ఇప్పుడు నేనొక ఒంటరిని
అనేక స్వప్నాల మధ్య
అనేక భయాల మధ్య
అభద్రతావలయంలో చిక్కుకుని
జీవిస్తున్న బతుకు జీవుణ్ణి
ఏ భద్రతా కవచం లేని -
అభద్రతా విషాదాన్ని
పద్మవ్యూహంలో చిక్కుకున్ననిత్య అభిమన్యుణ్ణి
జీవితం వరప్రసాదితమేకాదు
నవరసాల్లోని భయం కూడా
ప్రజారక్షకదళమైన
పోలీసు పహారాల మధ్య
కాచుకుని కూర్చున్న
విధ్వంస విప్లవపు డేగల మధ్య
నేనిపుడు ఒంటరిని
నిత్యం జరిగే దుస్సంఘటనలకు మౌనసాక్షిని
బూటకపు ఎన్‌కౌంటర్‌లకు,
హత్యలకు ప్రథమ ముద్దాయిని
నేనిపుడు సుషుప్తదేహాన్ని
నిర్ణిద్రపు జడపదార్థాన్ని
అంటరాని అస్పృశ్యుణ్ణి
వివర్ణ విషాద వదనాన్ని
నియంత్రిత వ్యవస్థలో
బతుకుతున్న నిర్భంధపు నిర్భాగ్యుణ్ణి
నిరంతర కర్ఫ్యూలో నలుగుతున్న
కనబడని మానవ గాయాన్ని
నిత్య రక్కాగ్ని హోమంలో
ఆహుతైపోతున్న యజ్ఞోపవీతాన్ని
నిత్యరావణకాష్టానికి
దగ్దమవుతున్న సామాన్య సమిధను
నిత్యం కత్తిగాట్ల కోరకు
బలైపోతున్న బలిచక్రవర్తిని
నిత్య దౌర్జన్యాల క్రీనీడలకు
దహనమవుతున్న అస్థిపంజరాన్ని
నేనిపుడు ఏకాకిని
గాయపడిన దేహం
ఏ కవిత్వాన్ని వినిపించగలదు
రక్తమోడుతున్న దేశం
ఏ శాంతిని ప్రవచించగలదు.
ఇది గాంధీ పుట్టిన దేశం కాదు
హింస జనించిన దేశం
ఇది నెహ్రూ ఆశించిన జాతి కాదు
అశాంతి నెలకొన్న దేశం
గాంధీ పుట్టిన దేశం సాక్షిగా
నేనిపుడు ఒంటరిని !
స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ సాక్షిగా
నేనిపుడు గాయపడిన దేహాన్ని !!
నేనొక ఒంటరిని !
కవి:
భీంపల్లి శ్రీకాంత్.
సెల్ :
9032844017