ఎప్పటిలానే సూర్యోదయంతో
రోజు ఒళ్ళు విరుచుకున్నది
ప్రతిరోజూ చూస్తున్న నగరమే
అదే మనుషులు, అవే మొహాలు
ఏదో హడావిడిగా పరుగులుపొట్టకూటి కోసం పడరాని పాట్లు
వైకుంఠపాళిలో నిచ్చెనలా ఎక్కేమెట్లు
పాములనోట్లో పడితే పాకుడురాళ్లు
చూసిచూసి విసుగుపుడుతున్నది
సగం జీవితం ఖర్చయినా
తరగని సమస్యల బరువు
బరువుకు తగ్గట్లు పెరగని ఆర్ధిక వనరులు
మొగుడూ పెళ్ళాల మధ్య
ఒకే కడుపున పుట్టిన బిడ్డల మధ్య
పెరుగుతున్న దూరాల కొలతలు
అన్నీ ఆర్థిక అవసరాల బంధాలే
వీళ్ళంతా నా వాళ్ళు అన్న ముసుగుని
తెరలాగా కప్పుకోవడమే జీవితం
ఎన్నేళ్ళ నుండీ చూస్తున్నా ఈ నిర్జీవ చిత్రాలని
రంగు వెలసి పోవడం తప్ప వాటికేం తెలీదు
ఈ నైరాశ్యపు దుప్పటి అప్పుడప్పుడు
నన్ను ఎందుకు చుట్టుకుంటున్నది
ఇవన్నీ అవసరం లేని ఆలోచనలా ?
ప్రశ్నలు ! ప్రశ్నలు !
మస్తిష్కాన్ని క్రమ్మేస్తున్న వందలకొద్దీ ప్రశ్నలు
బరువెక్కిన గుండెలతో
నిద్రలోకి జారుకున్నాను.
ఆ రాత్రి నిశ్శబ్దంగా గడచిపోయింది
మళ్ళు ఎప్పట్లాగే తెల్లారింది
నా గదికిటికీ తెరచాను
రోజూ చూడని దృశ్యం
కూలిపోయిన చెట్టు పక్కనే
మట్టి నుండి మొలకెత్తిన మొక్క
ఆకు పచ్చని రంగులో చిట్టి చిట్టి ఆకులతో
మంచు ముత్యాలతో తడిసి స్వచ్ఛంగా
పిల్లగాలులకు ఊగుతూ కనబడింది
అప్రయత్నంగా
పాదాలు ఆవైపుకు నడిచాయి
సుతిమెత్తగా మొక్కని సృశించాను
ఏదో నూతనశక్తి నరనరాల ప్రవహించింది
నాలో కొత్త రక్తం ప్రవహించడం మొదలైంది
చెట్ల మీద పిట్టల కిలకిల రావాలకు
ఒక చిన్న గగుర్పాటుకు లోనైంది శరీరం !
పునర్నిర్మాణంలోనే ప్రపంచం కదులుతుంది
ఒక సన్నివేశం పూర్తి అయినా
మరో సన్నివేశానికి ప్రారంభం వుంటుంది
ఆశను పట్టుకుని అడుగులు వేస్తేనే
ప్రతిరోజూ మనదవుతుందని తెలిసింది
నా నైరాశ్యపు దుప్పటిని విదిలించాను
కొత్త మనిషిగా మారి ముందుకు కదిలాను
ఇప్పుడు రోజూ చూస్తున్న దృశ్యాలే
రంగులు అద్దుకుని కనిపిస్తున్నాయి.
మనో నేత్రం విచ్చుకుంటే....
కవి:
పాతూరి అన్నపూర్ణ
సెల్ :
9490230939