కవి:
మధుబాబు సూర్యదేవర
సెల్ :
9550120123
ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
నా గుండె వాకిటనే
వేచి ఉన్నావు
ఎంత ఆపేక్ష నీకు
కాని దానికేం తెలుసు
నువ్వొక బూచి వంటూ
అమ్మ వొడిలో దాపెట్టింది
ఆ బాల్యం.
కాని దానికేం తెలుసు
నువ్వొక రాక్షసివని
నీ వంకే చూడవద్దని
పాఠం నేర్పింది
నే అడుగుపెట్టిన ఆ జీవితం.
ఎన్నాళ్లో ఎన్నేళ్లో
కళ్లు మూసేసుకున్నా గట్టిగా.
అయినా నువ్వు కనిపించావు
ఒక బలహీన క్షణాన
నా గుండె తలుపులు తెరుచుకువచ్చావు
ఇక చాలుపోదాం పదమంటూ
తొందరపెట్టావు.
ముచ్చెమటలు పోస్తున్నాయి
గొంతుపెగలటం లేదు.
అయినా అరుస్తున్నా
నేను రాను నేను రాను
ఇప్పుడేగా వచ్చిందంటూ
వెంటనే వచ్చేద్దామన్నావుగా ?
నిలదీశావు నువ్వు.
అప్పుడు గుర్తొచ్చింది
'ఒకసారి చూస్తానన్ను తీసుకుపో'
అంటూ అరిచి గీ పెడుతుంటే
వేగలేక సరేనంటూ తీసుకొచ్చావని
ఈ జీవితం చూపెడదామని !
మనసు ఏవో వుపాయాలు ఆలోచిస్తోంది.
'ఎలా వస్తానిప్పుడు
చూడుఎన్ని బంధాలో
అవి తెగని బంధాలు'
నిన్ను మభ్యపెట్టాలని యత్నం !
అప్పుడు నువ్వు నవ్వావు
నా అమాయకత్వాన్ని చూసి
జాలిగా నవ్వావు.
నీ నవ్వు నా గుండెను చీల్చుతుంటే
నీ నవ్వు నా మెదడును పేల్చివేస్తుంటే
విలవిల్లాడాను.
అంతలో ఏదో శబ్దం..
పుటుక్కున తెగిన శబ్దం !
అనిర్వచనీయ ప్రశాంతత!
సారీ బ్రదర్ అంటున్న ఒక స్వరం
బిక్కమొహం వేసిన ఒకరూపం
ఎవరిదో తెలియదు ఎవరో తెలియదు
కళ్ల ముందు ఏమిటది ?
తెరలు తెరలుగా.. వెలుగా? చీకటా??
ఏమో !
ఒక చల్లటి (బహుశ) స్పర్శ
నన్ను పొదువుకుని
ప్రేమ (?)గా తీసుకెళ్తోంది
- - - -
తిర్నాళ్లలో తిరిగి తిరిగి
అలసిన ఆ పిల్లాడి కళ్లు
మూతలుపడుతున్నాయి.