కవి:
అడిగోపుల వెంకటరత్నమ్
నడుస్తూనే
పాడుతూనే
ఉద్యమిస్తూనే
ఓడిపోతూనే
గెలుస్తూనే
సందేశమౌతూనే
వాళ్ళిద్దరూ బాటసారులు
ఎన్ని వసంతాలు చిగురించినా
ఎన్ని గ్రీష్మాలు ఆకులు మాడ్చినా
గొంతులు యుగళమయ్యాయేగాని
మనసులు కలవలేదు !
కాపురం చేస్తూనే
కలలు కంటూనే
పెళ్ళిళ్ళు చేస్తూనే
ఆస్తుల్ని పోగు చేస్తునే
ఆశ్రిత పక్షపాత మౌతూనే
వాళ్ళిద్దరూ భార్యా భర్తలు
ఎన్ని ఉదయాలు
అస్తమయాలు కరిగిపోయినా
మాటలు కలిశాయే గాని
మనసులు కలవలేదు !
అధ్యాయాల్ని చదువుతూనే
అభ్యాస మౌతూనే
కొత్త పాఠాలు నేర్చుతూనే
పరిశోధనలు చేస్తూనే
తులనాత్మక మవుతూనే
ఎన్నో పదాలకు
ఎన్నెన్నో అర్థాలు కూరుస్తూనే
వాళ్ళిద్దరూ గురుశిష్యులు
ఎన్ని విద్యా సంవత్సరాలు గడిచినా
చదువులు సాగాయే గాని
మనసులు కలవలేదు !
స్వప్నిస్తూనే
దుఃఖాలు ఈదుతూనే
పరాధీనం పాలౌతూనే
అపజయాల్ని జయిస్తూనే
అగ్ని పరీక్షలు నెగ్గుతూనే
ఆంక్షల్ని దాటుతూనే
వాళ్ళిద్దరూ ప్రేమికులు
ఎన్ని రేయింబవళ్ళు
కాలగమనంలో కలిసినా
ప్రేమాయణం సాగిందే గాని
మనసులు కలవలేదు !