రాజకీయం

కవి: 
పారువెల్ల

కీసలో కాసులెందుకురా
అంగట్లో అన్నీ ఉచితాలేనట
సేవలు త్యాగాలు ఊతపదాలే
పాలకులంతే ఏ పాపం మూటగట్టుకోరు
సంధి చేసుకున్నాసంచి పంచుకున్నా
అమ్మేది నిన్నూ నన్నే
ఆడ్డా చేరుకున్నాక మొహమాటాలేముంటాయ్‌
పాలకులంతే ఏ పుణ్యం వదులుకోరు
రాజకీయమంటే అంతే
సమాధి మీద పూచిన శ్వేత మందారంలా
చావు పాటల పైనే పూస్తుంది యువ రాజకీయం
వాడుపోతే కొందరు చచ్చారని
వీడు పోతే కొందరేడ్చారని
ఇక్కడ చావు లెక్కలూ... దొంగ లెక్కలే
ఇంటోళ్ళకి ఏమీ కాదు
చంటోళ్ళది చావులెక్కల సన్నాయి మేళం !
వీధి వీధి తిరిగి వాయిస్తుంటారు
వాళ్ళు,
అసలు లెక్కలు దాస్తున్నారు
చావు లెక్కలు మోస్తున్నారు