''ధిక్కా'' రమై

కవి: 
కె.విల్సన్ రావు
సెల్ : 
8985435515

ఓటు కార్డుంది - కోటా కార్డుంది
ఆరోగ్యశ్రీ కార్డుంది - నిన్న మొన్నొచ్చిన
ఆధార్‌ కార్డూ ఉంది ...
ఏం లాభం !?
అన్నిట్లోనూ నా బొమ్మ
అలికినట్లే వుంది - గుర్తించలేనంతగాగవర్నమెంటోళ్ళు తీయించింది కదా !
ఎవరి మామూళ్ళు వాళ్ళకు ముట్టాలిమరి !
ఎక్కని గుమ్మం లేదు - దిగని గుమ్మం లేదు
పందికొక్కులు బరితెగించి బజారున పడ్డాయ్‌
నాముఖాన్ని అచ్చు నాముఖంలాగే ముద్రించటానికి
కాస్త అటూ ఇటూగానైనా...
ఇక తప్పదు
అనివార్యంగానైన
నన్ను నేను వెతుక్కుంటూ
నన్ను నేను కనిపెట్టుకుంటూ
అనేక ముఖాలుగా విస్తరించుకుంటూ
నమ్మకాన్నిచ్చే సమాజం కోసం
మహనీయూలు వేసిన బాటల్లో
శివమెత్తి, అన్యాయాన్నెదిరించే
ధిక్కార స్వరమై, నిత్యం శవాలుగ
బతుకుతున్న జాతికి దిక్కవ్వాలి....
జాగ్తేరహో జనులారా !
నోరు విప్పండి !!
మడతపడిన నాల్కల్ని సరిచేయండి !!!
కాలిబాటల్లో ముళ్ళ కుప్పల్ని తొలగిస్తూ
కాంతి దీపాల్ని వెలిగిస్తూ ముందుకు సాగుదాం-
నూతన మానవావిష్కరణ శిల్పులతో
మనమూ కంఠం కలిపి కొత్త పొద్దుల్ని ఆహ్వానిద్దాం.