స్నేహం

కవి: 
డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి
సెల్ : 
990859199

    నిర్వచించలేని...మధురానుభూతి
    ఆత్మీయతను మీటే... మహతి
    స్నేహం...
    రెండు హృదయాల అనురాగస్పర్శ
    ప్రత్యక్ష పవిత్ర పరామర్శ
స్నేహం...
ఇద్దరు మిత్రుల చెలిమి
నాలుగు పిడికిళ్ల బలిమి
కష్టాలలో.. కలిసొచ్చే చెలిమి
నిఖార్సైన నేస్తం.. ఆపదలో
అందివచ్చే అభయహస్తం
స్నేహ ప్రపంచం...
అంతరంగాలను ఆవిష్కరించే
అనంతక్షీర సాగరం
మధించగా పొంగివచ్చే
అమృత భాండాగారం
రెండు దేశాల మధ్య
ప్రణాళికల సంబంధం
శాంతి, సయోధ్యల సంధి
నిండు గుండెల ఒప్పందం
స్నేహానికి లక్ష్యార్థం.. ప్రేమ
పరమార్థం.. త్యాగం
రామ సుగ్రీవుల మైత్రి
కృష్ణ, కుచేలుల అనుబంధం
రాధేయ, రారాజుల బంధం
స్నేహానికి... చిరునామా
జీవితాంతం, జీవితానంతరం
చారిత్రక శాశ్వతంగా
నిలిచిపోయే... సాక్షి సంతకం