అయ్యో! చిల్లర దుకాణం...?

కవి: 
చైతన్య ప్రసాద్‌
సెల్ : 
9849651451

చింతపండు పట్రమ్మని అమ్మ చిల్లర కొట్టుకు పంపిస్తే...
షావుకారికి పావలా ఇచ్చి, చూస్తూ నిలబడేవాణ్ని !
చింతపండు కాగితంలో చుట్టిస్తూ, చిన్న బెల్లంముక్క తాయిలం పెడితే...
కృతజ్ఞతగా కళ్ళుటపటప లాడించి, తుర్రుమనేవాణ్ని!వస్తూ - దార్లో ఓ క్షణమాగి, పొట్లంలోంచి చిన్న చింతపండు గిల్లి
దాన్నీ, బెల్లాన్నీ కలిపి బుగ్గన దాచేసేవాణ్ని - ఎవరూ చూడకుండా !
'థాంక్స్‌ రా బుజ్జీ' అని అమ్మ మెచ్చుకుంటే.. 'ఊఁ'! అనే వాణ్ని నోరు తెరవకుండా...
అయినా అమ్మా పసిగట్టేసేది - 'నోట్లో ఏమిట్రా అది?' అని అడక్కముందే
'బెల్లం ముక్క - ఊరికే ఇచ్చాడు' అంటూనే కరకరా నమిలి మింగేస్తుంటే...
అమ్మ నవ్వుతూ వంటింట్లో కెళ్ళాక, 'హమ్మయ్య' అనుకునేవాణ్ని !
గత దసరా శలవులకు ఇంటి కెళ్ళినపుడు చూశా...
ఆ చిల్లర కొట్టు ఎత్తేశాడట - మెయిన్‌ రోడ్డు మీద పెట్టిన 'రిలయన్స్‌' దెబ్బకు !
ఆ షావుకారు ఇంటింటా పాల పేకెట్లు వేసుకుంటుంటే...
వాళ్ళమ్మాయి 'రిలయన్స్‌'లో పన్నెండు గంటల పనికి కుదిరిందట!
మా వీధిలో చాలా చిల్లర కొట్లు అలానే మూతపడ్డాయి.
భవిష్యత్తులో 'చిల్లర దుకాణా'లంటే తెలియవు కాబోలు !
మళ్ళీ మొన్న దసరా శలవుల కెళ్ళినపుడు గమనించా...
వాల్‌ మార్ట్‌ 'బెస్ట్‌ ప్రైస్‌' హంగామా ! 'మన టౌను కూడా ఫర్వాలేదే' అనుకున్నా !
పండుగ సరుకులకని - రిలయెన్స్‌ కెళ్ళా... బావురుమంది !
ఆఫర్లు లేవు - ట్రాలీలు తుప్పు పట్టాయి - రేక్‌లు ఖాళీగా ఉన్నాయి !
ఏ.సి., - ఓన్లీ ఫర్‌ ఎన్‌.వి. కౌంటర్‌ - స్టాఫ్‌ని వెతుక్కోవలసి వచ్చింది
సెక్యూరిటీనడిగా 'వాల్‌మార్ట్‌ తిమింగలం అందర్నీ మింగేస్తోంది' అన్నాడు
నాకాశ్చర్యం వేసింది... అప్పుడు చిల్లర కొట్లు, ఇప్పుడు 'మాల్స్‌' మూత !
రైతులకు సబ్సిడీలు లేవు సరికదా - పక్క పల్లెటూళ్ళలో పండిన పంటలన్నీ
అయిన కాడికి కమ్ముడయ్యి, వాల్‌ మార్ట్‌కు చేరుతున్నాయట - లాభాల కోసం !
అవునూ... మన దేశంలో ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండూ అమ్మడానికి
అమెరికా నుండి వాల్‌ మార్ట్‌ రావాలా? మనం దుకాణాలు మూసుకోవాలా?
మన చిల్లర దుకాణాల్ని మింగేసి, రైతుల్నీ, ప్రజల్నీ నిలువునా దోచేసిన సొమ్ము-
ఏ రోజు కారోజు తమ దేశానికి జమ చేసుకుంటుంటే... మనం చూస్తూ ఉండాలా?
'ఈస్టిండియా కంపెనీ వ్యాపారం' గుర్తు కొచ్చి - పిడికిళ్ళు బిగుసుకున్నాయ్‌ !
'దేశి సరుకులు నింపవోయ్‌!' అని గురజాడ అంటే....
'విదేశీ సరుకులు కొంపకేయ్‌!' అనే గులాంగిరీ 'నల్ల దొరల్ని'
వీధిలో జెండా కర్రకు కట్టి, 'ప్రజా తీర్పు' చెప్పించాలంటే...
దేశ స్వావలంబన కాపాడుకుంటూ, సామ్రాజ్యవాదుల దోపిడీ నెదిరించాలంటే...
'గాంధీల' బోసినోళ్ళు' ఇప్పుడు పనికి రావు - ఆయన 'చేతి కర్ర' కావాలి !
'అల్లూరి' వారసులు లేచి, వెల్లువలా ఘర్జించాలి !
వాళ్ళతో మనమంతా చేయి చేయి కలపాలి !!