డా|| ఎం. హరికిషన్
9441032212
అనా... బాగున్నావా... నాకు తెలుసు పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకొనేదాకా నీకు ఇంటా బైటా మస్తుగ పంచాయితీలుంటాయని. ఐనా... ఒక ఐదు నిమిషాలు అటూ యిటూ పరుగులు పెట్టకుండా మట్టసంగా ఒకతాన నిలుచుంటే నేను చెప్పేదేదో చెప్పేస్తా...ఆపైన నీ ఇష్టం. ఇంతకూ నేనెవరో చెప్పలేదు గదా... నేను మాజీ సర్పంచ్ రాజమ్మనన్నా... పార్టీ అంటావా... ఈ లోకంలో ఆడదానికి ఏ పార్టీ ఐతే ఏంలే గానీ... అదిగో ఆడ దూరంగా బడి దగ్గర జనాలంతా వరుసగా నిలబడి ఓట్లేస్తావున్నారు సూడు... అది కొత్త సర్పంచును ఎన్నుకోడానికి.
ఇంతకు ముందీడ కాంగ్రెస్సు, తెలుగుదేశమె వుండె. ఇప్పుడు వైఎస్సార్‌పార్టీ గూడా వచ్చింది. పొద్దుగూకే సమయానికంతా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తెల్సిపోతాది. ఈ సారి గూడా నేను ఎన్నికల్లో నిలబన్నా... ఏ మాటకామాట సెప్పుకోవాల గానీ నిలబన్నానని చెప్పాలంటే చానా సిగ్గుగా వుంది. అది వుత్తిత్తి మాటే. నా మొగుడు నిలబెట్నాడు.
ఆ రోజు నుంచీ నాకు ఒకటే భయం. కొంపదీసి మళ్ళా గెలుస్తానేమోనని. ఈ సారి నేను నిలబడనని నెత్తీనోరూ కొట్టుకున్నా వినకుండా ఈ సచ్చినోడు చెంపమీద రపరపరపమని నాలుగుపీకి మరీ నిలబెట్నాడు. వీని చేతులిరిగిపోనూ... ఏమిట్లా మొగున్ని పట్టుకోని తిడతావుంది అనుకుంటున్నావా... ఇంతకుముందు వెలగబెట్నా గదా ఐదు సమ్మచ్చరాల సర్పంచ్‌గిరీ... అది గుర్తుకొచ్చిందిలే...
నా మొగునికి మొదట్నించీ రాజకీయాలంటే ఒగటే జిల. రాసుకోని, పూసుకోని, కాలరెగరేసుకోని, ఖద్దరేసుకోని తిరుగుతావుంటాడు. రోడ్డు దగ్గరున్న భూములకి రెక్కలు రావడంతో ముడ్డికింద మూటలు మూలగడం ఎక్కువైంది. ఎవడెక్కిచ్చినాడో ఏమోగానీ ఈసారి సర్పంచ్ ఎలచ్చన్లలో నిలబడాలని నిర్ణయించేసుకొన్నాడు. కానీ అదేమో ఆడోళ్ళకు రిజర్వయింది. ఐనా వదుల్తేనా నన్ను ముందుకు తోస్నాడు. ఎమ్మెల్యే గూడా మద్దతుగా తలూపినాడు. దాంతో సంచులు తీసుకోని, జనాలనేసుకోని వూరిమీద పన్నాడు. అవతలోళ్ళు గూడా తక్కువ తినలేదనుకో. ఎవనికి చేతనైనంత వాళ్ళు... సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, గుట్కాలు, సిగరెట్లు, చీరలు, రవికలు, ఇంటింటికీ డబ్బులు పంచడాలు... వూరంతా పండగ చేసుకుంది.
ఎలచ్చన్లయిపోయి ఓట్లు లెక్కపెట్టడం మొదలయ్యింది. అందరి మొఖాల్లోనూ ఒగటే టెన్షన్. నాకైతే కాలూసేయీ ఆడక ఒక మూల గమ్మున కూచుండిపోయా. ఒకొక్క రౌండ్ పూర్తవుతున్న కొద్దీ టెన్షన్ మరింత పెరుగుతావుంది. రౌండు రౌండుకూ విజయం మారుతూవుంది. చివరికి రెండు రౌండ్లు మిగిలినాయి. అవతలోళ్ళకు మెజార్టీ యాభైపైన్నే వుండింది. ఆ రెండింటి మీదే మా ఆశ.
