నాప్రాణవాయువు నుంచీ
జీవాణువును పొంది
నా ఉదరంలోని మధుర జలకాసారంలో
నవ మాసాలు పెరిగి
నా పొత్తిళ్ళలో పసిగుడ్డుగావాడు ప్రత్యక్షమైనప్పుడు
నా జన్మకు సార్థకం అనుకున్నాను
నా ఒడిలో పడుకుని, నా రొమ్ముపాలు తాగి
హాయిగా నిదురోతుంటే
నేను అమ్మను కదా అనుకున్నాను
వాడు సంకనెక్కి, నేను చూపించే
చందమామను చూస్తూ
గోరుముద్దలు తింటున్నప్పుడు
నా భుజాలనెక్కి, ఈ లోకాన్ని చూస్తునప్పుడు
వాడు నా ప్రాణమే అనుకున్నాను
నా మోకాళ్ళపైన పడుకుని
తన చిట్టి చేతుల్ని నాకిచ్చి
ఉంగా ఉంగా అని ఊయలలూగి
తనపేరు చెబుతుంటే
నా చిరునామావాడే కదా అనుకున్నాను
నావీపు నెక్కి చల్ చల్ గుర్రం ఆడుతున్నప్పుడు
నాకు దారి చూపే నాకంటి వెలుగును కన్నాను
చదువులు చదివి పాఠాలు వల్లిస్తుంటే
నాసర్వ జ్ఞానమూ వాడే కదా అనుకున్నాను
వాడు పెరిగి పెద్దవాడై పెళ్ళి చేసుకుని
పిల్లల్ని కన్నప్పుడు, ఆ పిల్లల్లోనే
నా ప్రతిరూపాన్ని వెతుక్కున్నాను
వాడి పిల్లలకి లాలపోసి, లాగూలు వేసి
ఆడిస్తూ కబుర్లు, కథలు చెప్పుకుంటుంటే
వాళ్ళే నాలోకం అనుకున్నాను.
ముసలితనంలో కూడు పెట్టినా, పెట్టకపోయినా
ఆదరించినా, నిరాదరించినా ఇంటికి దూరం చేసినా..
నా సర్వస్వం వాడే అనుకున్నాను.
నా రక్తంలో రక్తం - నా మాంసంలో మాంసం
అలా పెరిగి నా శరీరమే అన్ని రూపాలలో
సజీవంగా నా కళ్ళ ఎదుటే కదలాడుతుంటే చూసి
సంతృప్తిగా తనువు చాలించి వెళ్ళిపోతే...
మళ్ళీ వాడే నామనవడికి కొడుకుగా
నాకునాన్నగా.. మళ్ళీ వాడే నా కొడుకుగా,
మనవడిగా, నేనే మళ్ళీ వాడి అమ్మగా
తిరిగివాడే నన్ను కనే నాన్నగా...
ఈ బంధం ఇలా సాగిపోతూనే వుండాలని కోరుకుంటాను
నిత్యమూ.... నిరంతరమూ....
అమ్మా - నాన్న - కొడుకు ఒక నిరంతర చక్రబంధం
కవి:
డా|| వి.ఆర్. రాసాని
సెల్ :
9848443610