పదపద పదపద పోరుముందుకు

కవి: 
పి.ఎన్‌.మూర్తి
సెల్ : 
7382842823
కాలం కదలిక ఆగదు - లోకం మారకతప్పదు
మనిషే మారకపోతే - మనుగడ ముందుకు సాగదు
ఈ వైనం ఈ గమనం మార్చేటందుకు
పదపద పదపద పోరు ముందుకు
ఆకూ అలములు మేసిన మనిషి - పరుల దోపిడి ఎరుగని మనిషి
నేడిందు పసందుల వినోదమందున - మునిగి తేలుతూ కొందరుండగా

పూట గడవక ఎందరో పస్తులపడి చస్తున్నారు
ఈ వైనం ఈ గమనం మార్చేటందుకు - పదపద పదపద పోరు ముందుకు
ఆత్మీయతలతో అనురాగాలతో కల్లాకపటం కానని మనిషి
నేడింద్ర భవంతుల విలాసమందున - విర్రవీగుతూ కులుకుతుండగా
నీడేకరువై ఎందరో - జీవచ్చవమై వున్నారు
ఈ వైనం ఈ గమనం మార్చేటందుకు - పదపద పదపద పోరు ముందుకు
పల్లెసీమలో చేతివృత్తులతో కళకళలాడిన స్వేచ్ఛామనిషి
తరతరములకు తరగని ఆస్తులు - కూడబెట్టుకొని కొందరుండగా
ఉన్నభూమినే అమ్ముకొని - అప్పుల నిప్పులా వేగుతున్నారు
ఈ వైనం ఈ గమనం మార్చేటందుకు - పదపద పదపద పోరుముందుకు
ప్రకృతి నియమం పరిశోధించి - ప్రగతి పధమున నిలిచెను మనిషి
నేడా ప్రగతి ఫలంబులు తేరగమెక్కిన - పాలక పంచన కొందరుండగా
చేసిన కష్టం చేతికందక - అర్ధాకలితో నలుగుతున్నరు
ఈవైనం ఈ గమనం మార్చేటందుకు పదపద పదపద పోరుముందుకు
అమ్మేదైవం అమ్మేగురువని - ఆరాధించిన మానవుడు
నేడాయమ్మకు రంగులుపూసి అంగడిలోన బొమ్మనుచేసి
వావి వరసలె విడిచిన నరుడు - మధమ్‌ హెచ్చి మృగమైనాడు
ఈవైనం ఈగమనం మార్చేటందుకు - పదపద పదపద పోరుముందుకు