అంతకు ముందు రోజు రాత్రే వూర్లోని రెండు పెద్ద గేర్లతో ఒప్పందం జరిగింది. ''చూడు... మాది మాటంటే మాటే... ఏదో ఒకటో రెండో జారోచ్చు గాని మిగతావన్నీ గుంపగుత్తగా పడిపోతాయి. ఎంతిస్తారో చెప్పండి. మేమేం మా కోసం అడగడం లేదు. గుడికీ, చర్చీకీ అడుగుతున్నాం. ఎవరెక్కువిస్తే వాళ్ళకే మా ఓట్లు'' అన్నారు. అర్ధరాత్రి దాకా పాట సాగింది. ఆఖరికి నా మొగుడు అందరికంటే ఎక్కువకు ఒప్పుకోవడమే గాకుండా అప్పటికప్పుడు డబ్బులు చేతిలో పెట్టేసినాడు. సరిగ్గా ఆ రెండు వార్డులవి అప్పుడొచ్చినాయి. ఐనా ఏదో మూల చిన్న అనుమానం. ఈ మధ్య జనాలు ఎడమచేత్తో ఒకని దగ్గర తీసుకోని కుడిచేత్తో ఇంకొకనికి గుద్దేస్తున్నారు. కానీ కులపెద్దల పట్టు ఇంకా జారినట్టులేదు. అంతవరకూ ఆధిక్యంలో వున్న అవతలి పక్షం కాస్తా నిమిషనిమిషానికీ తగ్గిపోయింది. చివరి రౌండు ఎంచేసరికి విజయం ఇంటి ముంగిటకు వచ్చేసింది. ఆ మరుక్షణమే బైట ఒకటే అరుపులు, కేకలు, సంబరాలు.
నన్ను లోపలికి పిలుచుకోని పోయినారు. సంతకాలు చేపిచ్చుకోని గెలిచినట్లు కాగితం చేతిలో పెట్టినారు. బైట తప్పెట మోత మోగిపోతోంది. నా మొగున్ని భుజాల మీదకు ఎత్తుకోని ఎగురుతావున్నారు. ఆడోళ్ళని వూరేగిస్తే ఏం బాగుంటుంది. అందుకే నా మొగున్ని ఎత్తుకోని మురిసిపోతున్నారని సంబరపన్నా. అదీగాక నేను గెలిచినానంటే అదంతా నా మొగుని పనితనమే గదా అందుకే సంతోషపన్నా... అప్పటికే ట్రాక్టర్ తయారైపోయింది. ''చంద్రన్న జై... సర్పంచ్ చంద్రన్న... జిందాబాద్'' అని అరుస్తావున్నారు. పూలదండల్తో ముంచెత్తినారు. మా మరిది వచ్చి నన్ను తీసకపోయి ఇంటిలో దిగబెట్నాడు. తప్పెట్ల శబ్ధం అర్ధరాత్రి దాకా వినబడుతూనే వుంది. సారా వాసన వూరంతా మత్తుగా కమ్ముకుంది. ఇంట్లో నేనూ, నా కూతురూ ఒకరికొకరు తోడుగా వుండిపోయినాం.
ఆ రోజు రాత్రి అసలు నిద్రే రాలేదు. మనసంతా ఏదో ఉద్వేగం. ఆనందం. ఈ రోజుతో ఆ వూరికి సర్పంచ్ అయిపోయానని, రోడ్డు మీద పోతావుంటే అందరూ ''రాజక్కొచ్చిందిరా... సర్పంచొచ్చిందిరా'' అంటూ దండాలు పెడుతున్నట్లు, వాళ్ళ మంచి చెడ్డలు చెబుతున్నట్లు, ఆగష్టు 15కి బళ్ళో పిల్లలందరి ముందూ జెండా ఎగురేసినట్లూ, వూరికి కావాల్సిన పనులు చేయించినట్లు, మంచి పేరు సంపాదించుకోని అందరితో పొగిడించుకొన్నట్లు... ఏవేవో కలలు. ఆలోచనలు. కలత నిద్ర. అట్లా వూహల్తో కొన్ని రోజులు బాగానే గడిచిపోయినాయి. అప్పుడప్పుడు ఎవరెవరో నా మొగునితో పాటు వస్తుంటారు. ఏదేదో చెబుతుంటారు. సంతకాలు చేపిచ్చుకుంటూ వుంటారు. అర్థం చేసుకోడానికి ప్రయత్నించసాగా... మా నాయన డబ్బులకు ఎనకాడకుండా మా తమ్మున్ని బస్సెక్కించి కర్నూలులోని కాన్వెంటుకి పంపిచ్చినాడు గానీ నన్ను మాత్రం మా వూరి చిన్నబడికే తోలినాడు. అందుకే అంత తొందరగా అర్థమయ్యేవి కావు.
