద దెబ్బ కొట్టె. పదెకరాలంటే మన సీమలో ఏమీ లేనోడనే గదా అర్థం. అప్పట్లో కూతురి పెండ్లుందని మరో పదెకరాలు ముందస్తు గుత్త ఇచ్చి తీసుకునె. అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చ. వాన మొదట్లో బాగానే కురిసినా అవసరమైనప్పుడు మొగం చాటేశ. కండ్ల ముందు పంట వాడిపోతుంటే చూళ్ళేక అప్పుపెట్టి బోరేపించ. సన్నపిల్లోడు పుచ్చ పోసినట్టు నీళ్ళు పడె. అదీ మూన్నాళ్ళ ముచ్చటే. అప్పులు తీర్చలేక నల్లవంక కాడున్న ఐదెకరాలు అమ్మేశ. మిగిలిందాంతో పిల్ల పెండ్లి చేశ. అంతలో వూరి బైట ఒక ఫ్యాక్టరీ వచ్చ. వీనికి రోడ్డు మీద ఐదెకరాలుందిగా... అదింత దాండ్లోకి పాయ. అమ్మనని వీన్తోబాటు చానామంది అడ్డం తిరిగినారు గానీ ఎమ్మెల్యే మధ్యలో దూరినాడు. ఎదిరిచ్చి ఎట్లా బతగ్గలం. దాంతో ఇచ్చిన కాడికి పుచ్చుకొని చెప్పినచోట వేలిముద్రేసి కిమ్మనకుండా బైటకొచ్చ. దుడ్లు బాగానే వచ్చినాయి గానీ అవెంతకాలం నిలబడ్తాయి. వూరిబైట భూములన్నీ ఫ్యాక్టరీలోకి పోగానే వూర్లో భూములన్నీ కొండెక్కి కూచున్నాయి.
వానికున్నది ఒక్కడే కొడుకు. ఒక్కసారిగా డబ్బొచ్చిపడేసరికి యాపారం చేద్దామని పట్టుబట్టె. మొదట్లో బాగానే జరిగింది. దుడ్లు దుడ్లు గాదు. కానీ చుట్టూరా స్నేహితులు, జల్సాలు. కొడుకు ఎవరి మాటా వినేటోడు గాదు. ఖర్చు ఖర్చుగాదు. ఒకసారి మందు తాగి రోడ్డు మీద బైకులో రయ్యిమని రాత్రిపూట వస్తా వంటే... పెద్దబావి కాడ మలుపుంది చూడు.. ఆడ చూసుకోక ఎదురుగొస్తున్న ఎడ్లబండికి కొట్టేశాడు. నెలరోజులు అస్పత్రిలో డబ్బు మంచినీళ్ళ లెక్క ఖర్చాయ. ఆఖరికి ఒంటికాలుతో కొడుకింటికి చేరుకునె. పరిస్థితి మళ్ళా మొదటికొచ్చ. భూమిలేనోనికి ఎవడప్పిస్తాడు. పుట్టినూళ్ళో గంజినీళ్ళు గూడా పుట్టలా... పూలమ్మిన చోట కట్టెలమ్మలేక ఆఖరికి తట్టాబుట్టా తీసుకొని పెండ్లాం పిల్లల్తో టౌనుకి ఎల్లిపాయ. అంతే... ఆరోజు నుంచీ వాని మొగం మళ్ళా ఎవరమూ ఎప్పుడూ చూళ్ళా'' అన్నాడు.
రఘురాంకి నెమ్మదిగా విషయమంతా అర్థం కాసాగింది. మాటల్లోనే సుంకన్న పెండ్లాం ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ వుంటే ఓ జీపొచ్చి ఇంటి ముందాగింది. సుంకన్న పెద్ద కొడుకు వీరేష్ అందులోంచి దిగ్గానే దుమ్ములేపుకుంటూ పోయింది. ఫుల్లుగా తాగినట్టున్నాడు. ముఖం వుబ్బి కండ్లు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి. తలొంచుకొని తడబడుతూ చక్కగా ఇంట్లోకి పోయినాడు.
రఘురాం వాన్ని చూస్తూ ''పెద్దోడు గదా... ఏం చేస్తున్నాడిప్పుడు'' అన్నాడు ఆశ్చర్యంతో. సుంకన్న కాసేపు మౌనంగా వుండి ''రాజారెడ్డి దగ్గర పన్జేస్తున్నాడు'' అన్నాడు గొణుగుతున్నట్లుగా.
