కవి:
డా|| తిరునగరి
చాలులే
ఈ వెన్నెల పాటలు
జాతర పాటలు
జావళిలు
సారంగిలు
సమయంకాదిది
భువన విజయాలకు
అవధానాలకు
సంగీత కచేరీలకు
ముషాయిరాలకు
ఇక్కడ
కడుపులు కాలిపోతున్నై
గుడిసెలు తగలబడుతున్నై
నిర్మాణాలు పేలిపోతున్నై
పునాదులు కదిలిపోతున్నై
పాశవికత నృత్యం చేస్తోంది
దానవతరాజ్యం చేస్తోంది
కాము నోళ్ళు తెరుస్తోంది
మృగత్వం తాండవిస్తోంది
ఇది ఉద్రిక్త సమయం
ఇది ఉద్వేగసమయము
ఇది విహ్వలవేళ
ఇది విధ్వంసహేల
ఈవేళ
ఎవడిక్కావాలి నీ మోహనరాగం!
ఎవడిక్కావాలి ఈ మధుర సంగీతం !
ఎవడిక్కావాలి కృష్ణశాస్త్రి భావగీతం?
ఎవడిక్కావాలి గాలిబ్ గజల్ సౌందర్యం
ఈ వేళ
ముందు మృగాన్ని
మనిషిని చేయాలి
మనిషిలో మానవత ఉంటేనే కదా
ఈ కళలన్నీ
వెలగాలి
మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పే
సాహిత్య దీపాలు
కావాలి
లోకాన్ని కారుణ్యం వైపు మళ్ళించే
భావగీతాలు
రావాలి
శోకాన్ని తొలగించే, లోకాన్ని వెలిగించే
ఉషోగీతాలు
ఇక చాలులే
ఈ జావళీలు
సారంగీలు
ఈవేళ పాడు
ఈ సమాజాన్ని సంస్కరించే
చైతన్య గీతాలు.