కానీ ఆ సంబడం ఎక్కువ రోజులు సాగలా. నాలుగో నెల జరిగిందా సంఘటన. తలచుకొంటే ఇప్పటికీ ఒళ్ళు కంపరంతో కంపించిపోతాది. ''థూ...దీనమ్మ... ఈ ఆడబతుకు'' అని నా మీద నేనే వుమ్మేసుకోవాలనిపిస్తాది.
ఆరోజు పొద్దున్నే పంచాయితీ కార్యదర్శి వచ్చి ఇంటి తలుపు తట్నాడు. నా మొగుడు ఏదో పనుందని అప్పటికే కర్నూలుకి పోయినాడు. ఇంట్లో నేనొక్కదాన్నే వున్నా. ''అమ్మా... చానా అర్జంటు. మరుగుదొడ్లు కొత్తగా కొందరికి ఇస్తారంట. కొంచెం సంతకం పెట్టు. కలెక్టరికివ్వాల. ఈరోజే ఆఖరు'' అంటూ ఓ నాలుగు కాగితాలు ముందుంచినాడు. సరే అత్యవసరమంటున్నాడు గదాని సంతకాలు పెట్టిన. ఆరోజు సాయంత్రం జరిగిందా గొడవ.
నా మొగుడు రావడం రావడం ''ఏమే... లంజా... నాకు తెలీకుండానే సంతకాలు పెట్టేటంత పెద్దదానివై పోయినావా... మొగుడనేటోడు ఒకడున్నాడు. వానికోసారి ఫోన్ చేసి కనుక్కుందామనిల్యా'' అంటూ వంగబెట్టి దభీ దభీమని నాలుగు గుద్దులు గుద్దినాడు. పుల్లుగా తాగినట్టున్నాడు. నోట్లో వాసన గుప్పుమని కొడతావుంది.
''అదిగాదు... పాపం... ఆడోళ్ళు పొద్దున్నే బైటకు పోలేక కిందామీదా అవుతుంటారు గదా... మరుగుదొడ్లు మంజూరయితే మంచిదే గదా... అందుకని'' అంటూ నీళ్ళు నమిలింది.
''అవ్... మంచిదే... గానీ... మరుగుదొడ్లు మనోళ్ళ కొస్తున్నాయో... పక్కనోళ్ళకొస్తున్నాయో... సూసుకోవద్దా'' గట్టిగా అరిచినాడు గసబెడతా...
''గెలవకముందు పరాయోళ్ళయినా గెలిచినాక అంతా మనోళ్ళేగదా... అందరితోనూ మంచిగుంటేనే గదా మంచి పేర్చొచ్చేది'' అన్నా.
అంతే గయ్యిమని పైకి లేస్తా ''అబ్బో... సర్పంచయినాక మాటకు మాట లేస్తుందే... పొగరు తలకెక్కిందే ఈ మధ్య నీకు. నీలాంటి తలబిరుసుదాంతో కాపురం కష్టమే. పో... పోవే... నా ఇంట్లోంచి'' అంటూ మెడ పెట్టుకోని బైటకి దొబ్బినాడు.
ఆ అరుపులకు కేకలకు వీధిలో అందరూ గుమిగూడ్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు.
''ఈ రోజు సంతకం చేయమంటే చేసినావు. రేపు పండుకోమంటే పండుకుంటావు. నేనంటే లెక్కా జమాలేకపోయినాక ఇంకెందుకు ఇక్కడుండడం. మళ్ళా ఈ ఇంటి గడప తొక్కినావంటే కాళ్ళిరగ్గొడతా చూడు'' అంటూ మత్తు దిగేదాకా రంకెలేస్తూ, నానా బూతులు తిడ్తూ ధడేలున తలుపులు మూసేసినాడు.
వీధిలో అందరిముందూ తల కొట్టేసినట్టనిపించింది. ఒకొక్కమాటా కత్తితో చీరేసినట్లనిపించింది. చుట్టుపక్కలున్నోళ్ళు అటువంటివన్నీ చానా మామూలే అన్నట్లు ఎవరిండ్లలోకి వాళ్లు వెళ్ళిపోతున్నారు. ఆ రోజంతా పక్కింట్లోనే పడుకోవాల్సొచ్చింది.
విషయం తెలిసి అందరూ నన్నే తప్పు పట్టినారు. ''ఆడదానివి. నోరు మూసుకోని ఇంటి పనులు చూసుకోక వూరి పెత్తనాలు నీ కెందుకు సెప్పు. వాడు చూసుకుంటాడు గదా అన్నీ'' అంటూ...
