దుఃఖం నాకో అవ్యాజమైన నేస్తం

కవి: 
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
సెల్ : 
9948774243

వర్షం వెలిసినా యిల్లు కురుస్తూనే వుంది !
ఇక ఇంటినీ నమ్మలేను !
ఈ వేళ నాకు దుఃఖమే
వో అవ్యాజమైన నేస్తమయింది !
హోరెత్తి ఘోషించే సముద్రాన్ని
నది కౌగిలించుకొన్నట్లు
నేను హృదయాన్ని అలజడెత్తించేదుఃఖాన్ని ఆలింగించుకొంటాను !
అది నాగుండె తెరమీద ఎన్ని శిధిల చిత్రాలు గీసినా
నా మేధోకుంచను ఆలోచనా రంగుల్లో అద్ది
వో మహా చిత్రాన్ని గీసేందుకుపక్రమిస్తుంటాను !
అర్థశూన్యశబ్దాలు ఆవహించిన నిశ్శబ్దాలు
అగ్నిశ్వాసల్లో భగ్నమౌతూ
ఎర్రబడ్డ అన్వేషణా నేత్రాలు !
దుఃఖోద్వేగాలూ దాహన్ని తీర్చుకునేందుకు
జ్ఞాపకాల గాయాల్ని తొలుస్తూనే వుంటాయ్‌ !
కనుగుడ్ల మీద కదిలాడే కన్నీటి చెమ్మను
కన్న్రెప్పలతో పిండుకుంటూ దుఃఖ విముక్తి కోసం
అయిష్టపర్వత శిఖరం మీద 'మినుకు'ను
ఆశాదీపమని నమ్మి
అందుకునేందుకెగ బ్రాకుతుంటాను !
అడ్డదార్ల సూత్రాలు తెలియక
దారితప్పి డీలాపడిపోతుంటాను !
నామనో ఆకాశమంతా రంగులు పులిమిన
దుఃఖపు దారులే ! అదృశ్యపు ఎడారులే !
ఏ రంగు రాస్తా ఎటు పోతుంటుందో
ఏ సుడిగుండాల్లో దూకి అంతమౌతుంటుందో
అంతుబట్టని సందర్భాలు !
ఎన్ని గాయాల సమ్మేళనమో ఈ దుఃఖం !
ఎన్ని దుఃఖాల మిశ్రమమో ఈ జీవితం !
ఏ దుఃఖానిది ఏ రంగో, ఏ వాసనో, ఏ రుచో
ఎవరికి తెలుసు ?
బహుశ : దుఃఖపు గాయాల్ని మోసే చూపుకు తప్ప !
రక్త సంబంధాలు రాగబంధాలు కాకపోయాక
అన్నీ పరాయికరణ చెందిన గాయాలే !
హృదయాకాశాన్ని భళ్లున బద్దలు గొట్టుకొని
పొద్దుటే సూర్యుడనై నేనూ నిద్రలేస్తుంటాను !
కుయుక్తి పాలకుల విభజన రేఖల క్రిందపడి
ఛిద్రమైపోతూ... నేననుకుంటాను
''దేన్ని బతికించేందుకు నేను బతకాలని !
నా అవ్యాజనేస్తమైన దుఃఖమే అంటూంది...
''రైతరికాన్ని బతికించేందుకే
నీవు బతకాలని'' !