కవి:
శ్రీమతి కనుపర్తి విజయబక్ష్
సెల్ :
9441382303
అమ్మ చీర కాదది అనంత దుఃఖాలకు ఉపశమనం
కళ్ళు తెరిచిందాదిగా పొత్తిగుడ్డల్లో ఒదిగిపోయింది
'ఉంగ' కొడుతు ఊఁ ఊఁ లన్నది ఆ చీరలోనె
మడత లేసిన మెత్తని చీరలోని నులివెచ్చదనం
నిద్రసుఖం, మైమరపు అన్ని యిచ్చింది అమ్మ చీరే
వెక్కి వెక్కి ఏడ్చేటి వేళ
కమ్మని నిద్రపుచ్చింది అమ్మ చీర ఊయలే
అమ్మ చీర ఊయల్లో అటు యిటు ఊగుతుంటే
లోకానికంత నేనే ఏలికైనంత గిలిగింత
అమ్మ మెత్తని ఒడిలో అడ్డంగ పడుకొని పాలుతాగుతుంటే
దిష్టి తగలకుండ అడ్డుపడింది అమ్మ చీర కొంగే
నిద్రలో భయమేస్తే బిగించి పట్టుకొంది అమ్మచీరెనే
కొత్త వారెవరైనా రారమ్మని పిలుస్తూ ముద్దు చేస్తుంటే
సిగ్గునీ భయాన్ని దాచింది అమ్మ చీర కుచ్చిళ్ళలోనే
ఎదుగుతుంటే ఆటల్లో అమ్మనయినట్లు దర్జగా
చుట్టబెట్టుకొంది అమ్మచీరనే
నేనమ్మనయ్యేక కూడా కష్టాల కన్నీళ్ళ వరదంతా
ఇంకిపోయింది అమ్మ కట్టుకొన్న చీరలోనే
అమ్మలేకున్నా అమ్మచీరే తోడీ రోజు
అమ్మ శరీరాన్నంటి పెట్టుకొన్న ఆ చీరే చేతులై
విచారంలోను వేదనలోను నా కన్నీళ్ళు తుడిచేది
నాకెన్ని చీరలున్నా అమ్మచీరతో కన్నీళ్ళొత్తుకుంటే
ఎంత ఓదార్పు ! ఎంతతోడు !!
ఎంత ఆసరా !!! ఎంత ఉపశమనం !!!!