రాజారెడ్డి గురించి రఘురాంకి బాగా తెలుసు. వూళ్ళో ఒక వర్గానికి ఆయన మాటే వేదం. తిరుగులేదు. ఎప్పుడూ ఓ పదిమంది కత్తుల్తో, నాటుకట్టెల్తో ఎంబడుండాల. పెద్దరెడ్డికి రాజారెడ్డికి అస్సలు పడదు. ఎవరి మీద ఎవరు దాడి చేస్తారో తెలీదు. నిరంతరం గొడవలూ, కేసులే. మధ్యలో ఎంతమంది ప్రాణాలు పోయామో తెలీదు.
''తెలిసి...తెలిసీ.. ఆయన దగ్గరెందుకు పెట్టావ్'' అన్నాడు రఘురాం.
సుంకన్న విరక్తిగా నవ్వి 'ఏం చేద్దాం... నాలుగువేళ్ళు నోట్లోకి పోవాలంటే ఏదో ఒగటి సెయ్యాల... తప్పని తెలిసినా తప్పదు. సూస్తూ సూస్తూ పస్తులతో సావలేం గదా... వీడు తెచ్చి పెడ్తుండబట్టే ఇంట్లో జరుగుతా వుంది'' అన్నాడు.
మాటల్లోనే సాయంకాలమైంది. రఘురాం పోయెస్తానని చెప్పి బైలుదేరాడు. అంతలో సుంకన్న ''మన గోవిందయ్య వుండేది టౌనులోనే గదా... కర్నూల్లో ఎవరైనా తెలిసినోళ్ళుంటే కాస్త వెదికి చూడు. దొరుకుతాడు'' అన్నాడు.
రఘురాంకి జరిగింది చెబుదామని నోటిదాకా వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. పోయోస్తానని అందరికీ చెప్పి బైలుదేరాడు.
కర్నూలు నుండి లోకల్ రైలు వచ్చినట్లుంది. ఉదయం పనుల కోసం నగరానికి పోయిన జనాలంతా తిరిగివస్తూ వున్నారు. చీకట్లో ఎవరూ గమనించడం లేదు. ఎవరి తొందరలో వాళ్ళు... అలసిన ముఖాల్తో, చెమట పట్టి మట్టికొట్టుకున్న బట్టల్తో, పలుగు పారల్తో, ఖాళీయైన సద్ది మూటల్తో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వేగంగా ఇండ్ల వైపు వెళుతున్నారు.
పల్లెలన్నీ ప్లాట్లుగా, సెజ్జులుగా మారిపోయాక గ్రామాల్లోని సాలు సక్కగ వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొనగాళ్ళు, వంచిన నడుం ఎత్తకుండా చకచకచక నాట్లు వేసే పనిగత్తెలు, కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలకు ఎకరాలు పంట కోసే పాలెగాళ్ళు, గడ్డివాముల్ని ఎంతటి గాలికైనా, వానకైనా చెక్కు చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు... ఈ వ్యవసాయ నిపుణులంతా... నగరాల్లో భవన నిర్మాణాల్లో అన్‌స్కిల్డ్ లేబర్‌గా మారిపోయారు. ఒకప్పటి రాష్ట్ర రాజధానిని తలచుకుంటే మనసు కళుక్కుమంది. నగరంలో ఫ్యాక్టరీల సైరన్‌మోత వినక ఎన్నాళ్ళయిందో. పేపరుమిల్లూ, కార్బైడ్ ఫ్యాక్టరీ, బిర్లా, ఎంజీ బ్రదర్స్ ఒక్కటనేటి అన్నీ ప్లాట్లుగా, అపార్ట్‌మెంట్లుగా మారిపోతున్నాయి. కార్మికులూ లేరు. కర్షకులూ లేరు.
మనసంతా వూరి గురించిన ఆలోచనలే. గుండె బరువెక్కి పోతోంది.
''మంచీ చెడూ, నీతి న్యాయం, ధర్మం అధర్మం... ఇట్లాంటివన్నీ కడుపు నిండినోళ్ళ ఆలోచనలే... కానీ బతకడమే యుద్ధమైన చోట...''
రఘురాంకి గోవిందయ్య, సుంకన్న, శంకరప్ప... అందరూ చుట్టూ మూగి ప్రశ్నిస్తున్నట్లుగా వుంది.