కవి:
సిరిసిల్లా గఫూర్ శిక్షక్
సెల్ :
9849062038
ఏ బాధైనా, ఏ రాత్రైనా
ఓర్చే హృదయం, రాసేహస్తం
మొగ్గలారనిప్రాయం
కాసుల కోసం కసాయితనానికి
బలిపీఠమెక్కించె కన్నప్రేగును
మంచి రాత పేరిట
కండ్లల్లో కాంతి నింపి
ఆశల వెలుగు ఒళ్ళంతా కప్పి
చేతులు మారిన డబ్బులతో
మర్మం తెలియని మాయమాటతో
కన్న ప్రేగునే ఆమ్మేసుకుని
సాగనంపేటి బీద బతుకు.
అవకాశానికి ఎరగా
కబళించేందుకు కసిగా
మొగ్గను నులిపే రాక్షస చేతులు
మారిన చేతుకు భరోసా ఇస్తూ....
ఆడజన్మకూ ఎన్ని పాట్లు
వేటాడు సమాజ బాణాల ఎన్ని వేట్లు
నరక ప్రయాణం ప్రారంభిస్తూ
నమ్మిన హస్తం చిదిమేస్తుంటే
కలల మొగ్గల్ని తుంచేస్తుంటే
ఆర్తనాదపు కేకలతోనే
కాళరాత్రులు కన్ను మూసాయి
కార్చిన కన్నీరే
గాయాల ఉతుకులకు నీరందించాయి
ప్రతి కన్ను కామత్వపు చూపులో
సమాజ నిర్భాగ్యత కనిపిస్తుంటే
రేయి మారుతూ, గూడు మారుతుంది
కసాయి కరెన్సీ రూపు మారుతూ
పెంటగ మారిన ఒళ్ళు కూలుతున్నది
కార్చిన కన్నీటినే మళ్ళీ మళ్ళీ తాగేస్తున్నది
జన్మనిచ్చిన హృదయాల
నిస్సహాయత తలుచుకుంటు
అదిగదిగో
కన్నప్రేగులో వివక్ష చూపే
కర్కశ సమాజ సాక్షిగా
వాలేటి పొద్దు సాక్షిగా
కాలరాసేటి భవిత సాక్షిగా
అదిగదిగో ఆమె
అస్తమిస్తున్నది
కోటి కాంతులతో
సరికొత్త శక్తిగా
మళ్ళీ ఉదయించడానికి