కవి:
నాయని కళ్యాణి శ్రీదీప్తి
సెల్ :
8125566318
ఖండాంతరాన, అంతఃరిక్షాన, భారత అతివలు అవలీలగ విహరిస్తుంటే,
ఈ అఖండ భారతం - అకృత్యాల నలిగే నెలతల నెత్తుటి కన్నీటి సెగతో
మరుగుతోంది !
భరతఖండ ఆవిర్భావం - ఓ కన్య శకుంతల శాప నివారణం,
దుర్నీతి దుష్యంతుల, దుర్మార్గ, దుశ్శాసన దుర్భర దురాగతాల దిక్కుగ
మారెనా మన భారతం !
నాడు హస్తిన నిండుసభలో పాంచాలి వస్త్రాపహరణం, కురుక్షేత్రశంఖారావం,
నేడు రాజధాని నడిరోడ్డున ''నిర్భయ'' మానభంగం, మానవత్వపతనానికి
పరాకాష్ట !
''వందేమాతరం'' నినాదాలు నినదించిన నాటి అస్వతంత్య్ర భారతం,
మగువ మానభంగాలు, అత్యాచారపు ఆక్రందనల దద్దరిల్లుతోంది ఈనాడు
స్వతంత్య్రంగా !
చట్టాలకు సవాలుగా; అత్యాచారపు ఆనవాలుగా, మిగిలిందా ''అమానత్''
ఆడబ్రతుకు;?
మూడు మౌన ప్రదర్శనలు, ఆరు ఉద్యమాలు, పది ర్యాలీలు, కాలక్రమేణా
మరుగున దాగే నిజాలు !!
మహిళా మరణ వాంగ్మూలాలు, కావాలి మరి మృగాళ్ళ మెడల ఉరిత్రాళ్ళు !!
అధికార దుర్వినియోగం, చట్టం చేతులను, న్యాయం నోరును హరిస్తుందీ !?
డబ్బు - దుర్మార్గం - దర్జాగా !!
పాలు గారు పసిపాపను నెత్తుటి ముద్దగ మార్చే పాపిష్టి పాపానికేదీ శిక్ష ?!
రాక్షస పైశాచిక పద ఘట్టనలో నలుగుతున్న మగువ మానానికేదీ రక్ష?!
పతుల హింసించే అనుమాన యమ పతుల నీచానికేదీ నిష్కృతి?!
వరకట్న వేధింపుల, వనితల తెగటార్చే అత్తల అకృత్యాల కేదీ ముగింపు !!
అభినవ కీచక, అరాచక, పైశాచిక వాంఛల పాల బిడ్డ పడతుల కేదీ
ఓదార్పు ?!
మూడేళ్ళ పసిప్రాయం, ముసలి ముదిమి కాదా, కామాంధుల కామానికనర్హం!?
ప్రకటనల పతాక ప్రతీక ''స్త్రీ'' అంగాంగ ప్రదర్శన లేదా వీటికి నిరసన ?!
మగువ మర్మాంగం కాదది; మానవ జన్మ కుహరమని తెలుపలేరా !!?
మధోన్మాధ మత్తున మగ్గిన మృగ మగాళ్ళ కుసురు పోసిందీ ఆడతనం
కాదా !!
అకృత్యాల కోరల్లో అమానుష చేష్టల్లో, పులినోట చిక్కిన లేడి కూన తీరు
''నేటి ఆడకూతురు'' !!
రాక్షస రాజకీయ, నపుంసక రక్షణ దళం, చట్టం చాటున కులికే
కులీనత్వం !
మరపురాని మణిపూర్ మనోరమ ''మానభంగం'' మానవతకి మాయని
మచ్చ !
అస్సాం కోక్రాబౌర్ ఘటన, సాయుధ సిబ్బంది దుశ్చర్య, భారత సైన్య
సిగ్గులేని తనమా !?
రద్దు కాని ''అప్పా చట్టం' బాలికా భవితల్ని కాలరాస్తూన్న సైనికదళం
లేదా వీరికి నిషిద్ధం !!?
ఆమ్ల దాడుల ప్రాణాలవిసిన కాలేజీ కన్నెలెందురో !
ఏదీ ఆ ముష్కరులకు మరణ శిక్ష !?
(సాహితీ స్రవంతి విశాఖపట్నం వారు నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన కవిత)