పగలంతా తీరికలేని పనుల్తో
రెక్కలు ముక్కలు చేసుకున్న నగరం
అలసి సొలసి
నాలుగు రోడ్ల కూడలిలో నడుంవాల్చింది
చలి పులిపంజా విసిరి
కలలను తునాతునకలు చేస్తూ
తన కాలబలిమిని కసిగా చాటుకుంటోంది
నియోన్ లైట్ల వెలుతురులో
కన్నెపిల్ల సిగ్గులా కనీకనిపించకుండా
మంచు, హృదయపు అంచును తాకుతోంది
నగరం ఆదమరచి నిద్రపోతున్నవేళ
ఆమె మాత్రం 'ఆవు'లింతల్ని
బాధ్యతల తాడుతో బలవంతంగా కట్టిపడేసి
తన మంత్రదండంతో రోడ్డున పడుతుంది
నగరపు శిలాఫలకంపై విధిరాతౌతుంది
అక్కడ ఉలుకూ పలుకూ లేకుండా నిటారుగా నిలబడి
ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్న బాపూజీ
వీరవనితలా వస్తున్న ఆమెను చూసి
తాను కోరుకున్న స్వాతంత్య్రం దేశానికి వొచ్చిందనుకుని
తెలియనితనంతో గర్వంగా మురిసిపోతాడు
మహాత్ముడికి భక్తిభావంతో దణ్ణంపెట్టి
మంత్రదండాన్ని మమకారంతో సరిచేసుకుని
మహానగరపు రహదారుల వెంట
ఆమె క్రమశిక్షణల కవాతు చేస్తుంది
ఆమె ఆత్మీయతకి పులకించిన నగరం
నవ వధువులా కళకళగా మెరిసిపోతుంది
పెళ్లి పీటలపై కూర్చున్న కూతుర్ని చూసి
ఆనంద భాష్పాలు రాల్చే తల్లై ఆమె మరిసిపోతుంది.
పెత్తందార్లంతా విలాసవంతమై ఉష్ణపు గదుల్లో
నులివెచ్చని ఆనంద డోలికల్లో ఓలలాడుతూ
గ'మత్తు'లో తేలియాడుతూంటే-
ఆమెతో పాటు ఆమె సహచర చెత్తందార్లంతా
నగరం నిర్లజ్జగా విసర్జించిన
మలమూత్రాల్ని శుభ్ర పరిచేందుకు
నిద్ర కళ్లకు కనురెప్పల్ని నిటారుగా కాపలాపెట్టి
శ్రమిస్తూ చెమటను చిందిస్తుంటారు
వారి మెడలో మంగళసూత్రాలు
గుది బండలై వేలాడుతుంటాయి
వాటిని కట్టినోడు, వాళ్లను కట్టుకున్నోడు
పీకలదాకా సారాని మనసారా నింపుకుని
ఏ చెత్తకుండీ చెంతనో
ఏ మురికి కాల్వపక్కనో
పందిలా పొర్లి పెనిమిటిగా తన బాధ్యతనే కాదు
ప్రపంచాన్నే మరచి మొద్దు నిద్ర పోతుంటాడు
వాడితో ఏడడుగులు నడిచిన తలరాతకు
తాళిబొట్టుకూ తలవొంచి
వాళ్లంతా అమ్మలుగా మారి
వారి మూడు ముళ్ల బంధాలను
సురక్షితంగా యిళ్లకి చేరవేస్తుంటారు
'భరించేవాడు భర్త' అనేది
మగబుద్ధి మెదడుకి మేతపెట్టిన సామెతేమో?!
ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికే కాదు
మరెప్పటకీ భరించేది భార్య మాత్రమే
భర్తనే కాదు 'బాధలను, బరువులను, బాధ్యతలను కూడా....
(పారిశుద్ధ కార్మికులైన అమ్మలకు, అక్కలకు అభిమానంతో...)
పాత పాటగా వినిపించే సరికొత్త పాట
కవి:
సాహిత్యప్రకాశ్
సెల్ :
9492530542