పర్జన్యము

కవి: 
నూనెల శ్రీనివాసరావు
సెల్ : 
9032883206

ఏదీ ఇక్కడ
దిక్కులు పిక్కటిల్లేలా
నినదించిన
హర హర మహాదేవ
జయ జయ ద్వానాలు -
ఏదీ ఇక్కడముకుళించిన చేతుల నుండి
విద్యుల్లతలా పాకిన
భక్తి పారవశ్యాలు
తన్మయ పూనకావేశాలు -
ఏవీ ఇక్కడ
దూపదీప నైవేధ్యాల
దగదగలు
శ్రీ చందన సుమగంధాల
గుమగుమలు -
ఏవిక్కడ
నుదుటిపై అరుణోదయాన్ని
పులుముకొని
కళ కళ కదిలే
పచ్చతోరణాలు
ఏవిక్కడ
చెంగు చెంగున
లేడి పిల్లలా గంతులేసే
సెలయేటి గలగలలు -
ఏవిక్కడ నీడ నిచ్చే తరువులు
ఏవిక్కడ తోడు నిల్చేకువకువరావాలు -
అయ్యో ఏమిటిది !!!
వెలుగులు మింగేసే
చీకటి ముసురుకుందేం ?
కలలను ఊడ్చేసే
కన్నీరు పొంగుతుందేం  ?
అంతటా విరిగిపడ్డ శకలాల
మూలుగులు వినిపిస్తున్నాయేం ?
ఇంతలా నదీనదాలు రోదిస్తున్నాయేం ?
ఒక రెప్పపాటు కాలాన
వేయి పడగలెత్తి
విరుచుకు పడిన
గంగమ్మదేనా ఈ పాపం ?
అందని శిఖరాలు అందుకొన్న
అహంకారంతో విర్రవీగే
నరుని వెర్రి చేష్టలుదేనా ఈ ఘోరం ?
వెదికితే నిజాలు
శూలాలై
మన గుండెలకే
గురిపెడతాయేమో !
కదిపితే వాస్తవాలు
మన నెత్తిన
అణుబాంబులై
బద్థలౌతాయెమో !
మట్టిలో పుట్టిన మనం
ప్రకృతి ఒడిలో పాపాయిగా
పోరాడితేనే
అది చరణాలుగా విచ్చుకొని
కమ్మని పాటై పల్లవిస్తుంది -
గెలుపు బలుపుతో
శివాలెత్తి దానిపై
కత్తులు దూస్తే
కాలాంతకమై
విరుచుకుపడుతుంది -
చివరకు
నువ్వు శరణన్న దేవుడ్ని కూడా
నీతో పాటు ఊడ్చేస్తుంది.