కాలంతో సమరం

కవి: 
పి. గోపినాథ్‌
సెల్ : 
9440572989

ఏ కాలానికీ పాడలేని కొయ్యకోయిల బొమ్మల్లా
విపత్తుల కాలంలో కూడా గొంతు విప్పకుంటే ఎలా?
కాలంతో కలిసి నడవడమంటే
కళ్ళు మూసుకుని బ్రతకడం కాదు
మూలాల్లోకి పోయికాలగర్భంలోని జీవిత శకలాలను వెదకాలి
కాలపురుషుల కాటుకు బలి అయిన
కోట్లాది బతుకులను చదివి
సాగుతున్న కాలంతో సమరం చేయాలి
కోయిల నోరు విప్పకున్నా
వసంతం తనంతట తానే వస్తుంది
నీ కాలంలో నువ్వు పోరాడకుంటే
ముందు తరాలకు చీకటి మిగులుతుంది
వయసుడిగి మూడు కాళ్ళూ ముడుచుకొని
ఒంటి కాలితోనే కుంటుతోందంటున్న కాల'ధర్మం' ముసుగు తీసి
కాలచక్రగమనంలో.... కష్టసుఖాల సంక్రమణంలో
మన మెలకువ నిద్రల మధ్యన దొంగల్లా నక్కి ఉన్నదెవ్వరో
ఒడుపుగా అందలమెక్కి తెగమెక్కి బలిసినదెవ్వరో
కనిపెట్టడమే జీవితాలను మార్చే కాలజ్ఞానం
కాలం ఏదైనా...
కళ్ళెం పట్టినోడి మార్గమే కష్టాలకు హేతువు
పీడన నెదిరించి పోరాడిన వాళ్ళనే బ్రతికించింది మృత్యువు
అమృతం జుర్రే అవకాశవాదుల మోచేతిక్రింద
ఆశలతో పట్టిన దోసిళ్ళలో
ఎంగిలి చుక్కైనా జారిపడని చోటల్లా
కన్నీళ్ళు మండి కాలం సంకక్షుభితమైంది
అక్కడే సంఘర్షణ మొదలైంది
కాల చరిత్రలోని కఠిన సత్యం ఇదే !
ప్రశాంత వసంతాలను కోరి
కాలం ముందు తలవొంచి ముడుచుకుపోయే మెదళ్ళు
కష్టాల కక్ష్యల్లోనే భ్రమిస్తూ
ఘనీభవించి పోయేగ్రహాల వంటివి
కాలానికి ఎదురీదే శక్తులు
కాలాన్ని శాసించే నక్షత్రాలకన్నా గొప్పవి
విశ్రాంతి కోసం ఎదురు చూపులు జీవితకాలమే
విముక్తి కోసమైతే... లభించేదాకా కాలంతో పోరాటమే !!