అంతే... ఆ రోజు నుంచీ బెల్లం కొట్టిన రాయిలా గమ్మునుంటూ మళ్ళా ఎప్పుడూ ఎక్కడా తలదూర్చలా. ఎవడన్నా తెలీక నా దగ్గరకొచ్చినా ముందు నా మొగుని దగ్గరికే పొమ్మని చెప్పసాగినా. నా మొగుడు గూడా నన్ను పూర్తిగా ఇంటికే బందీ చేసినాడు. నెమ్మదిగా అందరూ నన్ను మర్చిపోసాగారు. వూరోళ్ళయితే నన్నసలు పట్టిచ్చుకొనేటోళ్ళు గాదు. సర్పంచ్ లెక్క పలకరించే టోళ్ళు గాదు. ఆళ్ళ దృష్టిలో నా మొగుడే సర్పంచు. చిన్న పనైనా, పెద్ద పనైనా అంతా ఆని దగ్గరికే అధికార్లు మొదట్లో అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు గూడా దారి మార్చినారు. ఏ పనున్నా సక్కగా నా మొగునికే ఫోన్ చేసేటోళ్ళు. ఎవరొచ్చినా. ఎక్కడికెళ్ళినా అంతా నా మొగుడే. రాత్రి పూట సంతకాలు చేయడం మాత్రమే నా పని.
సరే... ఎప్పుడూ బాధేనా... సంతోషపన్న రోజు ఒక్కటీ లేదా... అని ప్రశ్నించుకుంటే నాకోసారి మాత్రం భలే సంతోషమేసింది. నా ఐదు సమ్మచ్చరాల పదవీకాలంలో అంత సంబరపన్న కాలం ఎప్పుడూ లేదు. ఇప్పటికీ అది తల్చుకుంటే చాలు ఫక్కున నవ్వొచ్చేస్తాది.
నా మొగుడు అట్లాంటిట్లాంటోడు గాదు. పెద్ద డకాటీ. వూర్లో అపోజిషన్ పార్టీవాడు ఎవడన్నా పనికోసం దగ్గరకొస్తే ''ఏంరా... నీవేమన్నా నాకు ఓటేస్తివా... అడగ్గానే వురుక్కుంటా పనిచేసి పెట్టడానికి'' అనేటోడు. అదే ఓటేసినోడు వచ్చినాడనుకో ''వాయబ్బో... భలే సంబడంగ వచ్చినావులే వూపుకుంటా... నీవేమన్నా వూకేస్తివా ఓటు. దొరికినా కాడికి గుంజలా'' అని కసిరిచ్చుకునేటోడు. అట్లాంటోడు ఒకదాంట్లో భలే ఇరుక్కున్నాడు.
ఆ మధ్య ఒక సినిమా హీరో కొత్త పార్టీ పెట్టుకొని వుత్తమాటలు చెప్పుకుంటా... గాల్లో మేడలు కట్టి చుక్కలు చూపిస్తూ... ఆఖరికి కలబన్నోళ్ళనే కర్సుకోని కలసిపోయినాడు చూడు... ఆయనంటే మా వూర్లో పొట్టెగాళ్ళందరికీ అప్పట్లో భలే మోజు. దాంతో అందరూ నా మొగుని చుట్టూ చేరి ''అనా.. అనా.. ఆ ఎన్టీవోని తర్వాత మళ్ళా అట్లాంటోడు ఇప్పుడొచ్చినాడు. సుడిగాలిలెక్క చుట్టుకోని అన్ని పార్టీలోళ్ళని ఎత్తుకపోయి బంగళాఖాతంలో పడేస్తాడు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు మన హీరోకెళ్ళి తిరుగు. మేమంతా నీ వెనుకే వుంటాం. ఏ పనైనా కాల్తో సెప్తే సేత్తో చేసి పడేస్తాం. మనోడు ముఖ్యమంత్రయితే మన దర్జానే మారిపోతాది'' అని గాల్లో కెత్తినారు. నా మొగుడు గూడా ఆని అభిమానే. మొదటిరోజు మొదటాటకు పంచపైకెగ్గట్టి పరుగులెత్తే రకం. దాంతో నక్కకు నాగలోకానికి తేడా కనుక్కోలేక ఎప్పుడు జై కొట్టే ఎమ్మేల్యేని గాదని, కొత్త పార్టీ నిలబెట్టిన ఒక పాతరెడ్డికి మద్దతిచ్చి ఇంటిపైన జండా పాతినాడు.
