చూపు

కవి: 
డా.వి. గీతా నాగరాణి

       చూపుల చివర్న కత్తిమొనలుంటాయని
       ఎదిగిన ఆడపిల్లల
       ఎదలో నలిపే గాయాల్ని కదిపితే చెప్తాయినెమలీకతో సుతారంగా
       చెంపలమీద నిమిరినట్లు
       అందమైన స్పర్శలే కాదు
       వేలితో తాకినా సరే
వళ్ళంతా యాసిడ్‌ పోసినట్లు
తనువుని నిలువెల్లా
విషసర్పమేదో చుట్టుకున్నట్లు
సాలెపురుగేదో పాకుతున్నట్లు
వికారపు స్పర్శలు
ఆడదానికి రెండే కళ్ళు
ఒకటి ప్రేమ
మరొకటి దయ
వాడికి వళ్ళంతా కళ్ళే
ఇంద్ర శరీరంలా..
కాంతిది రుజువర్తనమే
చూపులే వక్రీకరణం చెందుతాయి
వెల్తురు తోటలా విరబూసిన అందాల్ని
చీకటి చూపుల్తో కప్పేస్తారు
అంతరంగాల్లో ఆవిర్భవించే
పాలపుంతల కాంతిపుంజాల్ని
పట్టుకుని ఎగబాగి
నక్షత్రాల్లా ఎదగాల్సింది పోయి
ఇంద్రియ చాపల్యాలతో
మిగిలిపోయే లిల్లీపుట్లు వీళ్ళు
చూపుల్లో అనురాగం
పువ్వులా విచ్చుకోవాలి కదా
కాని వాడి చూపులో
ఆకలి విషపు కోరలా
గుచ్చుకుంటుంది.
ఆడపిల్ల అడుగు బైటపెడితే
కాళ్ళకడ్డం పడుతూ
ఎన్ని రకాల చూపులో..
నమిలి తినేసేలా కొన్ని
నిప్పు కణికలా కాల్చేసేవి మరికొన్ని..
కుట్రతో కొన్ని, కుళ్ళుతో మరికొన్ని..
స్త్రీని తంగడీ కబాబ్‌తో పోల్చే సమాజంలో
రక్షణ కోసం ఇనుప కచ్ఛడాలు
అవసరమే మరి..
ఆడవాళ్ళ మానాలకు కాదు
మురికి చూపుల మగాళ్ళ కళ్ళకు...