మృతిలేనివి

కవి: 
బొమ్మరాత యల్లయ్య
సెల్ : 
9502051996
నాఊరి పొలిమేరల కొచ్చినప్పుడల్లా
స్మృతుల పరిమళాలు నన్నావహిస్తాయి
బాల్యంలోకి చటుక్కున లాక్కెళ్ళి
నన్నక్కడ బంధిస్తాయి
'అక్షరజ్ఞానం' అందించిన బడిని చూస్తుంటే

గోడ కుర్చీవేయించిన తెలుగు మాష్టారూ
లెక్కతప్పినందుకు లెంపలు వాయించిన
లెక్కల మాష్టారు గుర్తొస్తారు
అసంకల్పితంగా నా అరచేతుల్ని చూసుకుంటాను
నాచేతే బెత్తం తెప్పించి వాతలుపెట్టిన
సైన్స్‌ మాష్టారే కాదు -
వారు వెలిగించిన 'జ్ఞానజ్యోతి' స్ఫురిస్తుంది
చప్రాసీ మోగించిన 'బడిగంట'
ఇంకా 'రింగు'మంటూనే 'ఉంది' 'గుడిగంట'
చిటుక్కున మాచిట్టి చేతుల్ని గుచ్చుతూనే
గుప్పెడు పళ్ళిచ్చిన ఆరేగుచెట్టూ...
ఏడాది పొడుగునా నోరూరించిన చింతచెట్టూ
నేడుకా(చే) తలుడిగి విల్చుంటే మనసు సూరుమంటుంది
కొల్లేరులో వచ్చీరాని ఈతలు కొట్టి
సరదా సంతోషాల్ని సంచుల్నిండా పట్టుకెళ్ళే వాళ్ళం
బురద బట్టల్ని ఉతుకుతూ అమ్మతిట్టినా
ఆమట్టి పరిమళాల్ని మనసారా ఆస్వాదించేవాళ్ళం
ఈ అనంతకాల చక్రభ్రమణంలో -
జ్ఞానం పంచిన గురువులు సైతం మృతులౌతారు
పసందైన పళ్ళనిచ్చిన ఆ చెట్లూ మరణిస్తాయి
చల్లని కొల్లేరూ భళ్ళున ఎండిపోతుంది
కొన్నేళ్ళకైనా బడి కూడా శిధిలమౌతుంది
కానీ...
ఎన్నాళ్లైనా మృతిలేనివి తీయని నా 'స్మృతులే'.