అది చూసి ఎమ్మెల్యేకి కోపం అరికాలినుంచి నసాళానికి అంటింది. నాకు గూడా నచ్చక వద్దని చెప్పినా... దాంతో నా మీదకు ఇంతెత్తున లేచి ''ఆడదానివి... గుద్దా మూతీ తెలీదు. నేను నిలబడ్తే కూచున్నదానివి. నాకే చెప్పొచ్చేంత దానివయినావా... మూసుకోని కూచో గమ్మున'' అన్నాడు. సరే... ఆ ఎన్నికల్లో ఏమయిందో మీకు తెలియంది కాదు. దెబ్బకి నా మొగునికి చలి జ్వరం వచ్చినట్టయింది. మళ్ళా ఆ ఎమ్మేల్యేనే గెలిచినాడు. వాడు మామూలోడు గాదు. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసేరకం.
ఒకసారి సర్పంచ్‌లకంతా సమావేశం. ఎప్పట్లాగే నా మొగుడు వూపుకుంటా పోయినాడు. దానికి జిల్లా అధికారుల్తో బాటు ఎమ్మేల్యే గూడా వచ్చినాడు. సమావేశం మధ్యలో అందరిముందూ మైకులో ''రేయ్... ఏం పనిరా నీకిక్కడ. సర్పంచ్ నువ్వా నీ పెండ్లామా. పో... పోయి నీ పెండ్లాన్ని అంపియ్యి. నువ్వుండాల్సింది గేటు కవతల్నే. ఇంగోసారి లోపల గనుక కనబన్నావనుకో... మెడపట్టి దొబ్బిస్తా... ఏమనుకున్నావో'' అని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టినాడు. ఆ దెబ్బకు నా మొగుడు తలాడ బెట్టుకోవాల్నో అర్థం గాక మొగమంతా నల్లగా చేసుకోని ఇంటికొచ్చినాడు. విషయం తెలిసి నేను లోపల్లోపల భలే నవ్వుకున్నా. ఆ నెలరోజులూ నేను పోతావుంటి మీటింగులకి నా మొగున్ని బైట నిలబెట్టి.
కానీ... ఈ సిగ్గులేనోడు అందరు రాజకీయ నాయకుల లెక్కనే మళ్ళా పార్టీ ఫిరాయించినాడు. తెలిసినోళ్ళని పట్టుకోని కుక్కలెక్క తోకాడించుకుంటా ఎమ్మెల్యే కాళ్ళ దగ్గరికి పోయినాడు నాకడానికి. దాంతో ఆయన వార్నింగిచ్చి వదిలేసినాడు. అట్లా నా సంబడం ఆ నెల రోజులు మాత్రం వుండింది.
కలెక్టర్లు, మండలాధికారులు, ఇంజనీర్లు... కిందినుంచి పై వరకూ వున్నారు గదా పెదింతమంది. ఒక్కరంటే ఒక్కరన్నా పట్టించుకుంటారా ఈ అన్యాయాన్ని. వూహూ... ఈళ్ళూ మొగోళ్ళే గదా... ఓ పెద్ద వుద్ధరించామని వీధుల్లో వీరంగాలు పోతూ తల్లుల్ని, పెండ్లాల్ని, బిడ్డల్ని ఇంట్లో పెట్టి తాళాలేసే జాతి. ఈ ఐదు సమ్మచ్చరాల్లో ఒక్క నిఖార్సయిన అధికారన్నా వస్తాడేమోనని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసినా... వూహూ... లాభం లేదు... ఆడంగినాయాళ్ళు. ఉత్సవ విగ్రహాలన్నా సమ్మచ్చరానికి ఒకసారి వూరేగుతాయి గానీ మా బతుక్కి అదీ లేదు. అందుకే బొమ్మలెక్క వుండలేక ఓడిపోతే బాగుంటుందని ఎదురు చూస్తా వున్నా...
ఏ మాటకామాట చెప్పుకోవాలగానీ... ఈ దేశంలో ఆడళ్ళకు అధికారం రావాలంటే మొగాళ్ళు జైలుకన్నా పోవాల, పైకన్నా పోవాల. దేముడు నాకంత అదృష్టం రాయలా... ఓన్నోవ్... ఏదో మాటవరసకు తమాషాగా అట్లా అన్నా... మళ్ళా నువ్వుపోయి నా మొగునికి ఎక్కించేవు. వాడసలే మంచోడు గాదు. బతికుండగానే బూంచి పెట్టే రకం... అయినా నువ్వూ మొగోనివే గదా... నీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటే... ఐనా తెలిసి తెలిసీ వుండబట్టలేక మళ్ళా మళ్ళా చెబుతానే వుంటాం... పొరపాట్న ఒక్కనికన్నా మా బాధ ఎక్కుతాదేమోనని.