రెండు చక్రాల సైకిల్ రథానికి
ఆరడుగుల నిచ్చెన ఒకవైపు
అరబకెట్ బంకముద్ద ఒకవైపు
ఒడుపుగా అమర్చి
సినీపోస్టర్లను సైకిల్ క్యారేజీకి తగిలించికార్యశూర్యుడై బయలుదేరుతాడు !
పోస్టర్లను గోడకు అంటించడమంటే
శ్వాస తీసుకున్నంత సులువూ కాదు
విశ్రాంతి తీసుకున్నంత హాయీ కాదు !
నైపుణ్యమూ, శ్రమ, బేలన్స్ మేళవిస్తేనే
అందంగా అతుకుతుంది పోస్టర్ !
మురికి కాల్వల గోడల మీద
ఉచ్చరొచ్చు గోడలపైన
పోస్టర్లను అంటిస్తున్నప్పుడు
దుర్గంధాన్ని పీల్చలేక
ఊపిరిని బంధించలేక
వాడు పడే శ్వాసయాతన
ఎంత దయనీయం !
నిలువెత్తు గోడలకు
నిచ్చెన ఆనించి, ప్రక్కకు వాలుతూ
పోస్టర్లను అంటించడమంటే
సర్కస్ విన్యాసంతో సమానమే !
అరచేతిని బంక ముద్దలో కలియబెట్టి
పోస్టర్‌కి రాస్తున్నప్పుడు
సున్నిపిండిని పిల్లాడికి రాస్తున్నట్లు
మురిసిపోతాడు !
నిచ్చెన ఎక్కుతూ ఎత్తుగోడలపై
పోస్టర్‌ని అంటిస్తున్నప్పుడు
తన పిల్లాడు తనకన్నా ఎత్తు ఎదిగినట్లు
సంబరపడిపోతాడు !
నేడు అవలంబిస్తున్న
ప్రకటనల ప్రభంజనానికి మూలమంత్రం
పోస్టర్లను అంటించడం నుండి నేర్చుకున్నదే !
మూల పురుషుడు పోస్టర్లను అంటించినవాడే !
గోడకు అతికిన పోస్టర్లలో
అందాల్నే చూస్తారు గాని
అంటించిన శ్రామికుని వైపు
కన్నెత్తైనా చూడరు !
బంక బతుకు
కవి:
పి. లక్ష్మణ్‌రావ్
సెల్ :
9441215989