నవల, కథ, కవితల పోటీ

విమర్శల విలువ
సాహిత్య రంగంలో విమర్శ రావలసినంత రావడం లేదనే మాట తరచూ వింటుంటాం. మంచి విమర్శకులకు ఈ మాట కొంచెం కష్టమనిపిస్తుంది కూడా. అయితే సాధారణ సాహిత్య చర్చకు వచ్చేప్పటికీ మాత్రం ఇది ఆలోచించవలసిన అంశమే.

 ఎందుకంటే ప్రస్థానంతో సహా వివిధ సాహిత్య పత్రికలకు లేదా పేజీలకు రాసేవారు ప్రధానంగా పొగడ్తలకు ప్రాధాన్యమిస్తున్నారు. రచనలకన్నా రచయితలకు అధికంగా స్థలం కేటాయిస్తున్నారు. వారితో తమ సంబంధాలు అనుబంధాలు ఆ సాన్నిహిత్యం వల్ల తెలిసిన వ్యక్తిగత విషయాలు ఏకరువు పెడుతున్నారు. రచననూ రచయితనూ లేదా కవినీ కావ్యాన్నీ విడదీసి చూడలేము గాని ప్రధాన భాగం సృజనకే దక్కడం న్యాయం. రచనను ప్రభావితం చేసిన మేరకే రచయిత జీవితం తప్ప అటు నుంచి ఇటు కాదు. ప్రత్యేకంగా షష్టిపూర్తి, సత్కారం, అవార్డుల బహుకరణ వంటి సందర్భాల్లో నాలుగు మాటలు చెప్పుకోడం సహజం అవసరం కూడా. అంతేగాని రచనను వదలిపెట్టి రచయిత కీర్తనగా మార్చేట్టయితే అప్పుడా పరిశీలన ప్రయోజనం పరిమితమవుతుంది. ఎందుకంటే పాఠకులందరికీ ఆ రచయితతో అంత వ్యక్తిగత పరిచయం వుండకపోవచ్చు. రెండవది వున్నవారికైనా రచన ముఖ్యం తప్ప రచయిత జీవిత దర్శనం కాదు. మూడవది వ్యక్తిగత లక్షణాలూ ప్రవర్తనలూ ఎప్పుడూ ఒకేలా వుండవు కూడా. చివరది వ్యక్తిగతం అనగానే సాహిత్యేతర అంశాలపై చర్చ అధికమయ్యే అవకాశం కూడా వుంటుంది. అందుకే ఈ విషయంలో సమతుల్యత సంయమనం చాలా అవసరం. పరస్పర ప్రశంసల వల్ల సాహిత్యలోకంలో ఒకింత ఉత్సాహం కలగొచ్చు కాని విమర్శనాత్మక దృష్టి రచయితల కలాలను మరింత పదునెక్కిస్తుంది. కనక విమర్శకులే గాక సాధారణ సాహిత్య మిత్రులు కూడా ఆ కోణంలో ఆలోచించడం అవసరం. అప్పుడు తెలుగు సాహిత్య సృజన మరింత సుసంపన్నమవుతుంది.