అక్షర కేతనం

కవి: 
బి. కళాగోపాల్
సెల్ : 
9441631028
వర్ణమాల జలతారు కుచ్చుల కాగితపు పూదోటలో..
అక్షరాల చినుకులపై తేలియాడే భావాలను
దోసిళ్ళ కొద్దీ మది ఆస్వాదిస్తుంది !
అక్షర రసాస్వాదన అదొక తీరని దాహంలా !
అనంతంలా అక్షరం స్వాతిముత్యమై

మెరిసింది వాగ్దేవి గళసీమలో
కాళిదాసు నాలుకపై నాట్యమయూరాలు ఆ బీజాక్షరాలు !
వాల్మీకి క్రౌంచ విలాపంలో.. వాగ్రూపమై భాసిల్లాయి
రమణీయ రామాయణాక్షరాలు.
కాగితపు వృక్షాలపై అక్షరాల చిగుళ్ళను ఆరగించే
వసంత కోకిలలా, నాకలం అక్షర రవాలను
వీనుల విందుగా వినిపిస్తుంది.
ప్రపంచ నిఘంటువుల్లో అక్షరం ఒక దైవకణం !
అక్షరాలు మన నడతకు ఆనవాళ్ళు !
అక్షరాలు చరిత్ర పుటల్లో గీటురాళ్ళు !
అక్షరాలు క్షరమవని పంచభూతాలు !
అక్షరం నీ జీవిత సంతకం.
అక్షరం నీ అస్తిత్వ ఊపిరి.
నీవున్నా లేకున్నా ఆచంద్రార్కం వెలిగేది ఆ అక్షరమేగా !!
అక్షర కేతనం రెపరెపలాడాలీ అవని నిండా,
విశ్వకవుల భావ ఉద్దీపనలుగా,
అక్షరాలు కనిపించని అమ్మానాన్నలు !!!