కె. ఉషారాణి
సంపాదకులు, ప్రజాశక్తి బుక్‌హౌస్
వేమనలా తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న కవి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. వేమన సమాజాన్ని నిశితంగా పరిశీలించిన, మానవీయత మూర్తీభవించిన కవి. ఆలోచనలోని స్పష్టత అక్షరాలలోనూ ప్రతిబింబిస్తుంది. నాలుగువందల ఏళ్ళు గడిచినా ప్రతీ తెలుగు వాడి నాల్క మీద వేమన పద్యం నడయాడుతూనే ఉంది. ఆనాటి ఆధిపత్యాన్ని, హీన సంస్కృతిని, మతోన్మాదాన్ని, కుల కుచ్చితాన్ని నిర్భయంగా ఎదిరించి నిలిచాడు. ఆడంబరాలను, డాంబికాలను, డంబాచారాల్ని హేళన చేసాడు. మరో మనిషి అటువంటి పనికి పూనుకోలేదు. పేదరికం, అవమానాలు తన నమ్మకాన్ని సడలించలేదంటే వేమన ఎంతటి ధీశాలో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజాశక్తి బుక్‌హౌస్ సాంస్కృతిక తిరోగమనం వేగం పుంజుకున్న ఈ రోజు వేమన్న వెలుగులు ఆ తిరోగమనాన్ని అడ్డుకుంటాయని ఆశిస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో వేమనపై 14 పుస్తకాలు వెలువరించడం జరిగింది
వేమనను తెలుగువారికి అచ్చురూపంలో అందించింది మాత్రం ఒక ఆంగ్లేయుడు. సి.పి. బ్రౌన్ తెలుగునాట అడుగుపెట్టేనాటికి తెలుగు వెలుగులే కొడిగడుతున్నాయి. బంగోరె అన్నట్టు, మొత్తం ప్రపంచంలోని తెలుగు ఆచార్యులు, విద్యావేత్తలు, ప్రభుత్వం సహాయమందించిన పరిశోధకులు చేసిన పని ఒక్క బ్రౌన్ చేసిన దానిలో చిన్నమెత్తు కూడా ఉండదు. బ్రౌన్ తన సొంత ఖర్చుతో వేమన పద్యాల తాళ ప్రతులను సేకరించి, వాటిని పండితులతో సరిగా వ్రాయించి వాటిని ఆంగ్లంలోకి అనువదించారు. 1817లో మద్రాసు చేరే వరకు బ్రౌన్ తెలుగుకు అపరిచితుడు. 1824 వరకు తెలుగు సాహిత్యంపై పెద్దగా పట్టు సాధించలేదు. 1824లో బ్రౌన్ వేమన పద్యాలు ఫ్రెంచ్ అనువాదాన్ని చదివారు. లూయీ 15 గ్రంథాలయంలో ఆ పద్యాలతో తెలుగుపై అభిమానం పెంచుకుని పద్యాల వ్రాతప్రతులు సేకరించి 1829లో మొట్టమొదటిసారిగా 693 వేమన పద్యాలను అచ్చువేసారు. 1839లో వాటికి మరికొన్నింటిని చేర్చి 1164 పద్యాలు అచ్చువేసారు. ప్రజాశక్తి ఈ బ్రౌన్ పుస్తకాన్ని ప్రచురించింది. బ్రౌన్‌కి తెలుగు ప్రజల తరపున నివాళులర్పించింది. బ్రౌన్ తెలుగు ప్రజలకు వేమన పద్యాలను అచ్చురూపంలో అందించినా ఆనాటి బ్రాహ్మణవాదులు అందుకు అడ్డుకోను ప్రయత్నించారు. అచ్చువేసిన ప్రతులు చెత్తకుప్పల పాలయ్యాయి.
వేమనను తెలుగు పండితులు అధ్యయనం చేయడానికి మరో వందేళ్ళు పట్టింది. 1928లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సదస్సులో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ విస్తృతంగా పరిశోధించి ప్రసంగించారు. ఆ తరువాతే అనేక పరిశోధనలు వెలువడ్డాయి. అయినా రాళ్ళపల్లి వేమనపై చేసిన పరిశోధన ఒక మైలురాయి. అందుకే రాళ్ళపల్లి పరిశోధనాగ్రంథాన్ని ముద్రించింది ప్రజాశక్తి బుక్‌హౌజ్.
రాళ్ళపల్లి తరువాత అంతటి కృషి చేసింది గోపి. ఆయన మాటల్లోనే 'వేమన ఒక తాత్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం... రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూప మహాకవి వేమన. నీతుల నీరవిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘ రోగానికి చేదు మందులిచ్చిన వైద్యుడిగా, తీరాన్ని గానం చేసిన నావికుడిగా వేమన మనకు సాక్షాత్కరిస్తాడు''. అందుకే గోపి రాసిన పరిశోధనా గ్రంథం 'ప్రజాకవి వేమనను, అందుకు ధీటైన మరో గ్రంథం, 428 పద్యాలకు భాష్యం చెప్పిన గ్రంథం 'వేమన్న వెలుగులు' ప్రచురించాం. వేమన పద్యం ప్రతి ఇంట పలకాలని వేమన మతోన్మాదాన్ని, సామాజిక రుగ్మతలను, చీల్చి చెండాడి, నీతిబోధనలు చేసిన పద్యాలను తాత్పర్యాలతో 'నిత్య సత్యాలు వేమన పద్యాలనే పుస్తకాన్ని ప్రచురించాం. జన విజ్ఞాన వేదికలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కె. ఎల్. కాంతారావు గారు, ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎడిటర్ కె. ఉషారాణి దీన్ని రూపొందించారు. ఇవికాక, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు ఈ సదస్సు కోసం ప్రత్యేకంగా 19 మంది కవులు,విమర్శకుల చేత వ్రాయించిన వ్యాసాలకు సంపాదకత్వం వహించి మాకు ఎంతగానో ఉత్సాహాన్నిచ్చారు. ఈ సంకలనంలో వేమనను అనేక పార్శ్వాల నుంచి పునర్మూల్యాంకనం చేసారు. వేమనపై పరిశోధనలు చేసిన కవులు. దీన్ని ప్రచురించడం మాకెంతో గర్వకారణం. ఆ పుస్తకం పేరు 'వైతాళికుడు వేమన'. ఇవే కాకుండా రకరకాల పత్రికలలో వచ్చిన వ్యాసాలు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో ఎనిమిది పుస్తకాల రూపం ధరించాయి. ఇవి 1. వేమన కవిత్వం - ఇతర తత్వవేత్తలు 2. వేమన కవిత్వం - విశ్వ మానవత 3. వేమన కవిత్వం - సామాజికత 4. వేమన కవిత్వం - స్త్రీ 5. వేమన కవిత్వం - తాత్త్వికత 6. వేమన కవిత్వం - ఇతర భారతీయ కవులు 7. వేమన కవిత్వం - ప్రాదేశికత 8. వేమన - వీరబ్రహ్మం - ఒక సంభాషణ సమాజంలోని అన్ని పార్శ్వాలను వేమన పద్యాలలో మనం చూడగలం. ఆనాటి, ఆ తరువాత కాలంలో కూడా బుద్ధుడు, తిరువళ్ళుయర్, కబీరు, వీరబ్రహ్మం, సర్వజ్ఞుడు, వివేకానందుడు, రవీంద్రుడు, గురజాడ వంటి అభ్యుదయవాదులు, ఆలోచనాపరులు విజ్ఞులు సమాజహితం కోరి ప్రజలను చైతన్య పరిచారు. వారితో వేమన తులనాత్మక పరిశోధనలు ఎంతో ఉపయోగమైనవిగా భావిస్తున్నాం. ఎంతో శ్రమకోర్చి రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ బాధ్యతను స్వీకరించి మాకు సహకరించారు. వేమనపై ఇంకా ఎంతో పరిశోధన చేయాల్సి ఉంది. ఇప్పటికి వెలువడిన పరిశోధనలలో మైలురాయిగా నిలిచిన వాటిని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం. ఇవన్నీ ముందు ముందు పరిశోధనలు చేసేవారికి సహకరిస్తాయని ఆశిస్తున్నాం. పాఠకులు వేమన్న అందించిన వేయి వెలుగులను అందుకుని తెలుగునాడును మణిదీపాలతో నింపాలని ఆశిస్తున్నాం.